Post date: Aug 15, 2011 12:30:31 PM
సిబిఐ విచారణపై రేపు సుప్రీం కోర్టులో అప్పీల్ చేస్తానని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపి జగన్మోహన రెడ్డి చెప్పారు. జాతీయ మీడియాతో ఆయన ఈరోజు మాట్లాడారు. సాక్షి, భారతి సిమెంట్స్, వవర్ ప్రాజెక్టులలో పెట్టుబడులు అన్నీ పారదర్శకంగా పెట్టినవేనని చెప్పారు. తనపై నమ్మకంతో పెట్టుబడులుపెట్టినవారందరూ లాభాలు పొందారని తెలిపారు. భారతి సిమెంట్స్.లో ముగ్గురే పెట్టుబడిదారులు ఉన్నట్లు చెప్పారు. మిత్రుడు ప్రసాద్ 256 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి, 500 కోట్ల రూపాయల వరకు లాభాలు ఘడించినట్లు వివరించారు.
కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు తనపై ఎటువంటి ఆరోపణలు చేయలేదన్నారు. ఆ పార్టీని వదిలి వచ్చిన తరువాత తనని లక్ష్యంగా చేసుకున్నారని చెప్పారు. తనని ఎన్ని వేధింపులకు గురిచేసినా దేవుడే చూసుకుంటాడన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు 9 ఏళ్ల పాలనలో భూ కేటాయింపులు జరగలేదా అని ప్రశ్నించారు. వేల ఎకరాలను ప్రైవేటు సంస్థలకు దారాదత్తం చేశారని, దానిపై ఎందుకు మాట్లాడటంలేదన్నారు. భూకేటాయింపులకు చంద్రబాబు అనుసరించిన విధానాలనే తన తండ్రి కొనసాగించారని చెప్పారు. లేని వ్యక్తిపై విమర్శలు అనైతికం అన్నారు. చనిపోయిన తన తండ్రిపై విమర్శలు తగదన్నారు. ఎకరా భూమి కేటాయించినా అది మంత్రి మండలి సమష్టి నిర్ణయమేనని స్పష్టం చేశారు. సిబిఐని కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అన్న చంద్రబాబు ఇప్పుడు తనపై సిబిఐ విచారణ ఎలా అడుగుతున్నారని ఆయన ప్రశ్నించారు.
2జి స్పెక్ట్రమ్.కు సంబంధించి కోట్లాది రూపాయల స్కాం జరిగినా ప్రధాని సిబిఐ విచారణకు ఆదేశించలేదన్నారు. ఈ విషయంలో ఒక్క మంత్రినే బలిపశువుని చేశారని విమర్శించారు. దేశంలో సాక్షి పత్రిక 9వ స్థానంలో ఉందని తెలిపారు. ఎబిసి నివేదిక ప్రకారం సాక్షి సర్క్యులేషన్ 14.5 లక్షలని చెప్పారు. ఐఆర్.ఎస్ రీడర్.షిప్ సర్వే ప్రకారం సాక్షికి కోటి 40 లక్షల మంది పాఠకులు ఉన్నారన్నారు. అది రాష్ట్రంలో మరో పత్రికకు అక్కసుగా ఉందన్నారు. తమ పత్రికపై అనవసరంగా బుదరజల్లుతున్నారన్నారు. తాము ఏ పార్టీకి వ్యతిరేకం కాదని, రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగా తాము వ్యవహరిస్తామని జగన్ తెలిపారు. బిజెపితో తప్ప ఏ పార్టీతోనైనా పొత్తు పెట్టుకుంటామని చెప్పారు.
తన తండ్రి చేసిన పాదయాత్రలే 2004లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చాయన్నారు. ఆ తరువాత కూడా తన తండ్రి అనుసరించిన విధానాల వల్లే ఆ పార్టీ అధికారంలోకి వచ్చినట్లు తెలిపారు. ఆయన కృషి వల్లే అధిక లోక్.సభ స్థానాలు గెలుచుకొని కేంద్రం బలోపేతం అయిందన్నారు.