Post date: Aug 18, 2011 5:43:16 AM
వైయస్ రాజశేఖర రెడ్డి మృతిపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు, సినీ నటి రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై ఆమె తీవ్ర ఆరోపణ చేశారు. వైయస్ రాజశేఖర రెడ్డి మరణిస్తారని కిరణ్ కుమార్ రెడ్డికి ముందే తెలుసునని, కిరణ్ కుమార్ రెడ్డికి 15 నిమిషాల ముందే ఆ విషయం తెలుసునని, అందుకే వైయస్సార్తో పాటు అప్పుడు శాసనసభ స్పీకర్గా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి వెళ్లలేదని ఆమె బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆరోపించారు. తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై కాంగ్రెసు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆమె విమర్శించారు.
వైయస్సార్ మృతి వెనక కాంగ్రెసు హస్తం ఉందనే అనుమానాలున్నాయని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు కొణతాల రామకృష్ణ విశాఖపట్నంలో అన్నారు వైయస్సార్ మృతిపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరగలేదని ఆయన విమర్శించారు. వైయస్ హెలికాప్టర్ ప్రమాదంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇద్దరు అధికారులను బలి చేసి చేతులు దులుపుకోవడం సరికాదని ఆయన అన్నారు. వారిపై చర్యలు తీసుకుని వైయస్సార్ మృతి కేసును మూసివేద్దామనే ఆలోచన ప్రభుత్వం ఉన్నట్లు అర్థమవుతోందని ఆయన అన్నారు.