Post date: Jan 31, 2011 7:0:18 AM
గతం మరిచిన గజిని
నాడు అధికార పక్షంలో ఉన్నప్పుడు.. తొమ్మిదేళ్లు...965 హత్యలు
మూడురోజులకో ఫ్యాక్షన్ హత్య
నేడు అధికార పక్షంతో కలిసి... 2001 నాటి ‘వాంగ్మూలం’తో కాంగ్రెస్, ఎల్లో మీడియాలతో కుమ్మక్కై టీడీపీ నాటకం
బాబు పాలనలో రెండు రోజులకో ఫ్యాక్షన్ దాడి, ప్రతిదాడులు
అధికార పార్టీ అండతోనే ఇవన్నీ సాగాయని కుండబద్దలు కొట్టిన జస్టిస్ రంగరాజు నివేదిక
ఫ్యాక్షనిస్టులను, నేర చరితులను చేరదీసి టికెట్లు, మంత్రి పదవులిచ్చిన బాబు
దొంగే దొంగా అని అరిచినట్టుగా, ఫ్యాక్షనిజాన్ని తగ్గించేందుకు కృషి చేసిన వైఎస్‌పైనే ఆరోపణలు
కాంగ్రెస్ అధిష్టానంతో, సీఎంతో చేతులు కలిపేందుకూ వెనకాడని విపక్ష నేత
హైదరాబాద్, న్యూస్‌లైన్: ‘‘టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు హయాంలో తొమ్మిదేళ్ల పాటు రాష్ట్రంలో ఫ్యాక్షన్ మూడు పువ్వులు, ఆరు కాయలుగా వర్ధిల్లింది’’-
ఇదేదో గిట్టనివారి విమర్శ కాదు. రాజకీయ ప్రత్యర్థుల ఆరోపణ అంతకన్నా కాదు. రాయలసీమ ఫ్యాక్షన్‌పై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన జస్టిస్ బీవీ రంగరాజు నివేదిక సారాంశం! ఆయన పాలనలో అనునిత్యం ఫ్యాక్షన్ దాడులు, ప్రతి దాడులు, అక్షరాలా రెండు రోజులకో ఫ్యాక్షన్ గొడవ, మూడు రోజులకో ఫ్యాక్షన్ హత్య జరిగాయంటూ ఆ నివేదిక కుండబద్దలు కొట్టింది! రాయలసీమ ఫ్యాక్షన్ ముఠాలకు అధికార పార్టీ ప్రోత్సాహం తోడవడంతో ఈ హత్యల పరంపర అప్రతిహతంగా సాగిందని స్పష్టం చేసింది. ‘‘చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలనలో 965 హత్యలు జరిగాయి. ఇందులో చాలావరకు విపక్ష కాంగ్రెస్ నేతలను లక్ష్యంగా చేసుకున్నవే. హతుల్లో 443 మంది కాంగ్రెస్ వారే’’నని పేర్కొంది. తద్వారా బాబు హయాంలో రాష్ట్రం రక్తసిక్తమైన వైనాన్ని బట్టబయలు చేసింది.
రాష్ట్రంలో ఫ్యాక్షనిజాన్ని పెంచి పోషించి పాపం మూటగట్టుకున్నదెవరో చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం ఇంకేం కావాలి? ఇంతటి ఘన చరితుడైన బాబు, ఫ్యాక్షనిజాన్ని తగ్గించేందుకు అహర్నిశలూ కృషి చేసి, అందుకోసం ఏకంగా తన తండ్రి హంతకులను కూడా క్షమించి వదిలేసిన దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డిపై, ఆయన కుమారుడు జగన్మోహన్రెడ్డిపై అవే ఫ్యాక్షనిజం ఆరోపణలను నిస్సిగ్గుగా గుమ్మరిస్తుండటాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?
కానీ... ప్రజల జ్ఞాపకశక్తిని మరీ తక్కువగా అంచనా వేయడంలో బాబు ముందు ఎవరైనా బలాదూరే! అధికారం అండతో అప్పుడెప్పుడో రాష్ట్రంలో తాను పారించిన రక్తపుటేర్లను వారంతా ఎప్పుడో మర్చిపోయి ఉంటారు లెమ్మన్న ధీమా ఆయనది. రాయలసీమ ఫ్యాక్షన్‌ను అడ్డం పెట్టుకుని... ఫ్యాక్షనిస్టులను, నేర చరితులను అక్కున చేర్చుకుని... ఎమ్మెల్యే టికెట్లు, మంత్రి పదవులతో సత్కరించి, వారి మధ్యనున్న పగ ప్రతీకారాలను తన రాజకీయ ప్రయోజనాలకు నిస్సంకోచంగా వాడుకుని... తొమ్మిదేళ్ల పాటు తాను చవిచూపిన రక్తసిక్త పాలనను ఇప్పుడెవరూ ప్రస్తావించరన్న, ప్రశ్నించరన్న నమ్మకం నారా బాబుది. ఆ నమ్మకంతో మరో నయా నాటకానికి తెర తీశారాయన! 2004 ఎన్నికలకు ముందు దివంగత వైఎస్‌ను ఫ్యాక్షనిస్టుగా చిత్రించబోయి ఘోరంగా చతికిలపడ్డ విపక్ష నేత, తాజాగా ఆయన కుమారుణ్ని లక్ష్యంగా చేసుకున్నారు. ఏ ఆధారమూ లేకపోయినా సరే... పరిటాల రవి హత్యను యువనేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి ముడిపెట్టే దారుణానికి దిగారు. అందుకోసం ఏకంగా రాజకీయ ప్రత్యర్థయిన కాంగ్రెస్ అధిష్టానంతోనూ, సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డితోనూ చేతులు కలిపారు! తన నైచ్యానికి అంతన్నదే లేదని మరోసారి నిస్సంకోచంగా రుజువు చేసుకున్నారు.
దినుసులన్నీ సమపాళ్లలో నూరి మరీ ఎల్లో మీడియా అందించిన స్క్రిప్టును అంతా కలిసి పక్కాగా అమలు చేస్తున్నారు. అందులో భాగంగానే, విపక్ష ఎమ్మెల్యే హత్య కేసులో జగన్ ముద్దాయి అంటూ నాటకానికి సీఎం తెర తీశారు. తర్వాతి కథను బాబు నడిపిస్తున్నారు. అందుకే... తన హయాంలో ఫ్యాక్షన్‌ను పరమాయుధంగా వాడుకుని, అందులో ఆరితేరినవారికి పదవులు, పార్టీ బాధ్యతలు కట్టబెట్టి, రాజకీయ ప్రత్యర్థులపై లెక్కలేనన్ని అక్రమ కేసులు బనాయించి, పరిటాల-మద్దెలచెర్వు సూరి కుటుంబాల మధ్య తరతరాలుగా రగిలిన పగలను రాజకీయ ప్రయోజనాలకు వాడుకుని తరించిన బాబుకు ఇప్పుడు అదే ఫ్యాక్షన్ పరమ భయంకరంగా కనిపిస్తోంది! అది నేరమని హఠాత్తుగా గుర్తుకొస్తుంది.
స్వప్రయోజనాల కోసం ఎంతకైనా తెగించేందుకైనా, రాజకీయంగా అడ్డొస్తారనుకున్న వారిపై ఎంతటి దుష్ర్పచారానికైనా ఒడిగట్టేందుకు వెనకాడని బాబు ప్రసుత్తం ప్రదర్శిస్తున్న ఈ గురివింద లీలలు చూసి ప్రజలతో పాటు ఆయన సొంత పార్టీ పరివారం కూడా అవాక్కవుతున్నారు!
అప్పుడు పట్టించుకోలేదేం బాబూ...?
2001లో పులివెందులకు చెందిన దంతలూరి కృష్ణ ఇచ్చినట్టుగా చెబుతున్న వాంగ్మూలాన్ని ఇప్పుడు తెరపైకి తెచ్చి అటు ఎల్లో మీడియా, ఇటు ఎల్లో పార్టీ పెద్ద జాయింటుగా గుండెలు బాదుకుంటున్నారు. ఆ వాం గ్మూలం ఆధారంగా సీబీఐ ఒక నోట్ ద్వారా కృష్ణను విచారిస్తే, అదే సీబీఐ విచారణ అంటూ తప్పుడు ప్రచారంతో ఊదరగొట్టారు. నిజానికి అప్పుడు చంద్రబాబే ముఖ్యమంత్రి. అధికారం ఆయన చేతిలోనే ఉంది. ఒకవేళ పక్కా ఆధారాలే ఉంటే దోషులపై కేసులెందుకు పెట్టలేదు? వారినెందుకు దండించలేదు? ఎందుకంటే అది తప్పుడు వాంగ్మూలమని, కోర్టుల ముందు నిలవదని అందరికంటే ఆయనకే బాగా తెలుసు. కానీ ఇప్పుడు జగన్ ప్రభంజనంలో అడ్డంగా కొట్టుకుపోతుండేసరికి అదే వాంగ్మూలాన్ని అడ్డు పెట్టుకుని అటు అధికార, ఇటు విపక్ష పెద్దలు ఇటువంటి తప్పుడు ప్రచారానికి తెగించారు.
ఇది చివరికి టీడీపీకే బెడిసికొట్టడం ఖాయమని ఆ పార్టీ నేతలే అంటున్నారు! ‘‘సీమలో ఫ్యాక్షనిజం తగ్గుముఖం పట్టి ప్రశాంత వాతావరణం నెలకొన్న తరుణంలో బాబు ఏ రాజకీయ ప్రయోజనం ఆశించి ఇలా ఫ్యాక్షన్ గురించి మాట్లాడుతున్నారో మాకర్థం కావడం లేదు. కానీ ఆ క్రమంలో ఆయన చేస్తున్న అసత్య ఆరోపణలు, అవాస్తవ ప్రచారాలు మా కార్యకర్తలకే మింగుడు పడటం లేదు’’ అని రాయలసీమకే చెందిన టీడీపీ ఎమ్మెల్యే ఒకరు వ్యాఖ్యానించడం విశేషం.
ఓ వైపు నిరంతరం ఫ్యాక్షన్‌ను ప్రోత్సహిస్తూ, మరోవైపు వైఎస్సే ఫ్యాక్షనిస్టంటూ గోబెల్స్ ప్రచారానికి దిగిన నీచ మనస్తత్వం బాబుదని మాజీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు విమర్శించారు. ‘‘రాజకీయ లబ్ధికోసం ఎదుటి వారిపై ఎంతటి ఆరోపణలు అయినా చేయగలిగిన నేతగా దేశవ్యాప్తంగా బాబుకు తిరుగులేని పేరుంది. ఏదైనా ఆరోపణ చేస్తే అందులో కనీసం ఎంతో కొంత నిజముండాలన్న దానితో బాబుకు నిమిత్తం లేదు. దాన్ని జనం నమ్ముతారా, లేదా అన్న ఇంగితమూ లేదు’’ అని దుయ్యబట్టారు. ఆ కారణంగానే బాబు ఏం చెప్పినా జనం నమ్మడం లేదని విశ్లేషించారు.
ఫ్యాక్షనిజానికి బాబు ఊతమిచ్చిన తీరిదీ
ఫ్యాక్షనిజం నిర్మూలనకు తన తొమ్మిదేళ్ల హయాంలో బాబు ఏనాడు పొరపాటున కూడా ప్రయత్నించలేదు. పెపైచ్చు జిల్లాల వారీగా ఫ్యాక్షనిజపు చిచ్చును నిత్యం ఎగదోస్తూ పబ్బం గడుపుకున్నారు. ఆ క్రమంలో ఫ్యాక్షనిజంలో ఆరితేరిన వారిని ఏరికోరి చేరదీశారు. కాంగ్రెస్‌ను నిర్వీర్యం చేసేందుకు వారి సాయం తీసుకున్నారు. అందుకు రుజువులు కూడా కోకొల్లలుగా కన్పిస్తాయి. నక్సలైట్ ఉద్యమం నుంచి ఫ్యాక్షన్ బాట పట్టిన పరిటాల రవీంద్రపై పలు హత్యారోపణలున్నాయి. పెనుకొండ మాజీ ఎమ్మెల్యేలు ఓబుల్‌రెడ్డి, సానె చెన్నారెడ్డి, సానె వెంకట రమణారెడ్డి హత్యలతో పాటు అనేక దాడులు, హింసాత్మక సంఘటనల్లో ఆయనకు ప్రత్యక్ష, పరోక్ష సంబంధాలున్నట్టు ఆరోపణలు ఎదుర్కొన్నారు.
రీ ఆర్గనైజేషన్ కమిటీ (ఆర్వోసీ) పేరుతో 16 హత్యలు, 13 కిడ్నాప్‌లే గాక పోలీసు రికార్డులకు ఎక్కని మరో 50 కేసుల దాకా ఉన్నాయి! అయినా బాబు ఆయనకే అసెంబ్లీ టికెటిచ్చి ప్రోత్సహించారు. వైఎస్ తండ్రి రాజారెడ్డి హత్య కేసులో నిందితులైన వారికి హైదరాబాద్‌లో బాబు ఆశ్రయం కల్పించినట్టు కాంగ్రెస్ వర్గాలు ఇప్పటికీ చెబుతాయి. రాజారెడ్డి హత్యకు గురైన రెండు రోజుల్లోనే, నిందితుల్లో ఒకరైన పార్థసారథి రెడ్డి పూర్తి భద్రత మధ్య హైదరాబాద్‌లో ప్రత్యక్షమయ్యారు. ఇది బాబుకు తెలియకుండానే జరిగిందా? పైగా అదే వ్యక్తికి మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని కట్టబెట్టి, మరొకరికి పులివెందుల ఎమ్మెల్యే టికెటిచ్చారాయన. పరిటాల, మద్దెలచెర్వు కుటుంబాల మధ్య తరతరాలుగా ఉన్న పగలు, ప్రతీకారాలను కూడా రాజకీయాలకు ముడిపెట్టారు. అనంతపురం జిల్లాలో టీడీపీని గెలిపించే బాధ్యతను పరిటాలకు అప్పగించారు. ఆ క్రమంలో జిల్లాలో జరిగిన హత్యలు, నమోదైన మిస్సింగ్లను బాబు ఏనాడు పట్టించుకున్న పాపాన పోలేదు. రామసుబ్బారెడ్డిపై కేసులున్నా పట్టించుకోకుండా మంత్రి పదవి కట్టబెట్టిన ఘనత కూడా ఆయనదే! విజయవాడ తగాదాల్లో అక్కడి ఫ్యాక్షన్ నేతలను చేరదీసి కూడా బాబు ఎన్నో విమర్శలను ఎదుర్కొన్నారు.
వంగవీటి మోహనరంగా హత్యకు దారి తీసిన పరిస్థితులన్నీ బాబు పుణ్యమేనని, నాటి విజయవాడలో రావణ కాష్టంలా రగులుతున్న వర్గ తగాదాలకు ఆయనే కారకుడని అంతా చెబుతారు. ఇటీవల హైదరాబాద్ నడిబొడ్డున జరిగిన టీడీపీ నేత చలసాని వెంకటేశ్వరరావు (పండు) హత్యకు ఆ పార్టీకే చెందిన ఇద్దరు సీనియర్ నేతల మధ్య నెలకొన్న స్పర్థలే కారణమని తెలిసి, దానిపై తేలు కుట్టిన దొంగలా మౌనం వహించారు బాబు! పైగా తన వెన్నంటి తిరిగే పార్టీ నేతపై నింద పడకుండా ఉండేందుకు మృతుని కుటుంబీకులతో మాట్లాడి వారికి నచ్చజెప్పారు!
ఇలా చెబుతూ పోతే బాబు నేర చరిత చాంతాడంత...!!
తండ్రి హంతకులనూచట్టానికే వదిలేసిన వైఎస్
వైఎస్ సీఎం అయ్యాక కూడా తండ్రి రాజారెడ్డి హత్య కేసును చట్టానికే వదిలేశారు. నిందితులెవరో తెలిసినా, వారి జోలికి వెళ్లొద్దని తన వారందరినీ ఆదేశించారు. నిజానికి ఆ కేసు నిందితులు చంద్రబాబు సీఎంగా ఉన్నప్పటి కంటే వైఎస్ హయాంలోనే స్వేచ్చగా, నిర్భయంగా తిరిగారు. ఫ్యాక్షన్‌ను ప్రోత్సహించొద్దన్న ఉద్దేశంతో పెనుగొండ ఉప ఎన్నికల్లో సూరి భార్య గంగుల భానుమతికి వైఎస్ టికెట్ నిరాకరించారు. బాబు మాత్రం పరిటాల భార్య సునీతకు టికెటిచ్చి తన నైజం చాటుకున్నారు. కర్నూలు జిల్లా పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి, ఆయన ప్రత్యర్థి అయిన మాజీ ఎమ్మెల్యే బెజ్జం పార్థసారథిరెడ్డిల మధ్య వైఎస్ రాజీ కుదిరిస్తే, దాన్ని వ్యతిరేకించడం ద్వారా రాజకీయ పరిశీలకులతో పాటు సొంత పార్టీ నేతలను కూడా ఆశ్చర్యపరిచిన చరిత్ర బాబుది!
ఇదీ వాంగ్మూలం గుట్టు..ఎల్లో గోల లోగుట్టు
చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే అనంతపురం జిల్లా ధర్మవరంలో సూట్‌కేసు బాంబు కేసొకటి బయటకు వచ్చింది. అప్పుడు అసెంబ్లీసమావేశాలు జరుగుతుండటంతో, విపక్ష నేతగా ఉన్న వైఎస్‌ను ఇరకాటంలో పెట్టేందుకు ఆయన కుమారుడు జగన్‌పై ఏ ఆధారాలూ లేకుండా కేసు పెట్టారు. అంతటితో ఆగకుండా, తాము అధికార పక్షమని కూడా మరిచి, సంప్రదాయాలకు విరుద్ధంగా, దీనిపై అసెంబ్లీలో వాయిదా తీర్మానం ప్రవేశపెట్టి మరీ అభాసుపాలైన ఘనత ఒక్క చంద్రబాబుకే దక్కింది. పైగా జగన్‌పై కేసు పెట్టలేదని అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగానే నాటి అనంతపురం ఎస్పీ విలేకరుల సమావేశం నిర్వహించి మరీ స్పష్టం చేశారు.
పులివెందులకు చెందిన దంతలూరి కృష్ణను అరెస్టు చేసి అతని నుంచి తీసుకున్నట్టుగా చెబుతున్న వాంగ్మూలాన్ని పరిశీలిస్తే, అది ఒక మండల స్థాయి విలేకరి రాసినట్టుగా కన్పిస్తోంది. తాను, జగన్ పలుమార్లు చర్లపల్లి జైలుకు వెళ్లి సూరిని కలిశామని కృష్ణ చెప్పారన్నది ఆ వాంగ్మూలం సారాంశం.
అదే నిజమైతే జైలు రికార్డులను పరిశీలించి జగన్‌పై కేసు పెట్టి ఉండొచ్చుగా! అత్యంత శక్తి మంతమైన సీఎంగా ఉన్న చంద్రబాబు అలా చేయకుండా ఎందుకు ఊరుకున్నారు? ఎందుకంటే, ఆ వాంగ్మూలం పోలీసులు సృష్టించింది గనుక.. అది కోర్టు ముందు నిలువదు కనుక. ఆ కారణంగానే దాన్ని బుట్టదాఖలు చేశారు బాబు. పరిటాల రవి హత్య సమయంలో టీడీపీకి ఆ తప్పుడు వాంగ్మూలం గుర్తొచ్చి, సీబీఐకి ఫిర్యాదు చేసింది. దాంతో పరిటాల కేసును విచారించిన సీబీఐ ఎస్పీ నందకుమార్ 2005 ఏప్రిల్ 4న కృష్ణకు నోటీసు జారీ చేశారు. ఆ నోటీసును పురస్కరించుకునే, 2001లో పోలీసులు నమోదు చేశామంటున్న వాంగ్మూలంలోని వివరాలను ఆయన నోట్ చేసుకున్నారు. ఇప్పుడు ఎల్లో మీడియా ఎడాపెడా అబద్ధాలను అచ్చొత్తి పాఠకులపైకి వదిలిందీ, ఎల్లో బాబు నానా రాద్ధాంతమూ చేస్తున్నదీ... ఆ ఎస్పీ నోట్‌ను పట్టుకునే! వారి అనైతిక బంధానికి, అడ్డగోలుతనానికి ఇంతకంటే రుజువు ఇంకేం కావాలి?!