Post date: Aug 18, 2011 12:35:39 PM
వైయస్సార్ పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన ఆస్తులపై సిబిఐ అధికారులు మూకుమ్మడి దాడులు నిర్వహించిన నేపథ్యంలో జగన్ పార్టీ కార్యకర్తలు, ఆయన అభిమానులు భారీగా జూబ్లీహిల్సులోని జగన్ ఇంటికి భారీగా తరలి వచ్చారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి, సిబిఐ అధికారులకు వ్యతిరేకంగా, జగన్కు అనుకూలంగా నినాదాలు చేశారు. జగన్పై కాంగ్రెసు పార్టీ కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని హెచ్చరించారు. జగన్ ఆస్తులపై దాడులు ఆపకుంటే ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, సిఎం కిరణ్ ఇళ్లపై దాడులు చేయడానికి వెనుకాడబోమని హెచ్చరించారు.
జగన్కు రాష్ట్ర ప్రజల నుండి వస్తున్న అపూర్వ ఆదరణ చూసి ఓర్వలేకనే కక్ష సాధింపు చర్యలకు పూనుకుంటున్నారని ఆరోపించారు. రాజకీయాలను రాజకీయంగానే ఎదుర్కోవాలన్నారు. టిడిపి, కాంగ్రెసుతో సహా మిగిలిన ప్రతిపక్షాలు కుమ్మక్కై ఒక్కడిపై కుట్ర పన్నుతున్నాయని ఆరోపించారు. జగన్పై ఇలాంటి చర్యలకు పాల్పడితే భవిష్యత్తులో ఏ ఇతర పార్టీకి డిపాజిట్ దక్కదన్నారు. తాము ఎవరికీ నిరసన తెలపడం లేదని జగన్పై అభిమానం మాత్రమే చూపిస్తున్నామని అన్నారు. నిజాయితీ కలిగిన వ్యక్తి కాబట్టే గుండె ధైర్యం కలిగిన వ్యక్తి కాబట్టే తన కంపెనీలపై దాడులు జరుగుతున్నప్పటికీ నిబ్బరంతో ఓదార్పు యాత్ర చేస్తున్నారని అన్నారు.