Post date: Apr 02, 2012 5:57:33 AM
ఇంగ్లిషు చానల్‌కు ఇంటర్వ్యూలో జగన్ ప్రశ్న
వైఎస్ ఇప్పుడు లేరు కనుకే ఇలా చేస్తున్నారు
{పోత్సాహకాలు ఇవ్వకుండా రాష్ట్రానికి పరిశ్రమలు ఎలా వస్తాయి?
ఒక్కసారైనా సచివాలయానికి వెళ్లానా?
ఏ మంత్రికి, ఐఏఎస్‌కు అయినా ఫోన్ చేశానా?
‘‘నా తండ్రి బతికి లేరు కనుకే నన్ను బలిపశువును చేయాలని చూస్తున్నారు. ఈ రాష్ట్రం బాగుపడాలనేది నా తండ్రిగారి ఉద్దేశం. పరిశ్రమల కోసం భూకేటాయింపులు ఒక్క మనరాష్ట్రంలోనే జరగలేదు. గుజరాత్‌కు వె ళ్తే ఇలాంటివి చాలా కనిపిస్తాయి. తమిళనాడు, మహారాష్ట్రలో చూడండి. ఇలాంటివి చాలా కనిపిస్తాయి...’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. గుంటూరు జిల్లా ఓదార్పు యాత్రలో జగన్ ఓ ఇంగ్లిష్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సీబీఐ తీరుపై మండిపడ్డారు. ఏ తప్పుచేశానని తనను అరెస్టు చేస్తారని నిలదీశారు. సీబీఐ శనివారం కోర్టులో వేసిన చార్జిషీటులోని అంశాల ఔచిత్యాన్ని ప్రశ్నించారు. ‘‘అసలు చార్జిషీటులో పేర్కొన్న వాటిని సాక్ష్యాధారాలుగా ఎలా చూస్తారు? వీటిని ఆధారాలుగా పరిగణిస్తే... తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాల్లో పరిశ్రమల కోసం చేసిన భూమి కేటాయింపులను ఎందుకు చూడరు? ఏ రాష్ట్రమైనా చేయాల్సింది పరిశ్రమలను ప్రోత్సహించడమే కదా! పరిశ్రమలు లేకుండా ఉపాధి కల్పన గురించి ఎలా ఆలోచించగలం. సీబీఐ ఈ పని చేస్తుందా’’ అని ప్రశ్నించారు. వైఎస్ హయాంలో అరబిందో, హెటిరో ఫార్మా కంపెనీలకు కేటాయించిన భూములు హైదరాబాద్లోనివో, హైదరాబాద్ పరిసరాల్లోనివో కాదనీ బాగా వెనుకబడిన మహబూబ్‌నగర్ జిల్లాలో 75 ఎకరాలు అరబిందోకు, మరోచోట 75 ఎకరాలు హెటిరోకు కేటాయించారని చెప్పారు. ఈ కంపెనీలు రెండూ రాష్ట్రంలోని టాప్ మూడు కంపెనీల్లోవని పేర్కొన్నారు. దేశంలో కూడా టాప్ ఐదు కంపెనీల్లో ఈ రెండూ ఉన్నాయన్నారు. ‘‘ఓవైపు పరిశ్రమలను తీసుకురావడంలో రాష్ట్రాల మధ్య తీవ్రమైన పోటీ ఉంది. ఉపాధి అవకాశాలు కల్పించాలనే తపనా ఉంది. ఇలాంటి నేపథ్యంలో మహబూబ్‌నగర్, మెదక్ వంటి వెనకబడిన ప్రాంతాల్లో 75 ఎకరాల చొప్పున ఇచ్చారు. సీబీఐ చార్జిషీటు ప్రకారం ఎకరా రూ.15 లక్షలు విలువ చేసే భూమిని రూ.7 లక్షలకే ఇచ్చారన్నది అభియోగం. ఈ విషయాన్ని సీబీఐ వేలెత్తి చూపితే... మరి చంద్రబాబు హయాంలో జరిగిన కేటాయింపులను ఏమంటారు? ఈ రోజు విచారణ జరుగుతున్న ఎమ్మార్ ప్రాపర్టీస్‌కు నగరం నడిబొడ్డున 535 ఎకరాల భూమిని ఎకరా కేవలం రూ.29 లక్షలకే కేటాయించారు. నగరంలో విల్లాల కోసం, గోల్ఫ్ కోర్సుల కోసం వీటిని ఇచ్చారు. అప్పుడు అక్కడ ఎకరా విలువ రూ.4 కోట్లు ఉంది. ఇంత విలువ చేసే భూమిని రూ.29 లక్షలకే ఇచ్చేశారు. చంద్రబాబు సతీమణి ఇదే ప్రాంతంలో గల తన ఆస్తిని అప్పటికి చాలా రోజుల ముందే.. ఎకరా రూ.కోటి చొప్పున అమ్మేశారు. రహేజా సంస్థకు కూడా హైదరాబాద్ నడిబొడ్డున 110 ఎకరాలు, ఎల్ అండ్‌టీకి 110 ఎకరాలు ఇచ్చారు. ఐఎంజీ భారత్‌కు 850 ఎకరాలు బాబు ఇచ్చారు. మరి దీన్నేమంటారు?’’ అని జగన్ ప్రశ్నించారు.
పెట్టుబడులు ఎలా పెట్టాలన్నది ఇన్వెస్టర్ల ఇష్టం..
రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి, రాజకీయ ప్రయోజనాల నడుమ మీరు బాధితుడనయ్యానని భావిస్తున్నారా? అని చానల్ ప్రతినిధి జగన్‌ను ప్రశ్నించగా.. ‘‘కచ్చితంగా... సీబీఐ అదే చేస్తోంది, మా పేపర్ ఫార్సు కాదు కదా! మా పత్రిక సర్క్యులేషన్ ఇవాళ 14.5 లక్షలు. దేశంలోనే 8వ స్థానంలో ఉంది. సాక్షి పత్రిక ప్రారంభానికి ఏడెనిమిది నెలల ముందే... సాక్షి మాదిరిగానే ఇంచుమించు సర్క్యులేషన్ కలిగిన ఈనాడు పత్రిక విలువ రూ.6,800 కోట్లు. సాక్షి విలువ అందులో సగం మాత్రమే. పైగా ఈనాడు ఆనాడు రూ.1,800 కోట్ల నష్టాల్లో ఉంది. ఈ విషయం అన్ని ఇంగ్లిష్ పత్రికల్లోనూ ప్రచురించారు. మా వాళ్లకు కూడా నేను చెప్పాను. ఆ పాత పత్రికా క్లిప్పింగులన్నింటినీ ప్రచురించమని... ఈనాడు మాదిరిగా కాకుండా సాక్షి ఒకేసారి 23 ఎడిషన్లు ప్రారంభించాం... అన్ని పేజీలూ రంగుల్లో ప్రచురణకు సంకల్పించాం... ఏడాది లోపే రికార్డుస్థాయి సర్క్యులేషన్‌కు చేరుకుంది. ఈనాడు కన్నా ఏ రకంగా చూసినా మాది బెటర్ (నాణ్యత గల) పేపర్. సాక్షి కోసం భూమి కొనుగోలు చేసి భవనాలు నిర్మించడం మొదలెట్టాక, యంత్రాలు రావడం ప్రారంభించాక మాత్రమే పెట్టుబడులు వచ్చాయి. ఒక పత్రిక బ్రేక్ ఈవె న్ (లాభాల్లోకి)కు చేరాలంటే 3 నుంచి 4 ఏళ్లు పడుతుంది. అలాంటిది సాక్షి మరో ఏడాదిలో పబ్లిక్ ఇష్యూకు వెళ్తుంది. మా పత్రికలో పెట్టుబడులు పెట్టేవారికి రె ట్టింపు లాభాలు వస్తాయి. పెట్టుబడులు ఎలా పెట్టాలనేది ఇన్వెస్టర్ల ఇష్టం. వేరేదానికీ దీనికీ ఎలా లింకు పెడతారు? ఇదెంత మాత్రం సరికాదు. నేను కనుక వైఎస్ రాజశేఖరరెడ్డి కుమారుడిని కాకపోయి ఉంటే నా విజయాలను చూసి ఉత్తమ పారిశ్రామిక వేత్త అవార్డుతో సత్కరించి ఉండేవారేమో’’ అని వ్యాఖ్యానించారు.
ప్రోత్సాహకాలు లేకుండా ఒక్క పరిశ్రమ కూడా రాదు..
ప్రోత్సాహకాలు, రాయితీలు లేకుండా ఏ రాష్ట్రంలోనూ ఒక్క పరిశ్రమ కూడా రాదని, ఇందులో తప్పులు ఎంచడం సరికాదని జగన్ అన్నారు. ‘‘ఇక్కడ భూములు ఇచ్చింది హైదరాబాద్‌లో కాదు.. వెనుకబడిన ప్రాంతాల్లో. ఎక్కడ పరిశ్రమలు రావాల్సిన అవసరం ఉంటే అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ మాట కొస్తే ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి ప్రిజమ్ సిమెంట్‌కు లక్ష రూపాయలకు ఎకరం చొప్పున వెయ్యి ఎకరాలు కేటాయించారు. ఇక్కడ భూమి కేటాయిస్తున్నది రూ.15 లక్షలకా.. ఏడు లక్షలకా అనేది కాదు, పరిశ్రమలు రావాలి.. ఉపాధి అవకాశాలు పెరగాలి అనే ప్రధాన ఉద్దేశంతోనే. మా తండ్రికి ముందున్న పాలకులు అనుసరించిన విధానాన్నే ఆయన కూడా కొనసాగించారు’’ అని పేర్కొన్నారు. ఈ వ్యవహారం వెనుక ఎవరున్నారని ప్రశ్నించినపుడు.. ‘దీని వెనుక ఎవరున్నారనేది మీకు తెలుసు.. అందరికీ తెలుసు... నా తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు నేను ఒక్క ఐఏఎస్ అధికారికైనా, మంత్రికైనా ఫోన్ చేశానా? ఒక్కనాడైనా సచివాలయానికి వెళ్లానా? అప్పట్లో హైదరాబాద్‌లో ఉండేవాడినే కాను. 20 రోజులకు ఒకసారి వచ్చి మా తల్లిదండ్రులను చూసి వెళ్లే వాడిని. నా తండ్రి జీవించి లేరు కనుక నన్ను బలిపశువును చేయాలని చూస్తున్నారు’’ అని చెప్పారు. ‘‘నా మనస్ఫూర్తిగా ఒక్కటే చెబుతున్నాను. దేవుడు అన్నీ చూస్తున్నాడు... రేపు దేవుడే న్యాయం చేస్తాడు...’’ అని అన్నారు. అరెస్టు అంశాన్ని ప్రస్తావించినపుడు ‘‘ఎవరైనా నన్నెందుకు అరెస్టు చేస్తారనుకుంటున్నారు... సీబీఐ మీకేమైనా లీకు ఇచ్చిందా! అసలు అరెస్టు చేయడానికి నేనేం తప్పు చేశానని? నాపై ఉన్న అభియోగాలేమిటి? నేను ఏనాడైనా ఒక్క ఐఏఎస్‌కు గానీ, మంత్రికి గానీ ఫోన్ చేశానా? నాకు అర్థం కానిదొక్కటే ఏ ఆధారం లేకుండా అరెస్టు చేస్తారని ఎందుకు భావిస్తున్నారు?’’ అని అన్నారు.