Post date: Aug 18, 2011 12:32:29 PM
జగన్ ఆస్తులపై విచారణ జరుపుతున్న సిబిఐ చివరికి తన విచారణలో పట్టుకునేది ఎలుకనే అని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. రాజకీయ కుట్రలో భాగంగానే జగన్ పై సిబిఐ విచారణ జరుగుతోందని ఆరోపించారు. వైఎస్ జగన్ కాంగ్రెసులో ఉండి ఉంటే సిబిఐ విచారణ జరిగి ఉండేది కాదని, కాంగ్రెసులో ఉన్నప్పుడు మంత్రి పదవి ఇస్తామని చెప్పినవాళ్లు జగన్ బయటకు వచ్చిన తర్వాత సిబిఐ విచారణకు కుట్ర చేశారని అంబటి విమర్శించారు.
సిబిఐని కాంగ్రెసు బ్యూరో ఆఫ్ కాంగ్రెసు అన్న తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు ఇప్పుడు జగన్‌పై సిబిఐ విచారణను ఎందుకు అహ్వానిస్తున్నారని ప్రశ్నించారు. వైఎస్ మరణించిన తర్వాత జగన్ పై అనైతిక దాడులకు దిగుతున్నారని అన్నారు. జగన్‌పై కక్ష గట్టిన సోనియా గాంధీకి, చంద్రబాబుకు ప్రజలే గుణపాఠం చెప్తారని అన్నారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఉదయం నుంచి సీబీఐ విచారణ జరుపుతుండటంతో భారీగా ఆ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున లోటస్‌పాండ్‌లోని జగన్ నివాసం వద్దకు చేరుకుంటున్నారు. జగన్‌కు మద్దతుగా అనుకూల నినాదాలు చేస్తూ, ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారు. జగన్‌ను అరెస్టు చేస్తే వైఎస్ హయంలోని మంత్రులందరిని అరెస్టు చేసి విచారణ జరపాలని ఆ పార్టీ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. భారీగా అక్కడ పోలీసులను మోహరించినట్లు సమాచారం తెలుస్తోంది.