Post date: Feb 26, 2012 4:16:50 AM
ఆ మాట తప్పనందుకే నాపై సీబీఐ దాడులు: జగన్
సీబీఐ దాడులు చేయిస్తున్నారు.. ఎన్ఫోర్స్మెంట్ నోటీసులు పంపిస్తున్నారు
అయితే నాడు మాటిచ్చాను కాబట్టే.. నేను ఇవాళ ఇన్ని వేల కిలోమీటర్లు తిరగగలిగాను
ఏ నాయకుడూ వెళ్లని గ్రామాలకు వెళ్లా..600కుపైగా పూరి గుడిసెల్లోకెళ్లి కష్టాలు తెలుసుకొన్నా
పేదరికాన్ని నేను చూసినంత దగ్గరగా మరే నేతా చూడలేదని చెప్పడానికి గర్వంగా ఉంది
‘నాడు వైఎస్సార్ కోసం చనిపోయిన అభిమానుల కుటుంబాలను వాళ్ల ఇంటికే వచ్చి పరామర్శిస్తాను అని నల్లకాల్వలో మాటిచ్చాను. ఆ మాట తప్పనందుకే ఈ రోజు నన్ను కష్టపెడుతున్నారు. అయితే ఆ మాటకు కట్టుబడి ఉన్నందుకు నేను గర్వపడుతున్నాను. ఆ మాటను తప్పనందువల్లే రాష్ట్రంలో ఏ నాయకుడూ తిరగనంతగా వేల కిలోమీటర్లు తిరగగలుగుతున్నాను. 600 పైచిలుకు గుడిసెల్లోకి వెళ్లాను. ఏ నాయకుడూ పోని గ్రామాలకు వెళ్తున్నాను. ఏ నాయకుడూ కూడా చూడలేనంత దగ్గరగా నేను పేదరికాన్ని చూడగలుగుతున్నాను. ఏ నాయకుడు కూడా వినలేని పేదవాని గుండె చప్పుడును వినగలుగుతున్నానని గర్వంగా చెప్పగలుగుతున్నా’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. గుంటూరు జిల్లా ఓదార్పు యాత్ర 66వ రోజు శనివారం ఆయన నరసరావుపేట పట్టణంతోపాటు వినుకొండ మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించారు. యాత్రలో 11 వైఎస్సార్ విగ్రహాలను ఆవిష్కరించారు. వినుకొండ పట్టణంలో జరిగిన భారీ సభలో ఉద్వేగంగా మాట్లాడారు. ప్రసంగ సారాంశం ఆయన మాటల్లోనే..
అందుకే సీబీఐ దర్యాప్తులు.. నోటీసులు
దివంగత నేత చనిపోయిన ప్రదేశంలో అక్కడక్కడా పడి ఉన్న హెలికాప్టర్ ముక్కలు ఇవాళ్టికీ కూడా ఇంకా నా కంటికి కనపడుతుంటాయి. ఆ రోజున ఎటువంటి రాజకీయాలూ లేవు. నల్లకాలువలో పెట్టిన సంతాప సభలో ఆ రోజున నేను ఒక మాట ఇచ్చా. ఆ మాటను గాలికి వదిలేయలేదనే ఇవాళ సీబీఐ చేత దర్యాప్తు చేయిస్తున్నారు. ఇన్కమ్ ట్యాక్స్, ఎన్‌ఫోర్స్‌మెంటు డెరైక్టరేట్ చేత నోటీసులు ఇప్పిస్తున్నారు. నా ఇంట్లోకి నాలుగైదు సార్లు వచ్చారు. గజంగజం లెక్కలేసుకొని పోతున్నారు. కష్టాలు పెడుతున్నారు.. బాధలు పెడుతున్నారు. అయితే ఆ మాట తప్పనందుకు నేను గర్వపడుతున్నా..
ఆ బతుకు తీరు చూసి గుండెలు తరుక్కుపోయాయి
ఓదార్పు యాత్రలో ఆ పూరి గుడిసెల్లోకి నేను అడుగుపెడుతూ ఉన్నప్పుడు వాళ్లు బతుకుతున్న బతుకు తీరు చూస్తున్నప్పుడు గుండెలు తరుక్కుపోయాయి. ఆరు.. ఏడు..ఎనిమిదో తరగతి చదువుతున్న పిల్లలను ఆ అక్కాచెల్లెమ్మలు పనులకు పంపిస్తున్నారు. నేను ఆ అక్కాచెల్లెమ్మలను అడిగా.. అమ్మా..! పిల్లలను బడికి పంపించకపోతే పేదరికం ఎలా పోతుంది తల్లీ అని అడిగా. ‘అన్నా..! మా పిల్లలను మేం కూడా గొప్పగా చదివించాలని అనుకుంటున్నామన్నా. కానీ చదివించాలంటే ముందుగా మా కడుపు నిండాలి కదన్నా, మేం బతకాలి కదన్నా’ అని ఆ అక్కాచెల్లెమ్మలు చెప్పినప్పుడు గుండె పగిలేంత బాధనిపించింది. పేదవాళ్లు పొద్దున లేస్తే రూ. 100 ఎలా సంపాదించాలీ.. సంపాదించిన ఆ రూ. 100లో ఎలా బతకాలీ అనే ఆలోచనతోనే కాలం గడుపుతున్నారని మనసుకు తట్టినప్పుడు బాధనిపిస్తోంది.
మీ పిల్లలను పెద్ద చదువులు చదివిస్తాం
నేను ఇవాళ చెప్తున్నాను.. ఏ అక్కాచెల్లెమ్మ కూడా బతకటానికి తమ పిల్లలను పనులకు పంపించాల్సిన అవసరం లేని సువర్ణయుగం త్వరలోనే వస్తుందని, ఆ దివంగత నేత ఆకాశం నుంచి చూసి గర్వపడేలా అది ఉంటుందని చెప్తున్నా. పిల్లలను బడికి పంపించడమే వాళ్లు చేయాల్సిన పని. బడికి పంపించినందుకు వాళ్ల బ్యాంకు అకౌంట్లలో నెలనెలా రూ.500 చొప్పున మేం వేస్తామని చెప్పి ప్రతి అక్కాచెల్లెమ్మకు నేను హామీ ఇస్తున్నాను. మీరు మీ పిల్లలను బడికి పంపించండి.. వారిని ఇంజనీర్లుగాను, డాక్టర్లుగాను, కలెక్టర్లుగాను పెద్ద చదువులు చదివించే బాధ్యతలు మేం చూసుకుంటామని చెప్తున్నా.
అవ్వా, తాతలకు నెలకు రూ.700 ఇస్తాం
పూరి గుడిసెల్లోకి వెళ్లి వాళ్లతో మాట్లాడినప్పుడు ఇంకా గుండెలు పగిలే చాలా విషయాలు తెలుసుకున్నా. వృద్ధాప్యంలో ఉన్న అవ్వాతాతలు మూడు పూటలా భోజనం కోసం పొలాల్లో పనులు చేసుకుంటున్న సంఘటనలు చూశా! అవ్వా ఈ వయసులోనా నువ్వు పనిచేసేది అని అడిగా.. అప్పుడు వాళ్లు నాతో అన్న మాట ఇవాళ్టీకి కూడా నా గుండెలు కది లించి వేస్తోంది. ‘కొడుకా..! మీ నాయన పుణ్యాన రూ.200 పెన్షన్ అయితే వస్తోంది కానీ ఆ రూ. 200తో మూడు పూటలా భోజనం తినలేం కదా కొడుకా’ అని ఆ అవ్వలు అన్నప్పుడు గుండె పగిలేంత బాధనిపించింది. ప్రతి అవ్వా తాతలకు ఇవ్వాళ నేను చెప్తున్నాను. త్వరలో రాబోయే సువర్ణయుగంలో ఏ అవ్వా తాతా కూడా బతకటానికి పనులకు పోపాల్సిన పరిస్థితి రాని విధంగా.. మూడు పూటలా భోజనం వాళ్ల ఇంటిముందుకే వచ్చే రోజు త్వరలోనే వస్తుందని హామీ ఇస్తున్నాను. రూ.200 ఇచ్చే పెన్షన్‌ను రూ. 700కు పెంచి ఇచ్చే రోజు త్వరలోనే వస్తుందని చెప్తున్నాను. ఏ అక్కా.. ఏ చెల్లెమ్మ కూడా బ్యాంకు మేనేజర్ల దగ్గరకు వెళ్లినప్పుడు వడ్డీ గురించి మాట్లాడాల్సిన అవసరమే లేకుండా వడ్డీలేని రుణాలు ఇచ్చే సువర్ణయుగం త్వరలోనే వస్తుందని చెప్తున్నా. ప్రతి రైతు కూడా కాలర్ ఎగరేసి ఇదే మా ప్రభుత్వం అని గర్వంగా చెప్పుకునే రోజులు త్వరలోనే వస్తాయని చెప్తున్నా.
జన ప్రవాహాన్ని చూసి వినుకొండలో పవర్ కట్
పాలకుల పైశాచికత్వం మరోసారి వినుకొండ సభలో బయటపడింది. రాత్రయినా సరే జగన్మోహన్రెడ్డిని చూసేందుకు ఉప్పెనలా తరలి వస్తున్న జనాన్ని చూసి అధికార పక్షం నేతలు తట్టుకోలేకపోయారు. జన ప్రవాహాన్ని కట్టడి చేసేందుకు వినుకొండ పట్టణంలో విద్యుత్తు పరఫరా నిలిపి వేశారు. కేబుల్ కనెక్షన్ తొలగించారు. పట్టణంలోని అరుణాల్ సెంటర్లో ఏర్పాటు చేసిన వేదిక వద్దకు భారీగా జనం తరలిరావడం చూసిన అధికార పక్షం నేతలు హడావుడిగా పురపాలక సంఘం, విద్యుత్తు అధికారులతో సమావేశమయ్యారు. తొలుత వీధి లైట్లను ఆర్పివేశారు. అయినప్పటికీ జనం తగ్గకపోవడంతో పూర్తిగా కరెంటు సరఫరాను నిలిపివేశారు. దీంతో ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంతకుముందే తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామాల్లోని తమ పార్టీ నేతలకు ఫోన్లు చేసి.. ఓదార్పు యాత్రకు ప్రజలు రాకుండా అడ్డుకోవాలని సూచించినట్లు సమాచారం. స్థానిక నాయకులు ఎన్ని ప్రయత్నాలు చేసినా.. ప్రజలు వారి మాటలు పట్టించుకోకుండా ఓదార్పు యాత్రలో పాల్గొన్నారు. ‘విద్యుత్తు సరఫరా నిలిపి వేసి, కుట్రలు, కుతంత్రాలతో ప్రజాభిమానాన్ని ఆపాలనుకోవడం మూర్ఖత్వం.. మీ పనులను ప్రజలు గమనిస్తున్నారు. సమయం వచ్చిన రోజున తగిన బుద్ధి చెప్తారు’ అని వైఎస్సార్ కాంగ్రెస్ గుంటూరు జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్ కాంగ్రెస్, టీడీపీ నేతలను హెచ్చరించారు