Post date: Aug 17, 2011 9:21:56 AM
హైకోర్టు తీర్పు అమలును నిలిపివేయాలంటూ అభ్యర్థించిన జగన్మోహన్రెడ్డి అందుకు కింది కారణాలను సుప్రీంకోర్టుకు నివేదించారు. అవి...
1. నేను రాజకీయ కక్ష సాధింపుల బాధితుడిని. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశంతోనే హైకోర్టుకు లేఖ రాశానని శంకర్రావు చెప్పడంతోనే ఈ విషయం స్పష్టమైంది. గత ఏడేళ్లుగా శంకర్రావు ఎటువంటి ఆరోపణలు చేయలేదు. అంతేకాక పోలీసులనుగానీ, మేజిస్ట్రేట్నుగానీ ఆశ్రయించలేదు.
2. సీబీఐ ప్రాథమిక విచారణ నివేదిక పరిశీలించి, దానిని అందచేయాలని పిటిషన్ దాఖలు చేసుకున్నప్పటికీ దానిని నాకు ఇవ్వకపోవడం చూస్తుంటే, కోర్టు నాకు వ్యతిరేకంగా పక్షపాతంతో వ్యవహరించిందనేందుకు తగిన కారణాలు ఉన్నాయి. హైకోర్టు నా విషయంలో సహజ న్యాయసూత్రాలను పాటించలేదనేందుకు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి.
3. సిమెంట్, విద్యుత్ ప్రాజెక్టులు, మీడియా రంగాల్లో నేను విజయవంతమైన వ్యాపారవేత్తగా ఉన్నా. 2008, మార్చిలో నా ఆధ్వర్యంలో సాక్షి దినపత్రిక ప్రారంభమైంది. మూడేళ్లలోనే 14.50 లక్షల సర్క్యులేషన్‌తో రాష్ట్రంలో రెండవ అతిపెద్ద దినపత్రికగా నిలిచింది. హైకోర్టు తీర్పు ఆధారంగా సీబీఐ జరిపే దర్యాప్తు వల్ల నాకు, నా కంపెనీల ప్రతిష్టకు తీవ్ర హాని జరుగుతుంది. చట్ట ప్రకారం ఏ ప్రొసీడింగ్స్ జరిపినా నాకు అభ్యంతరం లేదని నేనిప్పటికే పలుమార్లు చెప్పాను. ప్రస్తుత తీర్పును, తదానుగుణ చర్యలను నిలుపుదల చేయకపోతే నాకు తీవ్ర నష్టం కలుగుతుంది. ఇదే సమయంలో నాకు వ్యతిరేకంగా సీబీఐ దర్యాప్తునకు ఆదేశించడాన్ని తన విజయంగా చెప్పుకుంటూ శంకర్రావు రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్నారు.
4. అక్రమాలు జరిగాయని ఆరోపిస్తున్న శంకర్రావు గత ఏడు సంవత్సరాలుగా ఎందుకు మౌనంగా ఉన్నారో వివరించడం లేదు. పోలీసులను, మేజిస్ట్రేట్‌ను ఎందుకు ఆశ్రయించలేదో చెప్పడం లేదు. కాబట్టి సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాల్సినంత అత్యవసరమేదీ ఈ కేసులో కనిపించడం లేదు. హైకోర్టు తీర్పు అమలును నిలుపుదల చేస్తేనే కోర్టు న్యాయం చేసినట్లవుతుంది.
5. రిట్ ఆఫ్ మాండమస్‌ను కోరుతూ లేఖ రాసినప్పుడు, మొదట సంబంధిత అధికారులను ఆశ్రయించాలని, అధికారులు ఫిర్యాదుపై తగిన విధంగా స్పందించకుంటే అప్పుడు తమను ఆశ్రయించాలని చెప్పడం ఉన్నత న్యాయస్థానాల్లో సర్వ సాధారణం. అలాకాకుండా శంకర్రావు లేఖను రిట్ పిటిషన్‌గా విచారించడం హైకోర్టుకు సమంజసం కాదు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటూ ఈ నెల 10న హైకోర్టు వెలువరించిన తీర్పు అమలును, తదానుగుణ చర్యలన్నింటినీ నిలుపుదల చేయాలి.