Post date: May 14, 2011 6:20:13 AM
మనమంతా పెద్ద కుటుంబమని నిరూపించారు
మహానేత ఆశయాల కోసం తపించే మాకు అండగా నిలిచారు
దేశంలోనే ఇది ఒక చారిత్రక సంఘటన
ఇచ్చిన మాట తప్పే రాజకీయాలకు చరమగీతం ఈ విజయం
తెలుగుజాతి ఆత్మగౌరవానిది ఈ విజయం
హైదరాబాద్, న్యూస్‌లైన్: వైఎస్ఆర్ జిల్లాలో కడప లోక్‌సభ, పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల్లో భారీ మెజారిటీతో ఘన విజయం సాధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు వైఎస్ జగన్మోహన్రెడ్డి, వైఎస్ విజయమ్మ తమ విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి ఒక ప్రకటన విడుదల చేశారు. దాని పూర్తి పాఠం...
కడపలో గడప గడపకూ నమస్తే...
మహానేత వైఎస్ దూరమయ్యారని మేమంతా దుఃఖంలో కూరుకుపోయాం. కానీ ఆయన మాతోనే, మీలోనే ఉన్నారన్న నమ్మకం పదే పదే కలిగించారు. మమ్మల్ని పద్మవ్యూహంలో బంధించాలని ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ఎదురొడ్డి పోరాడే ధైర్యాన్నిచ్చారు. మహానేత ఆశయాల కోసం అనుక్షణం తపించే మాకు కొండంత అండగా నిలబడ్డారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మీరు ఉంచిన అచంచలమైన విశ్వాసానికి మేము సదా రుణపడి ఉంటాం. ఈ దేశ రాజకీయాలను మార్చే సత్తా ప్రజాస్వామ్యానికి మాత్రమే ఉందని మీరు మరొక్కసారి రుజువు చేశారు. మనమంతా నిజంగానే ఒక పెద్ద కుటుంబమని నిరూపించారు. దేశంలోనే ఇది ఒక చారిత్రక సంఘటన. ఇదొక చారిత్రక విజయం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఎవరి సానుభూతి అక్కర్లేదని ఈ రాష్ర్ట ప్రజలు ఎవరి అవమానాలను భరించరని, ఎవరి నమ్మక ద్రోహాన్ని సహించలేరని రాష్ర్ట ప్రజలందరి తరఫున కడపలో ప్రతి గడపా చాటి చెప్పింది. ప్రజా సంక్షేమాన్ని ప్రభుత్వాలు ఎప్పుడు నిర్లక్ష్యం చేసినా ప్రజలు చూస్తూ ఊరుకోరని ఈ విజయంతో దిక్కులు పిక్కటిల్లేలా నినదించారు. ఇచ్చిన మాట తప్పే రాజకీయాలకు చరమగీతం ఈ విజయం. విశ్వసనీయతకు నిలువెత్తు నిదర్శనం ఈ విజయం. మహానేత వైఎస్ఆర్కు నిజమైన నివాళి ఈ విజయం. తెలుగుజాతి ఆత్మగౌరవానిది ఈ విజయం.
ఇప్పుడు కడప చూపించిన దారి చరిత్రాత్మకమైనది. రాష్ట్ర రాజకీయాలకు ఇదొక మేలిమలుపు. తెలుగువారందరి దీవెనలతోనే ఈ చిరస్మరణీయమైన విజయం సాధ్యమైంది. ఈ రాష్ట్రంలో ప్రతి గడపా వైఎస్‌ను తమ వాడు అనుకోబట్టే వాళ్ల ఆశీస్సులు, ప్రేమ, ఆప్యాయత ఇంత గొప్ప విజయాన్ని అందించాయి. ప్రతిపక్షంలో ఉన్నామన్న మాట కూడా మరిచి ప్రజా సమస్యలను గాలికి వదిలేసి మొసలి కన్నీరు కారుస్తున్నారు కొందరు నేతలు. దివంగత నేత మనకు దూరమై రెండు సంవత్సరాలు అవుతున్నా, ఆ మహానేత తిరిగి రాలేడని, సమాధానం చెప్పలేడని తెలిసీ బురద చల్లటానికి మాత్రమే ప్రజా సమయాన్ని కేటాయిస్తున్న తెలుగుదేశం పార్టీకి గట్టిగా బుద్ధి చెప్పేలా పిలుపునిచ్చారు కడప ప్రజలు. విలువలను, విశ్వసనీయతను మరచిన కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పారు. మహానేత వైఎస్ఆర్ ఆశయాలను, సువర్ణయుగాన్ని సాధించుకోగలమనే నమ్మకాన్ని ఓటు వేసి మరీ కలిగించారు.
రాబోయే రోజుల్లో రాష్ట్రంలో పెను మార్పుకు నాంది పలికారు. ఏ పార్టీకైనా, నాయకుడికైనా మాట తప్పని, మడమ తిప్పని నైజమే నిజమైన నిర్వచనమని మీ తీర్పుతో నిరూపించారు. ఈ విజయం మనందరికీ గొప్ప ఆనందాన్ని తీసుకొచ్చింది. ఈ విజయమే వైఎస్ఆర్ను మళ్లీ జనంలో ఉదయించేలా చేసింది. ఈ విజయమే వైఎస్ఆర్ ఆశయాలను కొనసాగించాల్సిన గొప్ప బాధ్యతను కూడా గుర్తు చేసింది. ఈ విజయమే ఆ మహానేత కోరుకున్న హరితాంధ్రప్రదేశ్ సాధనకు బంగారు బాట వేసింది. మన జెండా... వైఎస్ఆర్ ఎజెండా. వైఎస్ఆర్ కాంగ్రెస్ జెండా మోసిన ఉద్యమకారులైన ఓటరు దేవుళ్లకు వందనం. తొలి అడుగులోనే పార్టీని ఇంత ఘన విజయంతో స్వాగతించిన అక్కకు, చెల్లికి, అవ్వకు, తాతకు, సోదరుడికి, స్నేహితులకు ప్రతి ఒక్కరికీ పేరు పేరునా శిరస్సు వంచి చేతులు జోడించి హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నాం.
ఇట్లు
వైఎస్ జగన్మోహన్రెడ్డి
వైఎస్ విజయమ్మ