Post date: Mar 12, 2012 6:25:59 AM
రాజకీయ వ్యవస్థలో మార్పు తీసుకురాగలమన్న నమ్మకాన్ని తమ పార్టీ కలిగించిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైఎస్ జగన్ అన్నారు. విలువలు, విశ్వసనీయత అన్న పదాలే తమ పార్టీకి ఊపిరి, కళ్లు అని అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి ఏడాది పూర్తయిన సందర్భంగా పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ జెండాను ఆయన ఆవిష్కరించారు. అనంతరం కార్యకర్తలు, అభిమానులను ఉద్దేశించి జగన్ ప్రసంగించారు.
ఈ ఏడాది కాలంలో తమ పార్టీ అన్ని వర్గాలకు చేరువయిందని సంతృప్తి వ్యక్తం చేశారు. మార్పు తీసుకురాగలమన్న నమ్మకాన్ని కలిగించామన్నారు. ప్రజలు నమ్మకాన్ని కాపాడుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఎన్నాళ్లు బతికామన్నది కాదు, బతికినంతకాలం ఎలా బతికామన్నది ముఖ్యమని అన్నారు. ఫలానా వాడు తమ నాయకుడని ప్రతి కార్యకర్త సగర్వంగా తలెత్తుకుని చెప్పుకునేలా నేతలుండాలన్నారు. పదవులు పోతాయని తెలిసినా కూడా 17 మంది ఎమ్మెల్యేలు తన వెంట వచ్చారని గుర్తు చేశారు. ఇలాంటి వారు తమ పార్టీలో ఉన్నందుకు గర్వంగా ఉందన్నారు. పేదలు, రైతుల కోసం ఉప ఎన్నికలకు వెళ్తున్నామని చెప్పారు.
నల్లకాల్వలో ఇచ్చిన మాటపై నిలబడ్డానని, ఎవరెన్ని చెప్పినా ప్రజలకోసమే పాటు పడ్డానని పేర్కొన్నారు. అభిమానులు, కార్యకర్తల అండతోనే ఎన్ని కష్టాలెదురైనా చిరునవ్వుతో నిలబడ్డానని చెప్పారు. తన వెంట నడిచిన వారందరికీ జగన్ ధన్యవాదాలు తెలిపారు. జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో నేతలు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.