Post date: Aug 24, 2011 4:38:11 AM
జగన్ ఝలక్‌తో సిఎం కిరణ్ అలెర్ట్ అయ్యారు. ప్రస్తుతం రాజీనామాలు చేసిన 29 మందితో పాటుగా మరో 20మంది ఎమ్మెల్యేలు జగన్ గ్రూపులో చేరి రాజీనామాలు సమర్పించనున్నారని వదంతులు వచ్చాయి. దీంతో ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షుడు బొత్స అప్రమత్తమయ్యారు. జిల్లాల వారీగా జగన్ వైపు వెళ్లే అవకాశమున్న ఎమ్మెల్యేలను పిలిపించుకుని క్యాంపు కార్యాలయంలో సిఎం బుజ్జగింపులు ప్రారంభించారు.
బుజ్జగింపులు….
సిబిఐ ఎఫ్ఐఆర్లో దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పేరును ప్రస్తావించడాన్ని నిరసిస్తూ నిన్న 29 మంది ఎమ్మెల్యేలు శాసనసభ్యత్వానికి, కాంగ్రెస్ పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. మరో 20 మంది రాజీనామాకు సిద్ధమవుతున్నారని వస్తున్న వార్తలతో కిరణ్ శిబిరం అప్రమత్తమయింది. ముందుగా అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలను పిలిచి సిఎం నేరుగా మాట్లాడుతున్నారు. అందుబాటులో లేని వారితో మాట్లాడే బాధ్యతను జిల్లా ఇన్‌ఛార్జి మంత్రులకు అప్పగించారు. 29 మందికి మించి ఒకరు కూడా రాజీనామా చేయకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి మంత్రులకు సూచించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా తనను కలిసిన వారికి సిఎం హామీల వర్షం కురిపించినట్లు సమాచారం.
1. 2011 ఎన్నికల్లో టిక్కెట్ గ్యారంటీ.
2. నియోజకవర్గాల్లో ప్రభుత్వ నిధుల అధిక కేటాయింపు.
3. మాటవినని అధికారులను బదిలీ చేయడం.
4. నామినేటెడ్ పోస్టులకు ఎమ్మెల్యేలు చెప్పిన వారినే నియమించడం.
వంటి హామీలను సిఎం తన వద్దకు వచ్చిన వారికి ఇస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా కాంగ్రెస్ లో ఉంటే భవిష్యత్తు ఉంటుందని, పార్టీని వీడితే నష్టపోయేది మీరేనని కూడా సిఎం సుతిమెత్తగా హెచ్చరిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే స్వల్ప ప్రయోజనాలకు ఆశించకుండా ఉంటే దీర్ఘకాలిక ప్రయోజనాలు
దక్కుతాయని కూడా సిఎం విస్పష్ట హామీని ఎమ్మెల్యేలకు ఇస్తున్నారు. మరోవైపు పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కూడా తన సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలకు నచ్చచెబుతున్నారు. జగన్ మరో 20 మందిని కూడగట్టగలిగితే సర్కారు మనుగడ కష్టమవుతుంది. అప్పడు టిడిపి కూడా సర్కారు వెంట ఉండటం కష్టసాద్యమే. దీంతో ఎమ్మెల్యేలు జగన్ వైపుకు మరలకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
నామినేటెడ్ పందేరం…
వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మరణానంతరం రాష్ట్రంలో నామినేటెడ్ పోస్టుల భర్తీ జరగలేదు. ప్రధానంగా జిల్లా స్థాయి నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయంలో మంత్రులకు, సంబంధిత జిల్లా ఎమ్మెల్యేలకు మధ్య ఏకాభిప్రాయం కుదరక రోశయ్య, కిరణ్ హయాంలో నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ ముందుకు సాగలేదు. అయితే ఇప్పుడు వాటిని భర్తీ చేయకతప్పని పరిస్థితి. ఎందుకంటే ద్వితీయ శ్రేణి నాయకుల్లో అధికమంది జగన్ వైపు వెళ్లనున్నట్లు ఇంటలిజెన్స్ రిపోర్ట్లు అందాయి. దీంతో కిరణ్ వెంటనే వాటి భర్తీకి నడుంబిగించారు. నామినేటెడ్ పోస్టులు ఎన్ని ఖాళీలు ఉన్నాయో వెంటనే తనకు చెప్పాలని సిఎం అధికారులను ఆదేశించారు. ఆ జాబితాను పక్కన బెట్టుకుని సంబంధిత ఎమ్మెల్యేలు. జిల్లా నేతలు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులతో మాట్లాడి త్వరలోనే పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టనున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద జగన్ ఝలక్‌తో కాంగ్రెస్ నేతలు అప్రమత్తమై నష్టనివారణ చర్యలు చేపట్టారు. కాని అవి ఎంతవరకు ఫలిస్తాయో వేచిచూడాల్సిందే.