Post date: Apr 28, 2011 5:19:49 AM
వైఎస్ కొడుకుగానేనీ మాటలు చెబుతున్నా
వక్రీకరణలతో ఎల్లో మీడియా ముస్లింలను మా నుంచి విడదీయలేదు
ప్రొద్దుటూరు(వైఎస్ఆర్ జిల్లా), న్యూస్‌లైన్: బీజేపీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి పునరుద్ఘాటించారు. ఇప్పటికీ, ఎప్పటికీ తనది అదే మాట అని విస్పష్టంచేశారు. మాట తప్పని, మడమ తిప్పని వైఎస్ రాజశేఖరరెడ్డి కొడుకుగా తానీ మాట చెబుతున్నానన్నారు. బీజేపీతో పొత్తుపై ఆలోచిస్తామని జగన్ అన్నట్లుగా బుధవారం ఓ వర్గం మీడియాలో జరిగిన ప్రచారాన్ని ఆయన గట్టిగా ఖండించారు. 4% రిజర్వేషన్లకు కూడా అంగీకరించని బీజేపీ.. మతతత్వాన్ని పక్కన పడేసి, ముస్లిం సోదరులకు పది శాతం రిజర్వేషన్ ఇవ్వడం ఎంత అసంభవమో... తాను ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవడం కూడా అంతే అసంభవమని ఆయన నొక్కి చెప్పారు. ముస్లింలు అధికంగా ఉన్న ఖాదరబాద్ గ్రామంలో బుధవారం రోడ్‌షోలో ప్రజలనుద్దేశించి జగన్ మాట్లాడారు.
‘ముస్లిం సోదరుల స్పందన చూసి 125 ఏళ్ల కాంగ్రెస్ పార్టీకి వెన్నులో వణుకు పుడుతోంది. నేను, ఉదయం మాట్లాడిన మాటలను ఓ వర్గం మీడియా వక్రీకరించింది. ఈనాడు, మిగతా
దాని తోక పత్రిక, ఇటీవలే ఆ వర్గంలో చేరిన టీవీ-9 చానెల్ నా మాటలను వక్రీకరించాయి. బీజేపీతో పొత్తుపెట్టుకోనని ఒకటికి రెండు సార్లు, రెండుకు మూడు సార్లు, మూడుకు నాలుగు మార్లు చెప్పాను.. అయినా నా మాటలను వక్రీకరిస్తున్నారు’ అని ఆయన అసహనం వ్యక్తంచేశారు. మైనారిటీలుగా దుర్భర పరిస్థితుల్లో జీవితాలు వెళ్లదీస్తున్న ముస్లింల బతుకులు బాగు చేయడానికి తమ పార్టీ పాటుపడుతుందని ఉద్ఘాటించారు.
‘సైకిల్ తొక్కే వాడు సైకిల్ తొక్కుతూనే ఉన్నాడు. ఆటో నడిపే వాడు ఆటో నడుపుతూనే ఉన్నాడు. ఇది సరికాదన్నదే నా అభిప్రాయం. అందుకే.. ప్రతి ముస్లిం సోదరుడూ చదవాలి. ప్రతి కుటుంబంలో ఒక్కరైనా ఇంజనీరో, డాక్టరో కావాలి. పెద్ద చదువుల కోసం ఎవరూ అప్పుల పాలు కాకూడదు. ప్రతి ముస్లిం కుటుంబం అభివృద్ధి చెందాలనేదే నా ఆశయం’ అని జగన్ వివరించారు. ఆయన అంతకు ముందు ఉదయం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాలులో జరిగిన ముస్లింల సమావేశంలో ప్రసంగిస్తూ.. బీజేపీతో పొత్తు అనేది ఎప్పటికీ ఉండదని స్పష్టంగా చెప్పినప్పటికీ.. ఓ వర్గం మీడియా జగన్ బీజేపీతో కలిసి పోతున్నారని రోజంతా నానా యాగీ చేసింది.