Post date: Aug 22, 2011 4:35:27 AM
దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి పేరును సీబీఐ ఎఫ్ఐఆర్లో నమోదు చేయడాన్ని నిరసిస్తూ 29 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు రాజీనామాలు ప్రకటించడం పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హర్షం వ్యక్తం చేసింది. పార్టీ పాలకమండలి సభ్యులు, జిల్లా కన్వీనర్లు, ముఖ్యనేతలు ఆదివారం సాయంత్రం పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యారు. భేటీ వివరాలను పార్టీ అధికార ప్రతినిధులు బాజిరెడ్డి గోవర్ధన్, గట్టు రామచంద్రరావులు మీడియాకు వెల్లడించారు.
‘‘కడప, పులివెందుల ఉప ఎన్నికల సందర్భంగా తాము వైఎస్ఆర్ వారసులం అంటూ ప్రకటించుకున్న నేతలు... అదే వైఎస్ పేరుప్రతిష్టలకు కళంకం తెచ్చే చర్యలు చోటుచేసుకుంటుంటే నోరు ఎందుకు మెదపడం లేదు? జగన్ ఆస్తులకు మాత్రమే వారసుడు, రాజకీయ వారసులం తామే అన్న వారు ఎక్కడ? వైఎస్ కుటుంబానికి జరుగుతున్న అవమానంతో ప్రజలు రగిలిపోతున్నారు. ప్రజాభీష్టానికి అనుగుణంగానే ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తున్నారు. వారంతా గాంధీభవన్‌కు వెళ్లి కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తారు’’ అని బాజిరెడ్డి తెలిపారు.
మహానేత కుటుంబాన్ని అవమానపరచడాన్ని నిరసిస్తూ పదవులకు రాజీనామా చేసే సభ్యుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుంద ని చెప్పారు. వైఎస్ఆర్ వల్ల గెలిచామనుకున్న వారు పదవులకు రాజీనామా చేయాలన్నారు. వైఎస్ బొమ్మతో గెలువలేదని బొంకుతున్న నేతలందరూ రాజీనామా చేసి మళ్లీ గెలవాలని సవాల్ విసిరారు. ప్రభుత్వం ఉంటదా, పోతదా అనేది సమస్యకాదని, ఇంతకన్నా అవమానం ప్రభుత్వానికి, కాంగ్రెస్‌కు మరొకటి ఉండదన్నారు. రాజీనామా చేసిన ప్రజాప్రతినిధులందరూ కడప ఉప ఎన్నికల మాదిరిగా బంపర్ మెజార్టీతో గెలుస్తారని తెలిపారు. కాంగ్రెస్ వ్యతిరేక ఓటుతో ఎమ్మెల్యేలుగా ఎన్నికైన పీఆర్పీ నేతలు మళ్లీ ఏ అర్హతతో ఆ పార్టీతో కలుస్తున్నారని ప్రశ్నించారు. జగన్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టిన వారిలో తనకు ఇష్టమైన వారిని ఎఫ్ఐఆర్ నుంచి తొలగిస్తూ.. సీబీఐ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పినట్లు ఆడుతోందని, దీన్ని ప్రజల్లోకి తీసుకెళతామని ప్రకటించారు.