Post date: Jul 31, 2011 7:7:8 AM
*మంత్రాలయం వద్ద జోరువానలోనూ అడుగు కదలని జనం
*జన తాకిడితో 48 గంటల ఆలస్యంగా సాగుతున్న ఓదార్పు
*ఆగస్టు 2 వరకు యాత్ర పొడిగింపు
శనివారం.. మధ్యాహ్నం ఒంటిగంట.. గురు రాఘవేంద్రుని సన్నిధానం మంత్రాలయం.. జనంతో కిటకిటలాడుతోంది.. ఆత్మబంధువు ఇక్కడికి రావలసిన సమయం. మూడు గంటలు దాటుతున్నా ఆయన జాడ లేదు.. క్రమంగా ఆకాశం మేఘావృతమైంది. క్రమం గా తుంపర్లు.. నాలుగు గంటలకు వాన మొదలైంది. అయినా అక్కడ వేచి చూస్తున్న జనం కదల్లేదు. ఇంతలో ‘జగనన్న మాధవరంలో ఉన్నారు, మరో అర గంటలో ఇక్కడకు వస్తున్నారు’ అంటూ నిర్వాహకులు మైక్‌లో చెప్పారు. ఆయనకు స్వాగతం చెప్పేందుకు జనం మఠం గోశాలవైపు పరుగులు పెట్టారు. సరిగ్గా 4.45కు వర్షం కాస్తా భారీ వర్షంగా మారింది. అయినా కూడా ఒక్కరంటే ఒక్కరు కూడా తలదాచుకోవడానికి ప్రయత్నించ లేదు.
4.55కు వైఎస్ జగన్మోహన్రెడ్డి మంత్రాలయం చేరుకున్నారు. జగన్‌ను చూడగానే జనంలో సంతోషం కట్టలు తెంచుకుంది. ‘జగనన్నకు జై’... ‘రైతు బిడ్డ జగన న్నకు జై’... ‘కాబోయే సీఎం జగన్’ అంటూ నినదించారు. తన కోసం వర్షంలో తడుస్తున్న ప్రజలను చూసిన జగన్ కూడా ఉద్వేగానికి లోనయ్యారు. ఆయన కూడా వాహనంలో నుంచి బయటకు వచ్చి తడుస్తూనే.. వైఎస్సార్ విగ్రహం ఏర్పాటు చేసిన రాఘవేంద్ర సర్కిల్‌కు చేరుకున్నారు. అంతటి జోరువర్షంలో తడుస్తూనే విగ్రహాన్ని ఆవిష్కరించారు. మైకు పూర్తిగా తడిసిపోవటంతో ప్రసంగించటానికి వీలు పడలేదు. ఆయన వేదిక పైనుంచి వెళ్లేంత వరకు జనం కాలు కదపలేదు.
బయటి నుంచే దర్శనం
వైఎస్సార్ విగ్రహావిష్కరణ అనంతరం ఆయన గురురాఘవేంద్రస్వామి ఆలయానికి వెళ్లారు. ధర్మదర్శనం ద్వారంలోంచి గర్భగుడి సమీపానికి చేరుకున్నారు. బయటే ఉండి బృందావనాన్ని(స్వామి వారి సమాధి) దర్శించుకున్నారు. గర్భగుడి బయట ఉన్నప్పుడు చొక్కా విప్పాల్సిన అవసరంలేదని, గర్భగుడిలోకి ప్రవేశించినప్పుడే చొక్కా తీయాల్సి ఉంటుందని అక్కడి వేదపండితులు చెప్పారు. (జగన్ చొక్కా విప్పకుండా దేవుడిని దర్శించుకుని అపచారానికి పాల్పడ్డారంటూ పలు టీవీ చానళ్లలో వార్తలొచ్చాయి. వాస్తవంగా గర్భగుడి బయటి నుంచే బృందావనాన్ని జగన్ దర్శించుకున్నారు.) అనంతరం ఆయన శ్రీ మఠం పీఠాధిపతి సుయతీంద్రతీర్థుల వారిని దర్శించుకుని ఆయనకు పాదనమస్కారాలు చేశారు. పీఠాధిపతులు జగన్‌పై అక్షింతలు వేసి.. మంచి హోదాలో మళ్లీ రాఘవేంద్రస్వామిని దర్శించుకుంటావని ఆశీర్వదించారు. తన కుమారుడైన సుయమీంద్రాచార్‌తో విద్యాభ్యాసం చేసిన జగన్‌ను ఇలా ఉన్నత స్థాయిలో చూడటం సంతోషదాయకమని ఆయన పేర్కొన్నారు.
48 గంటల ఆలస్యంగా యాత్ర..
ప్రది దారిలోనూ జగన్మోహన్రెడ్డికి జనం నీరాజనాలు పలుకుతుండడంతో యాత్ర 13వ రోజు శనివారం కూడా ఆలస్యంగా సాగింది. మొత్తంగా యాత్ర షెడ్యూల్ కంటే 48 గంటలు ఆలస్యం గా సాగుతోంది. శనివారమే యాత్ర ముగియాల్సి ఉండగా.. జాప్యం నేపథ్యంలో దాన్ని వచ్చే నెల 2 వరకు పొడిగించారు. శుక్రవారం రాత్రి జగన్ రాంపురంలోని ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ఇంట్లో బసచేశారు. శనివారం యాత్ర అక్కడి నుంచే మొదలైంది. కోసిగి, పెద్దకడబూరు, మంత్రాలయం, ఎమ్మిగనూరు మండలాల్లోని పలు గ్రామాల మీదుగా జగన్ ప్రయాణించారు. మధ్యాహ్నం 2గంటల నుంచి వర్షంలోనే యాత్ర ముందుకు సాగింది. మొత్తం 85 కిలోమీటర్లు ప్రయాణించి 14 వైఎస్ఆర్ విగ్రహాలను జగన్ ఆవిష్కరించారు. నిర్ణీత షెడ్యూల్ ప్రకారం రెండు బాధిత కుటుంబాలను ఓదార్చాల్సి ఉండగా సమయాభావం వల్ల ఆదివారానికి వాయిదా వేశారు. రాత్రి ఎర్రకోటలోని సెయింట్ జోసఫ్ ఇంజనీరింగ్ కళాశాలలో జగన్మోహన్రెడ్డి బస చేశారు.
జగన్ వెంట నడిచిన నేతలు
ఓదార్పు యాత్రలో పాల్గొన్న వారిలో మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి, ఆయన సోదరుడు వై.సీతారామిరెడ్డి, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి, ఎమ్మెల్సీ ఎస్వీ మోహన్‌రెడ్డి, పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు భూమన కరుణాకర్‌రెడ్డి, జిల్లా పార్టీ కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి, ఆర్యవైశ్య సంఘం నాయకుడు లగిశెట్టి విశ్వనాథం తదితరులున్నారు.
అన్న వచ్చాడు.. వర్షం తెచ్చాడు...
‘ఆత్మ బంధువు వస్తూ.. వస్తూ వర్షం తెచ్చాడు. నీళ్ల కోసం నోళ్లు తెరిచిన పంట భూముల్లో నీళ్లు నింపాడు’ అని మంత్రాలయం, ఎమ్మిగనూరు వాసులు ఆనందపడుతున్నారు. మాసం రోజులుగా వర్షం కోసం ముఖం వాచేలా ఎదురు చూసిన రైతుల కల శనివారంతో తీరింది. జగన్మోహన్రెడ్డి అడుగుపెట్టిన దాదాపు అన్ని పల్లెల్లో ఒక మోస్త్తరు నుంచి భారీ వర్షం కురిసింది. ఈ ఏడాదిలో ఇదే పెద్ద వర్షం కావడం గమనార్హం. జగనన్న కాలుపెట్టిన వేళా విశేషం తమ పల్లెల్లో వర్షం కురిసిందని రైతులు అంటున్నారు.
జగనన్న చెప్పాడని అమ్మకు చెప్పు
మాధవరం మీదుగా జగన్మోహన్రెడ్డి రచ్చుమర్రి వైపు వెళ్తుండగా.. పన్నెండేళ్ల బాలిక ఇంటికెళుతూ కనిపించింది. వర్షంలో తడిసి వస్తున్న ఆమెను చూసి జగన్ తన వాహనాన్ని ఆపారు. దిగి బాలిక వద్దకు వెళ్లారు. నీ పేరేంటి తల్లీ? ఎక్కడి నుంచి వస్తున్నావు? అంటూ ఆప్యాయంగా పలకరించారు. ‘శాంతి.. కలుపు తీత కూలీకి వెళ్లి వస్తున్నాను’ అని ఆమె బదులిచ్చింది. ‘ఇకపై నువ్వు కూలీకి వెళ్లొద్దు.. బడికి వెళ్లి చదువుకో. నీ చదువులకు అయ్యే ఖర్చంతా నేనే చూసుకుంటా. జగనన్న త్వరలోనే ముఖ్యమంత్రి అవుతాడని, నా చదువులకయ్యే ఖర్చంతా అన్నే ఇస్తాడని, నన్ను బడికి పంపినందుకు నీకు కూడా రూ.500 ఇస్తాడని ఇంటికి వెళ్లి జగనన్న చెప్పాడని అమ్మకు చెప్పు’ అని జననేత చెప్పడంతో ఆ పాప కళ్లల్లో చెప్పలేనంత సంతోషం.