Post date: Aug 17, 2011 9:15:43 AM
హైకోర్టు మౌలిక అంశాలను విస్మరించింది
సహజ న్యాయ సూత్రాలను పట్టించుకోలేదు
నా వాదనలను పరిగణనలోకి తీసుకోలేదు
దరఖాస్తు చేసుకున్నా సీబీఐ నివేదిక నాకివ్వలేదు
శంకర్రావు దురుద్దేశాలనూ పట్టించుకోలేదు
టీడీపీ రాజకీయాన్ని కూడా విస్మరించారు
సుప్రీం తీర్పులకూ మన్నన దక్కలేదు
జగన్ తరఫున రెండు పిటిషన్లు దాఖలు
‘‘ శంకర్రావు ఆరోపణలకు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని నిర్ధారణకు వచ్చే ముందు హైకోర్టు ప్రతివాదుల స్పందనలను పరిశీలించేందుకు ఎలాంటి ప్రయత్నాలూ చేయలేదు. దర్యాప్తునకు ఆరోపణలే సరిపోతాయని ప్రాథమికంగా సంతృప్తి చెందినట్లు ఉంది. హైకోర్టు తీర్పులో పరస్పర విరుద్ధమైన అంశాలు అనేకం ఉన్నాయి. కాబట్టి ఆ తీర్పును కొట్టివేయాలి’’
‘‘ప్రభుత్వ ఉత్తర్వులన్నీ క్యాబినెట్ సమష్టి నిర్ణయాల ఆధారంగానే వస్తాయి. అవన్నీ గవర్నర్ పేరిట వెలువడుతాయి. అలాంటప్పుడు కేబినెట్ నిర్ణయాలన్నింటినీ ముఖ్యమంత్రికే ఆపాదించడం సరికాదు. కోర్టు చెబుతున్న కారణం నిజమనుకుంటే, ప్రస్తుత కేబినెట్లో ఉన్న మూడొంతుల మంది మంత్రులు కేబినెట్ నిర్ణయాలకు బాధ్యత వహిస్తూ సామూహిక రాజీనామాలు చేసి దర్యాప్తునకు సిద్ధంగా ఉండాలి’’
హైకోర్టు గనక నాకు వ్యతిరేకంగా విచారణను కొనసాగించే పక్షంలో సహజ న్యాయ సూత్రాలను పాటించాలని సుప్రీంకోర్టు 22.7.2011న ఇచ్చిన ఉత్తర్వుల్లో ప్రత్యేకంగా పేర్కొంది. ఈ వాస్తవాన్ని హైకోర్టు పట్టించుకోవాలి కదా?
సీబీఐ ప్రాథమిక విచారణ నివేదికను న్యాయమూర్తులు పరిశీలించారు. కానీ తమ దగ్గరున్న ఇండిపెండెంట్ మెటీరియల్ ఆధారంగానే తుది నిర్ణయానికి వచ్చామని పేర్కొంటూ... దాని ప్రతుల్ని నాకు ఇవ్వలేదు. మరి ఈ విషయంలో హైకోర్టు న్యాయం చేసిందనుకోవచ్చా? సహజ న్యాయ సూత్రాల ప్రకారం దాన్ని పరిశీలించే అవకాశాన్ని నాకు కూడా కల్పించాల్సిన అవసరం హైకోర్టుకు లేదా?
నమ్మదగ్గ ఆధారాలేవి?
‘‘ప్రశ్నార్థకమైన శంకర్రావు గత చరిత్రను పరిగణనలోకి తీసుకోవడంలో హైకోర్టు విఫలమైంది. డాక్టర్ పి.శంకర్రావు ప్రస్తుతం మంత్రి. అంతేకాక నా రాజకీయ ప్రత్యర్ధి. ఆయన కేంద్ర ప్రభుత్వానికి గానీ, పోలీసులకు గానీ, సంబంధిత మేజిస్ట్రేట్‌కు గానీ ఫిర్యాదులాంటివేమీ చేయలేదు. ఎఫ్ఐఆర్ కూడా దాఖలు కాలేదు. తెలుగుదేశం పార్టీ విస్తృతంగా చెలామణిలోకి తెచ్చిన ఆరోపణలను తప్ప... విశ్వసనీయమైన ఆధారాలు వేటినీ ఆయన కోర్టు ముందు ఉంచలేదు. 2004 నుంచి అవకతవకలు జరిగాయంటున్న ఆయన... ఆరేళ్ల తరువాత 2010లో హైకోర్టుకు వాటిపై లేఖ పంపారు. లేఖను హైకోర్టు పిటిషన్‌గా పరిగణించిన కొద్ది రోజులకే రాష్ట్ర ప్రభుత్వంలో ఆయనకు మంత్రి పదవి దక్కింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో కాంగ్రెస్ పార్టీయే అధికారంలో ఉంది. తాను చేస్తున్న ఆరోపణలపై పోలీసులు చట్ట ప్రకారం దర్యాప్తు చేస్తారా.. లేదా అనే విషయంలో తనకు ఎటువంటి భయాందోళనలున్నాయో శంకర్రావు లేఖలో ఎక్కడా పేర్కొనలేదు. గత ఏడేళ్లలో శంకర్రావు ఇప్పుడు లేవనెత్తిన అంశాలను శాసనసభలో, ఇతర ప్రజాస్వామ్య వేదికలపై గానీ లేవనెత్తారనేందుకు ఆధారాలేవీ లేవు.
నాకున్న జనాదరణను, రాజకీయ మద్దతును... ప్రజల్లో నా తండ్రి రాజశేఖరరెడ్డికున్న అపార ప్రతిష్టను దెబ్బతీసే యత్నాల్లో భాగంగానే శంకర్రావు హైకోర్టుకు లేఖ రాసినట్లు స్పష్టమవుతోంది. న్యాయస్థానాలను వేదికగా చేసుకుని రాజకీయ పోరాటాలు సాగించే ప్రత్యర్థుల చేతుల్లో తమకు తాము ఆయుధాలుగా మారేందుకు కోర్టులు అంగీకరించరాదు. శంకర్రావు తన లేఖ, అఫిడవిట్లలో దురుద్దేశపూర్వకమైన ఆరోపణలు చేయడం మినహా, పోలీసులను ఆశ్రయించి ఎందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేయించలేదో.. సీఆర్పీసీ సెక్షన్ 156(3) కింద సంబంధిత మేజిస్ట్రేట్ ముందు ఎందుకు ఫిర్యాదు చేయలేదో.. అవినీతి నిరోధక చట్టం, మనీ లాండరింగ్ నిరోధక చట్టాల కింద కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకు ఆశ్రయించలేదో వివరించేందుకు ఎలాంటి ప్రయత్నం చేయలేదు.’’
- వై.ఎస్. జగన్మోహన్రెడ్డి
న్యూస్‌లైన్, హైదరాబాద్: జగతి పబ్లికేషన్స్, సాక్షి టీవీలలో పెట్టుబడులు, తన ఆస్తులపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశిస్తూ ఈ నెల 10న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును జగన్మోహన్రెడ్డి సుప్రీం కోర్టులో సవాల్ చేశారు. హైకోర్టు తీర్పు అమలును, తదనుగుణ చర్యలన్నింటినీ నిలిపివేయాలని కోరుతూ మంగళవారం ఆయన తరఫున రెండు, జగతి పబ్లికేషన్స్ తరఫున మరొకటి స్పెషల్ లీవ్ పిటిషన్లు దాఖలయ్యాయి. శంకర్రావు లేఖ, తెలుగుదేశం నాయకులు ఎర్రన్నాయుడు, బెరైడ్డి రాజశేఖర్‌రెడ్డి, అశోక్ గజపతిరాజు దాఖలు చేసిన వ్యాజ్యాల ఆధారంగా హైకోర్టు తీసుకున్న నిర్ణయంపై అభ్యంతరాలను వైఎస్ జగన్ సర్వోన్నత న్యాయస్థానం ముందుంచారు.
ఆరోపణల్లోని నిజానిజాల జోలికి వెళ్లకుండానే సీబీఐ దర్యాప్తునకు కోర్టు ఆదేశించిందని, కోర్టు పూర్తిగా పిటిషనర్ రాసిన లేఖ, అఫిడవిట్లలోని అంశాలపైనే ఆధారపడటం వల్ల ఆ తీర్పు చెల్లుబాటుపై నిర్ణయం తీసుకోవాలని సర్వోన్నత న్యాయస్థానానికి నివేదించారు. ‘‘దీన్లోని ప్రతి ఆరోపణనూ దర్యాప్తు చేయటం, ప్రతివాది కంపెనీల్లోకి వచ్చిన ప్రతి పెట్టుబడిలోని నిజాయితీని, చెల్లుబాటును పరిశీలించటం.... ఆ పెట్టుబడి పెట్టిన కంపెనీలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందినందుకే అలా చేశాయా? అనేది ఈ రిట్ పరిధిలో సాధ్యం కాదు. ప్రతి పెట్టుబడినీ శోధించాలంటే దానికి సంబంధించిన అధికారిక రికార్డుల్ని, ఖాతాల్ని, సంబంధిత లావాదేవీల్ని పరిశీలించటం తప్పనిసరనేది మా ఉద్దేశం. అలా చేయటమంటే ఈ రిట్ పరిధిని ఇన్వెస్టిగేటివ్ ఎంక్వయిరీకింద మార్చటమే. దానికిక్కడ అనుమతి లేదు’’ అని తీర్పులో హైకోర్టు ధర్మాసనం పేర్కొనడాన్ని జగన్మోహన్రెడ్డి తన పిటిషన్లలో ప్రస్తావించారు. ‘‘ శంకర్రావు ఆరోపణలకు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని నిర్ధారణకు వచ్చే ముందు హైకోర్టు ప్రతివాదుల స్పందనలను పరిశీలించేందుకు ఎలాంటి ప్రయత్నాలూ చేయలేదు. దర్యాప్తునకు ఆరోపణలే సరిపోతాయని హైకోర్టు ప్రాథమికంగా సంతృప్తి చెందినట్లు ఉంది. హైకోర్టు తీర్పులో పరస్పర విరుద్ధమైన అంశాలు అనేకం ఉన్నాయి. కాబట్టి ఆ తీర్పును కొట్టివేయాలి’’ అని జగన్మోహన్రెడ్డి అభ్యర్థించారు. తీర్పులోని 50 నుంచి 52 పేరాలను పరిశీలిస్తే, శంకర్రావు చేసిన ఆరోపణలను తిరిగి ప్రస్తావించి వాటి పట్ల హైకోర్టు సంతృప్తి చెందినట్లు కనిపిస్తోందని, ఈ విషయంలో తమ కౌంటర్‌ను హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదని పేర్కొన్నారు. శంకర్రావు ఆరోపణల నిర్ధారణకు హైకోర్టు ఎటువంటి కారణాలనూ చూపలేదని, తమ స్పందనను కూడా పట్టించుకోలేదని విన్నవించారు. అందువల్లే హైకోర్టు తీర్పును సవాలు చేయాల్సి వచ్చిం దని వివరించారు. ‘‘ప్రభుత్వంతో కుదిరిన ఒప్పందం ఆధారంగానే నా కంపెనీల్లో పలువురు పెట్టుబడులు పెట్టారనేందుకు ఒక్కటంటే ఒక్క ఆధారాన్ని కూడా హైకోర్టు చూపలేదు. ప్రతిఫలంగా పెట్టుబడులు పెట్టారనేందుకు ఒక్క ఆధారం కూడా చూపకుండా ఈ పిటిషన్‌ను నాకు వ్యతిరేకంగా విచారించడం చెల్లదు. ప్రభుత్వ ఉత్తర్వులన్నీ కేబినెట్ సమిష్టి నిర్ణయాల ఆధారంగానే వస్తాయి. అవన్నీ గవర్నర్ పేరిట వెలువడుతాయి. అలాంటప్పుడు కేబినెట్ నిర్ణయాలన్నింటినీ ముఖ్యమంత్రికే ఆపాదించ డం సరికాదు. ఒకవేళ కోర్టు చెబుతున్న కారణం నిజమనుకుంటే, ప్రస్తుత కేబినెట్లో ఉన్న మూడొంతుల మంది మంత్రులు కేబినెట్ నిర్ణయాలకు బాధ్యత వహిస్తూ సామూహిక రాజీనామాలు చేసి దర్యాప్తునకు సిద్ధంగా ఉండాలి’’ అని జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. శంకర్రావు ఆరోపణలకు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయా లేదా అనేది ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసి ఉంటే వెల్లడయ్యేదని, కానీ ఇలా కౌంటర్ దాఖలు చేయకుండానే హైకోర్టు నిర్ణయం తీసుకోవటం సబబు కాదని నివేదించారు.
అది.. రిట్గానే అనర్హం
రిట్ ప్రొసీడింగ్స్ ద్వారా క్రిమినల్ ప్రొసీడింగ్స్ జారీ చేయడానికి వీలు లేదని, హైకోర్టులు స్టేషన్హౌస్లుగా మారరాదని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పిందని, అయితే దురుద్దేశాలతో శంకర్రావు దాఖలు చేసిన వ్యాజ్యాన్ని విచారించిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇక్కడ స్టేషన్హౌస్గా మారిందని జగన్మోహన్రెడ్డి నివేదించారు. ‘‘ఎమ్మార్ ప్రాపర్టీస్ వ్యాజ్యాన్ని, అందులో ఉత్తర్వులను హైకోర్టు పదేపదే ప్రస్తావించింది. వాస్తవానికి ఎమ్మార్ కేసుకూ, ఈ వ్యాజ్యానికీ ఎలాంటి సంబంధమూ లేదు. ఎమ్మార్ కేసులో నేను ప్రతివాదిని కూడా కాదు. కోర్టులను ఆశ్రయించలేని నిస్సహాయులు, పేదలు, నిజమైన ప్రజాప్రయోజనాలను ఆకాక్షించే స్వచ్ఛంద సంస్థలు లేఖ రాసినా వాటిని విచారించేందుకు కోర్టులు తమ న్యాయ పరిధిని ఉపయోగించవచ్చునని సుప్రీంకోర్టు చెప్పింది. కానీ ఓ అధికార పార్టీ ఎమ్మెల్యే రాసిన లేఖ విషయంలో హైకోర్టు తన పరిధిని ఉపయోగించింది. ప్రధాన న్యాయమూర్తి అసలు ఈ వ్యాజ్యాన్ని రిట్ పిటిషన్‌గా తీసుకుని ఉండకూడదు. రిట్ ఆఫ్ మాండమస్‌ను కోరుతూ లేఖ రాసినప్పుడు, మొదట సంబంధిత అధికారులను ఆశ్రయించాలని, అధికారులు ఫిర్యాదుపై తగిన విధంగా స్పందించకుంటే అప్పుడు తమను ఆశ్రయించాలని చెప్పడం ఉన్నత న్యాయస్థానాల్లో సర్వ సాధారణం. ఎఫ్ఐఆర్ను నమోదు చేయకుండా పోలీసులు లేదా సీబీఐ అధికారులు నిరాకరిస్తున్నారనే సమస్య శంకర్రావుకు లేదు. అలాంటప్పుడు ఆయన రాసిన లేఖను రిట్ పిటిషన్‌గా విచారించడం హైకోర్టుకు ఎంత మాత్రం సమంజసం కాదు. సీబీఐ చేతో, ఇతర అధికారుల చేతో దర్యాప్తు చేయించండంటూ వచ్చే అభ్యర్థనలను అనుమతించేముందు హైకోర్టు తనను తాను నియంత్రించుకోవాలి. నిజమైన సహాయం అవసరమైన వారి హక్కులను పరిరక్షించేందుకే కోర్టులు తమ న్యాయ పరిధిని ఉపయోగించాలి. ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే దర్యాప్తు ఆదేశాలు ఇవ్వాలి’’ అని వివరించారు.
నాకు నివేదికే ఇవ్వలేదు...
వివిధ సందర్భాల్లో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పులను పరిగణనలోకి తీసుకుంటే.. ప్రస్తుత కేసులో శంకర్రావుకు సంబంధించి ఎటువంటి ప్రాథమిక హక్కుల ఉల్లంఘనా జరగలేదని, కాబట్టి శంకర్రావు వ్యాజ్యాన్ని ఆదిలోనే కొట్టివేసి ఉండాల్సిందని జగన్మోహన్రెడ్డి సుప్రీం కోర్టుకు విన్నవించారు. ‘‘విశ్వనాథ్ చతుర్వేది కేసుపై ఆధారపడి సీబీఐ ప్రాథమిక విచారణకు హైకోర్టు ఆదేశించింది. అయితే విశ్వనాథ్ చతుర్వేది కేసును సుప్రీంకోర్టు ఇప్పుడు పునఃసమీక్షిస్తోంది. దానిపై సుప్రీంకోర్టు తీర్పును వాయిదా వేసింది కూడా. అసాధారణమైన కేసుల్లోనే సుప్రీంకోర్టు పునఃసమీక్ష చేపడుతుంది. ప్రతివాదుల అభ్యర్థనలను, వారు చూపిన ఆధారాలను విశ్లేషించకుండా కేవలం అనుమానాల ఆధారంగా దర్యాప్తునకు ఆదేశించడం కుదరదని సుప్రీంకోర్టు ఇప్పటికే స్పష్టం చేసింది. నాపై కేసు నమోదు చేయాలని ఆదేశించడం ద్వారా సీబీఐ ప్రాథమిక విచారణ నివేదికపై హైకోర్టు ఆధారపడినట్లు స్పష్టమవుతోంది. లేని పక్షంలో సీబీఐ నిబంధనావళి ప్రకారం కేసు నమోదు ప్రాథమిక విచారణ ఫలితంపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి హైకోర్టు ఈ విషయంలో సరిగా వ్యవహరించలేదు. సీబీఐ ప్రాథమిక విచారణ నివేదిక తాలూకు సీల్డ్ కవర్‌ను తెరిచిన హైకోర్టు, నివేదికను పరిశీలించి, దానిని తిరిగి సీల్ చేసింది. అయినప్పటికీ సీబీఐ నివేదిక మీద ఆధారపడకుండా స్వతంత్రంగా ప్రాథమిక ఆధారాలతో సంతృప్తి చెందుతున్నామంటూ.. నాకు నివేదిక ఇచ్చేందుకు నిరాకరించింది. ఇది సహజ న్యాయసూత్రాలకు విరుద్ధం. ఒక కేసును నిర్ణయించే సమయంలో పక్షపాతం లేకుండా సహజ న్యాయసూత్రాలను పాటించినట్లు కనిపించాలి. కాని ప్రస్తుత కేసులో సీబీఐ ప్రాథమిక నివేదికలోని అంశాలను పరిశీలించిన తరువాత హైకోర్టు నాకు వ్యతిరేకంగా పక్షపాతంతో వ్యవహరించిందని గట్టిగా చెప్పేందుకు అవకాశం ఉంది. నాకు వ్యతిరేకంగా ముందుకెళ్లాలనుకుంటే సహజ న్యాయసూత్రాలను పాటించాల్సి ఉంటుందని... నేను ఇదివరకు దాఖలు చేసిన ఎస్ఎల్పీ విచారణ సందర్భంగా హైకోర్టునుద్దేశించి సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. కాని సుప్రీంకోర్టు అభిప్రాయాన్ని హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. సీబీఐ నివేదిక కాపీ కోసం పిటిషన్ దాఖలు చేసినప్పటికీ, అది ఏ కారణం వల్లో విచారణకు రాలేదు. సుప్రీంకోర్టు చెప్పిన విషయాన్ని హైకోర్టు తన తీర్పులో 38వ పేరాలో ప్రస్తావించింది. అయినప్పటికీ సీబీఐ నివేదికను నాకు ఇవ్వకపోవడాన్ని చూస్తుంటే, సీబీఐ నివేదిక ప్రభావానికి హైకోర్టు లోనైనట్లు కనిపిస్తోంది.’’ అని పేర్కొన్నారు.
టీడీపీ నేతల వ్యాజ్యంపై...
తెలుగుదేశం నాయకులు దాఖలు చేసిన వ్యాజ్యాన్ని హైకోర్టు పరిగణనలోకి తీసుకోవటంపై జగన్మోహన్రెడ్డి కొన్ని అభ్యంతరాలను వ్యక్తం చేశారు. పిటిషన్ దాఖలు చేసిన ఎర్రన్నాయుడు, బెరైడ్డి రాజశేఖర్‌రెడ్డి, అశోక్‌గజపతి రాజు... ఈ ముగ్గురూ తనకు రాజకీయంగా ప్రత్యర్థి పక్షం వారనే విషయాన్ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పరిగణనలోకి తీసుకుని ఉండాల్సిందని నివేదించారు. పిటిషనర్లు టీడీపీ నేతలని, తన నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర రాజకీయాల్లో అధికార, ప్రతిపక్షాలకు ప్రత్యామ్నాయంగా మూడో శక్తిగా ఎదుగుతున్నందునే వెరపుతో తన సంస్థల్లో పెట్టుబడులు, ఆస్తులపై పిటిషన్ దాఖలు చేశారని అత్యున్నత న్యాయస్థానానికి తెలిపారు. తద్వారా తనపై దురుద్దేశపూర్వకంగా, తన వ్యక్తిత్వాన్ని కించపరిచే లక్ష్యంతో పిటిషన్ దాఖలు చేసినట్టు స్పష్టమవుతోందన్నారు. ‘‘అక్రమాలు స్పష్టంగా కనిపిస్తున్నప్పుడు’’ అంటూ హైకోర్టు ముందుగానే తీర్మానించటం ద్వారా తెలుగుదేశం నేతల దురుద్దేశాలను విస్మరించినట్లయిందని ఎస్ఎల్పీలో నివేదించారు. ముందుగానే ఈ టీడీపీ నేతలు 2004-09 మధ్య ఎమ్మెల్యేలుగా ఉన్నా, 2011లో రిట్ పిటిషన్ దాఖలుకు ముందు వారు ఎలాంటి ఫిర్యాదూ చేయకపోవటాన్ని సుప్రీంకు నివేదించారు. హైకోర్టు కేవలం రిట్ పిటిషనర్ల ఆరోపణలను పరిగణనలోకి తీసుకుని తన తీర్పులో అదే ఆరోపణల్ని ఉటంకించిందని, వాటికి సమాధానంగా తన తరఫున దాఖలైన 62 పేజీల కౌంటర్‌ను పరిగణనలోకి తీసుకోలేదని జగన్మోహన్రెడ్డి సర్వోన్నత న్యాయస్థానానికి విన్నవించారు.