Post date: Sep 17, 2011 7:18:10 PM
కృష్ణా జలాల పంపిణీపై ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్.కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి ఒక లేఖ రాశారు. కృష్ణా జలాలను సహేతుక పద్దతిలో పంపిణీ చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ధాన్యాగారంగా పేరుబడిన ఆంధ్రప్రదేశ్.లో గత రెండేళ్లుగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. పెరిగిన ఎరువుల ధరలు, విత్తనాల కొరత, గిట్టుబాటు ధర లేక రైతులు విలవిలలాడుతున్నారని తెలిపారు. ముఖ్యంగా కృష్ణా, గుంటూరు జిల్లాలు దారుణంగా దెబ్బతిన్నాయి. రాష్ట్రంలో చాలా ప్రాంతాలలో రైతులు సమ్మె పాటిస్తున్నారని తెలిపారు.
కృష్ణా జలాల పంపిణీలో రాష్ట్రానికి అన్యాయం జరిగిందన్నారు. ట్రిబ్యునల్ తీర్పు రైతుల ప్రయోజనాలకు విఘాతం కలిగించిందన్నారు. ఈ విషయం రైతులను కలవర పరుస్తోందని తెలిపారు. ట్రిబ్యునల్ తీర్పుని సవరించాలని తమ పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నామని చెప్పారు.
కృష్ణా జలాల పంపిణీ విషయంలో ఎగువ రాష్ట్రాల దయాదాక్షిణ్యాలపై రాష్ట్ర రైతులు ఆధారపడాల్సి వస్తుందన్నారు. ఒకే సమయంలో లభ్యమయ్యే నదీజలాలు అన్ని రాష్ట్రాలు పంచుకునే విధంగా ఉండాలని చెప్పారు. కృష్ణా జలాల పంపిణీకి అత్యున్నత కమిటీని వేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఆ కమిటీకి అధ్యక్షుడిగా సుప్రీం కోర్టు రిటైర్డ్ జడ్జిని నియమించాలని ఆ లేఖలో జగన్ ప్రధానిని కోరారు.