Post date: May 14, 2011 6:23:0 AM
దేశంలో 5 లక్షల మెజారిటీ దాటిన ముగ్గురు నేతల సరసన జగన్
అనిల్ బసు (సీపీఎం).. పీవీ నర్సింహారావు (కాంగ్రెస్).. రామ్‌విలాస్ పాశ్వాన్ (జనతాదళ్).. ఇప్పటిదాకా దేశంలో ఐదు లక్షలకు పైగా మెజారిటీ సాధించిన నేతలు వీరు మాత్రమే. ఇప్పుడు కడప లోక్‌సభ స్థానం నుంచి అఖండ మెజారిటీతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి వీరి సరసన చేరి రికార్డు సృష్టించారు. 5,45,672 ఓట్ల తిరుగులేని మెజారిటీతో చరిత్రను తిరగరాశారు. 2004లో జరిగిన సాధారణ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్‌లోని అరంబాగ్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి సీపీఎం నాయకుడు అనిల్ బసు అత్యధికంగా 5,92,502 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఈ నియోజకవర్గంలో పోటీ చేసిన బీజేపీ (రెండో స్థానం) కాంగ్రెస్ (మూడోస్థానం)లు డిపాజిట్లు కోల్పోయాయి.
మన రాష్ట్రంలో 5 లక్షలకుపైగా ఓట్ల మెజారిటీ సాధించిన రికార్డులో పీవీ ఉండగా... ఇప్పుడు ఆ జాబితాలో రెండో నాయకుడిగా జగన్ చేరారు. 5 లక్షల రికార్డు మెజారిటీ సాధించిన మొదటి ముగ్గురు నాయకులు చాన్నాళ్ల నుంచి ప్రజల్లో బాగా పాతుకుపోయినవారు. తమ తమ పార్టీ గుర్తులతో (సుత్తి కొడవలి, హస్తం, చక్రం) పోటీ చేయగా, జగన్ మాత్రం కొత్త గుర్తు (ఫ్యాన్)తో అదికూడా కేవలం 17 రోజుల్లో మొత్తం నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించి ఇంతటి భారీ మెజారిటీ సాధించడం విశేషం. కడప ఉప ఎన్నికలకు నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ పూర్తయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్‌కు (ఫ్యాన్) గుర్తు కేటాయించిన సంగతి తెలిసిందే.
నాడు పీవీకి పోటీ లేదు.. నేడు త్రిముఖ పోటీ
1991లో రాష్ట్రంలోని నంద్యాల లోక్‌సభ నియోజకవర్గ ఉపఎన్నికల్లో ప్రధానమంత్రిగా ఉన్న పీవీ నర్సింహారావు అయిదు లక్షలకుపైగా మెజారిటీ సాధించారు. తెలుగు వ్యక్తి దేశ ప్రధానిగా ఉన్నందున ఆ సమయంలో పీవీపై ఏ పార్టీ పోటీ పెట్టరాదని రాష్ట్రంలోని తెలుగుదేశం సహా అన్ని రాజకీయ పార్టీలు నిర్ణయించాయి. అందుకనుగుణంగానే పోటీ పెట్టలేదు. కానీ కాంగ్రెస్‌ను వ్యతిరేకించిన బీజేపీ మాత్రం బంగారు లక్ష్మణ్‌ను బరిలో నిలిపింది. నియోజకవర్గంలో అంతగా పట్టులేని బీజేపీ ఆ ఎన్నికలో 45,944 ఓట్లు మాత్రమే సాధించి డిపాజిట్ కోల్పోయింది. పీవీకి మొత్తం 6,26,241 ఓట్లు రాగా 5,80,292 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఇక 1989 ఎన్నికల్లో హాజీపూర్ లోక్‌సభ స్థానం నుంచి 5,04,448 ఓట్ల మెజారిటీతో రామ్‌విలాస్ పాశ్వాన్ (జనతాదళ్) విజయం సాధించారు. 5 లక్షలకుపైగా మెజారిటీ సాధించిన మొట్టమొదటి నేతగా రికార్డు సృష్టించారు.
ఆ ఎన్నికల్లో పాశ్వాన్‌కు 6,15,129 ఓట్లు రాగా సమీప ప్రత్యర్థి మహబీర్ పాశ్వాన్ (కాంగ్రెస్)కు 1,10,681 ఓట్లు వచ్చాయి. తాజాగా జరిగిన కడప లోక్‌సభ నియోజకవర్గంలో కొత్తగా ఏర్పడిన వైఎస్ఆర్ కాంగ్రెస్, కాంగ్రెస్, టీడీపీల మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. ఈ ఎన్నికలో జగన్ 5,45,672 ఓట్ల భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు. అయితే పోలైన మొత్తం ఓట్లతో పోల్చితే పీవీకన్నా జగనే ముందంజలో నిలిచారు. పీవీకి నాడు 6,26,241 ఓట్లు రాగా జగన్ 6,92,251 ఓట్లు సాధించి దాన్ని అధిగమించడం గమనార్హం.
4 లక్షలకుపైగా రికార్డుల్లో వైఎస్: నాలుగు లక్షలకుపైగా ఓట్ల మెజారిటీ సాధించిన వారిలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఉన్నారు. దేశంలో ఎమర్జెన్సీ తర్వాత 1977లో జరిగిన లోక్‌సభ సాధారణ ఎన్నికల్లో జనతా పార్టీ తరఫున రామ్‌విలాస్ పాశ్వాన్ హాజీపూర్ లోక్‌సభ నియోజకవర్గంలో ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థిపై 4,24,545 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. 1991 వరకు దేశంలో అదే అత్యధిక మెజారిటీ. పీవీ ఆ రికార్డు అధిగమించారు. 1991 సాధారణ ఎన్నికల్లో కడప లోక్‌సభ నియోజకవర్గంలో సి.రామచంద్రయ్య (టీడీపీ)పై వైఎస్ రాజశేఖరరెడ్డి 4,22,790 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.