Post date: Feb 11, 2011 1:23:52 PM
2009లొ రిలీజయిన యూపీయే-2 అనే సీక్వెల్ సినిమా బాక్సాఫీసు దగ్గర అయిదేళ్ళు ఆడాలి… లేకపోతే ప్రొడ్యూసర్ నష్టపోతాడు. ఇంతకీ ప్రొడ్యూసర్ ఎవరు ... ఇంకెవరు మనకు తెల్సిన సోనియానే..! కో-ప్రొడ్యూసర్ మన్మోహన్ సింగే ! కాకపోతే ప్రొడ్యూసర్ తనకు ఈ దేశంలో ఫేస్ వ్యాల్యూ లేదని తెలిసి ‘త్యాగం’ పేరుతో మన్మోహన్ సింగు అనే కోప్రొడ్యూసర్ని ముందుకు తోసింది. అంటే.. తన డ్రైవింగ్ సీటుని సదరు కోప్రొడ్యూసరికి అప్పచెప్పి తాను కో పైలట్ లా వెనక సీట్లో కూర్చుని సింగు గారిని బండితోలమని చెప్పింది. అది అసలే పాత మోటార్ సైకిల్... దాని మీద ప్రయాణం. ఒక్కసారి ఆ బండి ప్రయాణం చూద్దాం..! ముందుగా ఒక చిన్న పారాగ్రాఫులో జరిగిన కధ..! సోనియా ఒక విదేశీకోడలిగా ఇందిరమ్మ ఇంట్లో ప్రవేశించింది. కొడుకు పడిన ఇష్టానికి తల్లి కాదనలేక ఓకే అంది... ఆపైన ఆమె ఒకరోజు సొంత సెక్యూరిటీ చేతుల్లో తుపాకీ గుళ్ళకు బలైపోయింది. ఆ తరువాత గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆమె పెద్ద కొడుకు అదే మన సోనియా భర్త..రాజీవ్ ప్రధాన మంత్రిపదవిని అధిష్టించాడు. ఆపైన ఆయనకూడా ఒక దుర్ముహూర్తాన తమిళనాడులో శ్రీపెరంబదూరు అనే వూళ్ళో ఒక మీటింగులో ‘తమిళ ఉగ్రవాదులు’గా పిలవబడే ఎల్టీటీఈ సంస్థకు చెందిన బెల్టు బాంబు వ్యక్తి వలన దారుణంగా మరణించాడు. పోతే... తన భర్త పోయిన బాధలో సోనియా అనే ఈ మహిళ ఏడేళ్ళపాటు ఇంటి గడపదాటకుండా గుడ్లనీళ్ళు కక్కుకుంటూ పిల్లల్ని అక్కున చేర్చుకుని కాలం గడిపింది. కానీ దేశంలో కాంగ్రెసు ఫెనటిక్స్ గోల భరించలేక ఎట్టకేలకు ఈ దేశపు నెహ్రూ వారసత్వానికి ఫులుస్టాప్ పడకుండా ‘ఓకే’ అని దేశ రాజకీయాల్లో తన చక్రం తిప్పడం మొదలుపెట్టింది. కొన్ని గెలుపులూ.. ఇంకొన్ని వోటములు.. ఇంకా చాలా చాలా పరాభవాలు ఎదుర్కొని ఇప్పుడు రెండోసారి యూపీయే ప్రభుత్వంలో ‘పిలియన్ రైడర్’ పోస్టులో కొనసాగుతోంది.
ఇంతకీ డ్రైవింగ్ సీటులో కూర్చున్న సింగు బాబాయి తన వెనుక కూర్చున్న సోనియా అనబడే తన బాసు ఆజ్ఞలు..ఆకాంక్షల మేరకు డ్రైవింగ్ సీట్లో..అదే మన డొక్కు బైకు ముందు కూర్చుని బండి తోలుతున్నాడా ? ఆ బండికి బ్రేకుల్లేవు...దాంతో ఒకటిరెండు సార్లు డ్రైవర్/పైలట్ సింగుగారికి కోపం వచ్చినా చేసేదేమీలేక ఆమె చెప్పినట్లే డ్రైవింగ్ చేస్తూనేవున్నాడు. ఎంతసేపు తోలినా గమ్యం మాత్రం చేరని ఆ ‘డోక్కుబండి’కి ఎన్ని పంచర్లుపడినా..ఎన్నెన్నిసార్లు రిపేర్లు వచ్చినా పిలియన్ రైడర్ సోనియా ఆజ్ఞప్రకారం మన సింగుగారు అలుపన్నది లేకుండా ఇంకా తోలుతూనే వున్నారు.... ఏపీకి చేరిన బండికి (అది కూడా ముప్పై ముగ్గురు ఏమ్పీలున్న రాష్ట్రంలో) పెట్రోలే కరువా...? గడపగడపకూ ఒక ఎంపీ ఉన్నఈ రాష్ట్రంలో ఎన్ని తెలంగాణా బంకులున్నా.. మరిన్ని ఆంధ్రా ఫిల్లింగ్ స్టేషన్లున్నా ..అటు సీమ ప్రాంతానికి వెళ్ళినా మనోళ్ళ పెట్రోల పంపులే వున్నాయన్న ధీమా మన సోనియాది ..కానీ ఒక్కటంటే ఒక్క బంకులో కూడా ఈ బండికి చుక్క పెట్రోలుకూడా దొరకలేదు... ఒకడు తెలంగాణా ఇస్తే పోస్తానంటాడు...ఇంకొకడు నువ్వు తెలంగాణా ఇవ్వకపోతేనే పోస్తానంటాడు...చివ్వరాఖరికి సోనియా ఏంచేసి తన డొక్కుబండిలో పెట్రోలు పోయించుకుని పక్క కర్నాటక రాష్ట్రం వైపు వెళ్ళిందో చెప్పగలరా..?