Post date: Apr 15, 2011 6:23:37 AM
ఈ ఎన్నికల్లో కడప గుండె చప్పుడే రాష్ట్రంలో మార్పునకు నాంది..
ఇది తెలుగింటి ఆత్మగౌరవానికి సంబంధించిన ఎన్నిక
వీటిలోనూ కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కవుతున్నాయి
పులివెందులలో టీడీపీ, కడపలో కాంగ్రెస్ ఎందుకూ పనికిరాని అభ్యర్థులను దించనున్నాయి
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లను ఎంతగా ప్రలోభపెట్టేందుకు యత్నించారో నా కళ్లతో చూశాను
...అయినా నారాయణరెడ్డిని గెలిపించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు
వైఎస్సార్ జిల్లాలో ఉప ఎన్నికలు జరుగుతున్నది.. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, మహానేత వైఎస్సార్ మధ్యేనని ‘వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ’ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అభివర్ణించారు. ఈ ఎన్నికల ఫలితాలే రాష్ట్రంలో జరుగబోయే మార్పునకు నాంది కాబోతున్నా యని పేర్కొన్నారు. ఇటీవల జగన్ మద్దతుతో ఎమ్మెల్సీగా ఎన్నికైన దేవగుడి నారాయణరెడ్డిని అభినందించేందుకు వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో ఆదివారం ఏర్పాటు చేసిన సభకు యువనేత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జగన్ ప్రసంగం ఆయన మాటల్లోనే..
కాంగ్రెస్ కోసం కష్టపడితే..
‘‘ఎమ్మెల్సీగా గెలిచిన దేవగుడి నారాయణరెడి ్డ ఈ సన్మానం చేయించుకునేందుకు అన్నివిధాలా తగిన వ్యక్తి. ఇంతకుముందు కాంగ్రెస్ కష్ట కాలంలో ఉన్నప్పుడు.. జమ్మలమడుగు నియోజకవర్గంలో ప్రాతినిథ్యం కూడా కరువైన పరిస్థితుల్లో.. కష్టమని తెలిసినా.. నష్టమని తెలిసినా.. ఆ పార్టీ జెండా ఎగురవేయడానికి ముందుకొచ్చింది దేవగుడి నారాయణరెడ్డి కుటుంబం. అయితే ఆయన రెండు పర్యాయాలూ ఓడిపోయారు. అక్కడి నుంచి ఆదినారాయణరెడ్డి రావడం.. కొత్త రక్తం ముందుకు రావడం.. దివంగత నేత పాదయాత్రలో టీడీపీ కొట్టుకుపోవడం.. ఈ పరిణామాల నేపథ్యంలో ఆదినారాయణరెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే కాంగ్రెస్కోసం ఎన్నో త్యాగాలు చేసిన నారాయణరెడ్డి కుటుంబాన్ని.. వైఎస్ చనిపోయాక అదే పార్టీ ఓడించేందుకు కృషి చేసింది. సిగ్గులేకుండా తెలుగుదేశం పార్టీతో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకొని ఆయన ఓటమే ధ్యేయంగా పనిచేసిందీ అంటే.. ఇవాళ రాజకీయాలు ఎంత నీచస్థితికి దిగజారాయో వేరే చెప్పక్కర్లేదు.
అయినా.. ప్రలోభాలకు గురికాలేదు: అధికార బలానికి, అభిమానానికి మధ్య జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రలోభాలకు గురికాకుండా నారాయణరెడ్డి వెనుక నిలబడిన ప్రతి ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు నేను చేతులు జోడించి కృతజ్ఞతలు చెప్తున్నాను. ఎం దుకంటే.. ఏ ఒక్కరూ కూడా అధికారానికి దాసోహులు కాలేదు. దివంగత నేత రాజశేఖరరెడ్డిని గుండెల్లో పెట్టుకుని ఓటు వేశారు. నాకు తోడుగా నిలబడిన ప్రతి ఎమ్మెల్యేకు, ఎమ్మెల్యే కాకపోయినా నాకు తోడుగా ఉన్న గోవిందరెడ్డన్నకు కూడా కృతజ్ఞతలు చెప్తున్నా. ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు కాంగ్రెస్ నేతలు ఎంతగా ప్రయత్నించారో నేను నా కళ్లతో చూశాను. అంతటి ప్రలోభాలకు సైతం లొంగకుండా పనిచేశారు. ఆ ఎన్నికల్లో ఒకవైపు కుమ్మక్కైపోయిన కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు ఉంటే.. మరోపక్క పుట్టీపుట్టగానే ప్రజల గుండె చప్పుడుగా నిలిచిన ‘వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ’ తరఫున పోటీ జరిగింది. ఆ ఎన్నిక అయిపోయాక ఇవాళ ఇక్కడ మేమందరం గర్వంగా నిలుచునేలా చేసినందుకు ప్రతి ఒక్కరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం.
ఇక పార్లమెంటు యుద్ధం: ఇప్పుడు కడపలో పార్లమెంటు ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా వెలువడింది. మన ముంగిట పార్లమెంటు ఎన్నికల యుద్ధం జరగబోతోంది. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు మళ్లీ కుమ్మక్కై పోటీకి వస్తున్నాయి. పులివెందులలో ఎందుకూ పనికిరాని అభ్యర్థిని టీడీపీ నిలుపుతుంది. ఎందుకూ అని అంటే.. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలి కాబట్టి. అందుకు ప్రతిఫలంగా కడప పార్లమెంట్ బరిలో కాంగ్రెస్ పార్టీ ఎందుకూ పనికిరాని అభ్యర్థిని నిలుపుతుంది. కారణమేంటంటే.. ఇక్కడ జగన్మోహన్రెడ్డికి టీడీపీ గట్టి పోటీ ఇవ్వాలి కాబట్టి! మళ్లీ రెండు పార్టీలూ అదే కుయుక్తులతో కుమ్మక్కవుతున్నాయి. కుమ్మక్కై కడప గడపన ఆత్మగౌరవానికి మరొకసారి పరీక్ష పెట్టే పరిస్థితి తీసుకొస్తున్నారు. ఈ ఎన్నిక తెలుగింటి ఆత్మగౌరవానికి సంబంధించిన ఎన్నిక. సోనియా గాంధీకి, వైఎస్ఆర్కు మధ్య జరగబోయే ఎన్నిక. ఈ ఎన్నికలో మరొకసారి వినిపించే కడప గుండె చప్పుడు రాష్ట్రంలో జరుగబోయే మార్పునకు నాంది కాబోతుంది.’’
ఈ కార్యక్రమంలో నంద్యాల మాజీ ఎంపీ భూమా నాగిరెడ్డి మాట్లాడుతూ రాజకీయాల్లో స్వార్థం ముందుండే రోజుల్లో కష్టకాలంలో మేమున్నామంటూ యువనేతకు అండగా నిలుస్తున్న జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు అభినందనీయులన్నారు. తనను ఓడించేం దుకు అధికార పార్టీ అనేక కుయుక్తులు పన్నినా అభిమానం గెలిచిందని ఎమ్మెల్సీ నారాయణరెడ్డి పేర్కొన్నారు. ఎమ్మెల్సీ జీతంలో 10% ప్రొద్దుటూరు చేనేత కార్మికుల ఇన్సూరెన్స్ కోసం వెచ్చిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ఆదినారాయణరెడ్డి, అమరనాథరెడ్డి, కమలమ్మ, మాజీ ఎమ్మెల్యేలు రఘురామిరెడ్డి, రమణారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పోచంరెడ్డి సుబ్బారెడ్డి, వైఎస్ఆర్కాంగ్రెస్ పార్టీ నేత రాచమల్లు ప్రసాదరెడ్డి తదితరులు ప్రసంగించారు. జిల్లా వ్యాప్తంగా ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, దేవగుడి సోదరుల అభిమానులు పాల్గొన్నారు.