Post date: Aug 23, 2011 6:13:5 AM
*అవసరమైతే న్యాయస్థానాన్నీ ఆశ్రయిస్తాం: బోస్
*కాంగ్రెస్, పీఆర్పీ, టీడీపీలకు చెందిన 29 మంది ఎమ్మెల్యేల రాజీనామా
*మహానేత వైఎస్‌ను ద్రోహిగా చిత్రీకరించజూసినందుకేనని స్పష్టీకరణ
*ఆయన అభిమాన ఎమ్మెల్యేలందరూ ముందుకు రావాలని పిలుపు
*వైఎస్‌ను ద్రోహిగా భావించే వారు రాజీనామా చేసి ఎన్నికలకు రావాలని సవాల్
హైదరాబాద్, న్యూస్‌లైన్: శాసనసభ సభ్యత్వాలకు తాము సమర్పించిన రాజీనామాలను స్పీకర్ ఆమోదించకపోతే.. గవర్నర్‌ను కలిసి ఆమోదం కోసం ఒత్తిడి తెస్తామని, అప్పటికీ ఆమోదం కాకుంటే సుప్రీంకోర్టునైనా ఆశ్రయిస్తామని మాజీ మంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్ ఉద్ఘాటించారు. దివంగత మహానేత వైఎస్‌ను దోషిగా చిత్రీకరిస్తూ సీబీఐ ఎఫ్ఐఆర్లో ఆయన పేరును పొందుపరచటం తీరని అన్యాయానికి ఒడిగట్టటమేనని, దీనికి నిరసనగా తామంతా రాజీనామాలు చేశామని ఆయన స్పష్టంచేశారు. వైఎస్ అభిమాన ఎమ్మెల్యేలంతా తమతో కలసి రావాలని పిలుపిచ్చారు.
సోమవారం కాంగ్రెస్, టీడీపీ, పీఆర్పీలలోని వైఎస్ అభిమాన ఎమ్మెల్యేలు 29 మంది తమ పదవులకు రాజీనామాలు (26 మంది సోమవారం చేయగా ముగ్గురు ఇదివరకే సమర్పించిన రాజీనామాలపై స్పీకర్ నుంచి ఎలాంటి సమాధానం రానందున మరోసారి రాజీనామాలు సమర్పించలేదని చెప్పారు) చేస్తూ అసెంబ్లీ కార్యదర్శికి లేఖలు సమర్పించారు. ఈ సందర్భంగా బోస్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి కూడా రాజీనామాలు సమర్పించామని చెప్పారు. కాంగ్రెస్ బుజ్జగింపులకు, బెదిరింపులకు వైఎస్ అభిమానులెవ్వరూ తలొగ్గబోరని స్పష్టంచేశారు. మహానేత కుటుంబాన్ని అప్రతిష్ట పాలు చేసేందుకు కాంగ్రెస్ అధిష్టానం కుట్ర పన్నిందని ఆరోపించారు. దేశంలో ఏనాడూ ఎవ్వరిమీదా చేయని విధంగా సీబీఐ వైఎస్ కుటుంబంపై పగబట్టినట్లు చేస్తోందని, దీని వెనుక కాంగ్రెస్ పెద్దల హస్తముందని ప్రజలందరూ గమనిస్తున్నారని పేర్కొన్నారు.
వైఎస్ కుటుంబాన్ని అణిచివేయాలని, ప్రజల మనసు నుంచి తుడిచి వేయాలని ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. వైఎస్ కుటుంబానికి ఇప్పుడు బయటకు వచ్చిన నాయకులే కాకుండా చాలామంది మద్దతు పలుకుతున్నారని ప్రకటించారు. ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాలను కీలక మలుపు తిప్పనుందని పేర్కొన్నారు. కాంగ్రెస్‌లో చిరంజీవి చేరినా దాన్ని ఎవరూ కాపాడలేరని.. చిరంజీవి, కాంగ్రెస్ నేతల సత్తా ఏమిటో ప్రజాకోర్టులో తేలిపోతుందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నేతలు తమపై చేస్తున్న విమర్శలు చూస్తుంటే ఆత్మస్థైర్యం కోల్పోయినట్లుగా ఉందని స్పష్టమవుతోందన్నారు. ఈ ప్రభుత్వాన్ని కూల్చాలని తాము రాజీనామాలు చేయటం లేదని, అయితే దేనికైనా ప్రజలే అంతిమ నిర్ణేతలని పేర్కొన్నారు. భవిష్యత్ పరిణామాలకు ప్రభుత్వానిదే బాధ్యత అని తేల్చి చెప్పారు.
విపక్ష పార్టీలు కుట్రలు చేసి ఆరోపణలు చేస్త్తుంటాయని, కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీయే వైఎస్‌పై కుట్ర పన్ని ఎఫ్ఐఆర్లో పేరు పెట్టించిందని తెలిపారు. కాంగ్రెస్‌ను రెండుసార్లు అధికారంలోకి తెచ్చిన వైఎస్‌ను అవినీతిపరుడిగా, దోషిగా కాంగ్రెస్ పార్టీ చిత్రీకరించటం సిగ్గుచేటని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి శేషారెడ్డి మండిపడ్డారు. ‘‘వైఎస్సే అవినీతిపరుడైతే ఆయన వల్లనే గెలిచిన మీరంతా రాజీనామా చేసి మళ్లీ ఎన్నికలకు రండి. ఎవరు ద్రోహులో, అవినీతిపరులో, వంచకులో ప్రజలే తేలుస్తారు. మేమూ ప్రజా కోర్టులోనే తేల్చుకుంటాం. వైఎస్ఆర్ పట్ల ఉన్న గౌరవమేమిటో నిరూపిస్తాం’’ అని సవాల్ చేశారు.
అసెంబ్లీలో రాజీనామాల కోలాహలం
వైఎస్ అభిమాన ఎమ్మెల్యేలు రాజీనామాలు సమర్పించేందుకు అసెంబ్లీకి చేరుకోవటంతో అక్కడి వాతావరణం ఒక్కసారిగా సందడిగా మారిపోయింది. అంతకుముందే పోలీసులు అసెంబ్లీ చుట్టూ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రాష్ట్ర, జాతీయ మీడియా ప్రతినిధులు, చానళ్లతో ఆ ప్రాంతం హడావుడిగా మారింది. ముందుగా 11.15 గంటలకు తెలుగుదేశం పార్టీ తిరుగుబాటు ఎమ్మెల్యేలు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, బాలనాగిరెడ్డి అసెంబ్లీకి చేరుకుని కార్యదర్శి రాజసదారాంకు రాజీనామా పత్రాలు అందించారు. తర్వాత కాంగ్రెస్‌కు చెందిన పిల్లి సుభాష్‌చంద్రబోస్, బాలినేని శ్రీనివాసరెడ్డి, ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, బాలరాజు, మేకపాటి చంద్రశేఖరరెడ్డి, ఆళ్ల నాని, కాటసాని రాంభూపాల్‌రెడ్డి, ధర్మాన కృష్ణప్రసాద్, కొర్ల భారతి, శివప్రసాద్‌రెడ్డి తదితర 23 మంది ఎమ్మెల్యేలు, పీఆర్పీకి చెందిన భూమా శోభానాగిరెడ్డి తమ రాజీనామా లేఖలను కార్యదర్శికి అందించారు. అందరూ స్పీకర్ ఫార్మాట్లో పత్రాలు అందించారు.
జూలై 4వ తేదీనే రాజీనామాలు సమర్పించిన కొండా సురేఖ, జయసుధ, కుంజా సత్యవతి కూడా అసెంబ్లీకి వచ్చారు. తాము ఇదివరకే రాజీనామాలు చేశామని, వాటిపై స్పీకర్ నుంచి తమకు ఎలాంటి సమాచారమూ రాలేదని చెప్పారు. వాటినే ఆమోదింపజేసుకుంటామని తెలిపారు. ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎమ్మెల్సీలు జూపూడి ప్రభాకర్‌రావు, పుల్లా పద్మావతి, ఎస్.వి.మోహన్‌రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత అంబటి రాంబాబు తదితరులు అసెంబ్లీకి వచ్చారు. రాజీనామాల సమర్పణ అనంతరం అసెంబ్లీ ఆవరణలోని గాంధీ విగ్రహానికి నివాళులు అర్పించారు. వైఎస్సార్ అమర్ రహే అంటూ వారు చేసిన నినాదాలతో ఆ ప్రాంతమంతా మార్మోగింది.
అదే సమయానికి అసెంబ్లీ బయట నుంచి వైఎస్ అభిమానులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకుని నేతలతో గళం కలిపారు. తరువాత బయటకు వచ్చిన నేతలతో మీడియా చానళ్లు మాట్లాడించేందుకు ప్రయత్నించగా అప్పటికే భారీగా చేరుకున్న పోలీసులు ఇక్కడ మాట్లాడేందుకు వీలులేదని, మీడియా పాయింట్‌కు వెళ్లాలంటూ నేతలకు సూచించారు. దృశ్యాలను చిత్రీకరిస్తున్న చానెళ్లను మీడియా పాయింట్ దిశగా వెనక్కు నెట్టుకుంటూ వెళ్లారు. రాజీనామాలకు కారణాలను వివరించిన నేతలు అక్కడినుంచి తమ వాహనాల్లో బయలుదేరి వెళ్లారు.
స్పీకర్ వచ్చాక పరిశీలన
ఎమ్మెల్యేల రాజీనామా లేఖలను అసెంబ్లీ కార్యదర్శి సీల్డు కవర్లలో భద్రపరిచారు. తెనాలి పర్యటనలో ఉన్న స్పీకర్ నాదెండ్ల మనోహర్ గురువారం వచ్చిన తర్వాత రాజీనామా లేఖలను పరిశీలిస్తారని అసెంబ్లీ వర్గాలు తెలిపాయి.