Post date: Aug 17, 2011 9:25:28 AM
ఇన్నాళ్లూ మిన్నకుండి ఇప్పుడు కేబినెట్ ముందు నివేదికలు ఉంచిన ప్రభుత్వం
వైఎస్ మృతిపై సీరియస్‌గా ఉన్నామన్న సంకేతాలు పంపేందుకు యత్నాలు
వైఎస్సార్ కాంగ్రెస్ ప్లీనరీలో.. మహానేత మృతిపై అనుమానాలు వ్యక్తం చేసిన నేతలు
వైఎస్ రెండో వర్ధంతి సమీపిస్తున్న నేపథ్యంలో మంత్రివర్గంలో చర్చ
అధికారులపై చర్యలు తీసుకునేందుకు సీఎస్ అధ్యక్షతన కమిటీ
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హెలికాప్టర్ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయి దాదాపు రెండేళ్లు కావొస్తుంది.. నివేదికలు ఏం చెప్పినా.. అది ప్రమాదం కాదు, కుట్ర అన్న అనుమానాలు జనంలో బలంగా వినిపించాయి. ఇటీవల జరిగిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీలోనూ నేతలు వైఎస్ మరణంపై అనుమానాలు వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి నిజానిజాలు నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు. అన్నింటికీ మించి మహానేత వర్ధంతి (సెప్టెంబరు 2) కూడా సమీపిస్తోంది. ఈ నేపథ్యంలో వైఎస్ మృతిపై తాము సీరియస్‌గానే ఉన్నామన్న సంకేతాలు ప్రజల్లోకి పంపేందుకు రాష్ట్ర సర్కారు హడావుడి చర్యలకు తెరదీసింది. మహానేత మృతి విషయంలో సర్కారు నిర్లక్ష్య ధోరణిని ప్రదర్శిస్తోందన్న అపప్రధను తొలగించుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇందులో భాగంగానే వైఎస్ హెలికాప్టర్ ప్రమాదంపై సీబీఐతోపాటు నిపుణుల కమిటీలు ఎం.ఆర్.రెడ్డి, ఆర్కే త్యాగి ఇచ్చిన నివేదికలన్నింటినీ మంగళవారం జరిగిన మంత్రివర్గం ముందుంచింది. ఆ నివేదికలను మరింత లోతుగా పరిశీలించి నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ నివేదికలపై ఇన్ని రోజులు చర్యలు తీసుకోకపోవడంపై కొందరు మంత్రులు సమావేశంలో సీరియస్‌గా స్పందించినట్టు తెలిసింది. కొందరు అధికారులు నిర్లక్ష్యం ఉన్నట్లు నివేదికల్లో పేర్కొన్నప్పటికీ వారిపై ఇప్పటిదాకా ఎలాంటి చర్యలు తీసుకోకపోగా కొందరిని సొంత శాఖలకు పంపిస్తూ ఎలా రిలీవ్ చేశారని ప్రశ్నించినట్లు సమాచారం. వారిపై 30 రోజుల్లోగా చర్యలు తీసుకోవాలని సూచించారు. అప్పట్లో ఏవియేషన్ కార్పొరేషన్ ఎండీగా ఉన్న రైల్వే శాఖకు చెందిన బ్రహ్మానందరెడ్డిపై చర్యలు తీసుకోకుండా ఎందుకు మాతృశాఖకు రిలీవ్ చేశారని పలువురు మంత్రులు ప్రశ్నించారు. కొత్త హెలికాప్టర్ ఉండగా దాన్ని సిద్ధం చేయకుండా పాత హెలికాప్టర్‌నే ఎందుకు ఉపయోగించారు? పాత హెలికాప్టర్లో వైఎస్ వెళ్లిన గంటకే కొత్త హెలికాప్టర్ ఎలా సిద్ధమైంది? సీఎం వెళ్లిన హెలికాప్టర్లో అన్ని పరికరాలు పనిచేస్తున్నాయా లేదా అనే విషయాన్ని ముందుగానే ఎందుకు పరీక్షించలేదు..? వీటన్నింటిపై పలు అనుమాలు ఉన్నాయని, వీటికి బాధ్యులెవరో గుర్తించాలని సమావేశంలో ప్రశ్నించారు.
తడబడిన మంత్రి..
వైఎస్ ప్రమాదంపై విచారణ నివేదికలను మంత్రివర్గంలో ఉంచారని మంత్రి డీకే అరుణ మంగళవారం రాత్రి సచివాలయంలో విలేకరులకు చెప్పారు. వైఎస్ మరణంపై అందిన మూడు నివేదికలపై మాట్లాడుతున్న సందర్భంగా ఆమె తడబడ్డారు. ‘‘హెలికాప్టర్ ఘటనపై విచారణ జరిపిన మూడు నివేదికలు ప్రమాదం కాదు..’’ అని తొలుత వ్యాఖ్యానించి ఆ వెంటనే సర్దుకుని ‘‘..కాదు హెలికాప్టర్ ఘటన ప్రమాదమేనని, ఎవరూ చేయించింది కాదని నివేదికలు తేల్చాయి’’ అని అన్నారు. ఈ ప్రమాదం అంశాన్ని విలేకరుల సమావేశం చివర్లో అరకొర సమాచారంతో క్లుప్తంగా వివరించారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని నివేదికల్లో పేర్కొన్నందున వారిపై ముప్పై రోజుల్లోగా చర్యలు తీసుకోవాలని మంత్రివర్గం నిర్ణయించిందన్నారు. బ్రహ్మానందరెడ్డి, లక్ష్మణరావు అనే అధికారులతోపాటు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలిపారు.