Post date: Apr 27, 2011 5:30:12 AM
మాజీమంత్రి కొండా సురేఖకు వైఎస్ఆర్ అభిమాని పట్టుచీర ఇచ్చి ఆదరించారు. స్థానిక మిట్టమడి వీధిలో ప్రొద్దుటూరు అలివేలమ్మ అనే పేద మహిళ చిన్న బడ్డీకొట్టు పెట్టుకొని వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. జగన్కు ఓటేయాలని మంగళవారం ఇంటింటి ప్రచారం చేస్తున్న మాజీ మంత్రి కొండా సురేఖ ఆ బంకు వద్దకు వచ్చారు. ఆమె వస్తూనే అలివేలమ్మ ఎవరికోసమో తెప్పించిన వెంకటగిరి పట్టు చీర తీసి ఆమెపై కప్పింది. అలివేలమ్మ పేదరికాన్ని చూసిన సురేఖ చీరకు డబ్బు ఇవ్వమని తన సహాయకుడికి పురమాయించగా ఆమె తిరస్కరించింది. తాను అభిమానంతో ఇచ్చిన దానికి విలువ కట్టకూడదని చెప్పింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అంటే తనకు ఎంతో అభిమానమని, ఆ కుటుంబం కోసం ఇంతదూరం వచ్చిన నీవు మా ఇంటి బిడ్డలాంటి దానివని చెప్పింది. తొలి నుంచి తనకు వైఎస్ కుటుంబం అంటే అభిమానమని, తాను అనారోగ్యంతో ఉన్నప్పుడు ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరగా వైఎస్ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం తనను ఆదుకుందని తెలిపింది.