Post date: Aug 18, 2011 5:55:26 AM
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గట్టు
కిరణ్ సర్కారు వైఎస్ పథకాలను తుంగలో తొక్కుతోంది
ప్రభుత్వ వైఖరికి నిరసనగా మండల కేంద్రాల్లో నిరసనలు
దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి సంక్షేమ పథకాలకు తూట్లు పొడుస్తున్న రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈనెల 22న అన్ని మండల కేంద్రాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిరసనలు, ధర్నాలు నిర్వహిస్తుందని ఆ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు తెలిపారు. పేదలు, బడుగులను దృష్టిలో ఉంచుకుని వైఎస్ పథకాలు చేపడితే వాటన్నింటినీ కిరణ్ సర్కారు తుంగలోకి తొక్కుతోందని మండిపడ్డారు.
బుధవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన విలేకరుల తో మాట్లాడుతూ.. ‘‘ఈ ప్రభుత్వం రేషన్ కార్డులు, పింఛన్లలో కోత విధించి ప్రజాద్రోహానికి పాల్పడుతోంది. ఓవైపు వైఎస్ పథకాలను నీరుగారుస్తూ మరోవైపు తామే ఆయనకు వారసులమని చెప్పుకోవడానికి ఈ ప్రభుత్వ నేతలకు సిగ్గులేదా’’ అని ప్రశ్నించారు. సీఎం కిరణ్.. వైఎస్ పేరు చెప్పుకుంటూ చంద్రబాబు విధానాలను అనుసరిస్తున్నారని విమర్శించారు. వైఎస్ మరణించిన తరువాత రాష్ట్రంలో కొత్తగా ఒక్క రేషన్ కార్డు అయినా ఇచ్చారా? ఒక్క పింఛనైనా ఇచ్చారా.. అని నిలదీశారు. వైఎస్ 64.72 లక్షల రేషన్ కార్డులు ఇస్తే ప్రస్తుత ప్రభుత్వం వాటిలో 18 లక్షల కార్డులను రద్దు చేసిందన్నారు. అమీర్పేట భూ కుంభకోణంలో రోశయ్యకు ఏసీబీ క్లీన్చిట్ ఇచ్చిన విషయాన్ని ప్రస్తావించగా.. ‘‘రోశయ్య కాంగ్రెస్లో ఉన్నారు కనుక క్లీన్చిట్ లభించింది. కాంగ్రెస్ను వీడితే ఆయనపైనా సీబీఐ విచారణకు ఆదేశించేవారు’ అని అన్నారు.