Post date: Apr 15, 2011 6:44:11 AM
వ్యూహం తయారు చేస్తున్నది ఢిల్లీలోనేగా
చిన్న పిల్లాడైతే ఇన్ని బ్రహ్మాస్ర్తాలెందుకు?
16 మంది మంత్రులు కడప వెళ్లడం అవసరమా?
ప్రభుత్వ సలహాదారు పదవికి మరోసారి రాజీనామా
జగన్ తరఫున ఉప ఎన్నికల్లో ప్రచారం చేస్తా
హైదరాబాద్, న్యూస్‌లైన్:
కడప, పులివెందుల ఎన్నికల వ్యూహాన్ని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ స్వయంగా తయారు చేసినప్పుడు ఎన్నికలు జరుగుతున్నది సోనియాగాంధీకి, జగన్మోహన్రెడ్డి కాదని ఎలా చెబుతారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుని పదవికి రాజీనామా చేసిన సీసీ రెడ్డి ప్రశ్నించారు. సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉప ఎన్నికలకు దాదాపు 16 మంది మంత్రులు, అంటే అర్ధ ప్రభుత్వం వెళ్లడం అవసరమా అని నిలదీశారు. వారంతా జనాన్ని ప్రలోభపెట్టేందుకే వెళ్లుతున్నారని విమర్శించారు. జగన్ చిన్న పిల్లాడైతే ఆయనపై ఇన్ని బ్రహ్మాస్ర్తాలు ఎందుకని ఎద్దేవా చేశారు. ఉప ఎన్నికల్లో జగన్, వాళ్ల అమ్మ విజయానికి ఎటువంటి ఢోకా లేదని చెప్పారు. సలహాదారులను తొలగిస్తున్నట్లు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఢిల్లీలో ప్రకటన చేయగానే తాను ఆ పదవికి రాజీనామా చేసినప్పటికీ ఇంతవరకు ఆమోదించకపోవడాన్ని సీసీ రెడ్డి ప్రశ్నించారు. జగన్ తరఫున ఉప ఎన్నికల్లో ప్రచారం చేయాలన్న ఉద్దేశంతో తన రాజీనామా విషయాన్ని ఇప్పుడు మరోసారి పత్రికా ముఖంగా తెలియజేస్తున్నానని తెలిపారు. ఈ సందర్భంగా సీసీ రెడ్డి కొన్ని ప్రశ్నలు సంధించారు.
విజయమ్మ ఉత్తరం రాసిన నెలరోజుల తర్వాత సోనియా అపాయింట్మెంట్ ఇచ్చారు. అప్పుడు కూడా విజయమ్మను కనీసం పలకరించకపోతే జగనే ఓదార్చి బయటకు తీసుకువచ్చారు. అలాంటిది మనకు ఎదురయితే వ్యక్తిగతంగా మనం ఎలా ఫీలవుతాం?
కాంగ్రెస్ నేతలు మంత్రి వర్గ సమావేశాల్లోనూ, బహిరంగ సమావేశాల్లోనూ వైఎస్ రాజశేఖరరెడ్డిని తిట్టి, ఎన్నికల్లో ఫొటో వాడుకుంటామంటారు. వైఎస్ మంచివాడో.. కాదో ముందు కాంగ్రెస్ పార్టీ తేల్చాలి.
ప్రజాసంక్షేమ పథకాలన్నీ వైఎస్, ఆయన బృందం రూపొందించినవే. అవి కాంగ్రెస్‌వి అయితే మిగతా రాష్ట్రాల్లో అంతకుముందు లేవేమిటి? లేదా తరువాతనైనా వాటిని ఆయా రాష్ట్రాల్లో ఎందుకు అమలు చేయలేదు?
జగన్ ఐదేళ్లలో దండిగా డబ్బు సంపాదించాడంటున్నారు. ఒక జీవిత కాలంలోనో, రెండు జీవితకాలాల్లోనో అంబానీలు దేశంలోకెల్లా పెద్ద కోటీశ్వరులు అయ్యారు. వందల ఏళ్ల నుంచి వ్యాపారం చేసే వారికన్నా ఎన్నో వేల రెట్లు వారి సంపాదన పెరిగింది. అది అవినీతా?
తండ్రి శవం ఉండగానే ముఖ్యమంత్రి పదవి కోసం జగన్ సంతకాలు చేయించారంటున్నారు. జగన్ బాధలో ఉంటే ఆయన కావాల్సిన వారు చేసి ఉండవచ్చు. జగన్ సీఎం కావాలని 150 మంది సంతకాలు చేస్తే అది అప్రజాస్వామికం. ఢిల్లీ నుంచి చీటీ రాసి ఈయనే సీఎం అని పంపితే అది ప్రజాస్వామ్యమా?
సీఎం కావాలని అనుకుంటున్న జగన్‌ది దురాశ అంటున్నారు. జగన్‌కి అనుభవం లేదంటున్నారు. ఇందిరాగాంధీ చనిపోయినప్పుడు కనీసం పంచాయితీ నడిపిన అనుభవం కూడా లేని రాజీవ్‌గాంధీకి ప్రధాని పదవి ఇవ్వలేదా? ఆయన మంచి ప్రధాని అనిపించుకోలేదా?