Post date: Mar 22, 2012 8:45:44 AM
కాంగ్రెస్, టీడీపీలపై వైఎస్సార్ కాంగ్రెస్ నేతల మండిపాటు
:
ప్రజాస్వామ్యంలో అన్నింటికన్నా అతి ముఖ్యమైన ప్రజాకోర్టులో కాంగ్రెస్, టీడీపీలకు చుక్కెదురైందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యనిర్వాహక మండలి సభ్యుడు గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ, అడ్డదారుల్లో విజయం సాధించాలనుకుంటున్న ఆ రెండు పార్టీలకు ఉప ఎన్నికల ఫలితాలు చెంపపెట్టులాంటివని పేర్కొన్నారు. కోవూరులో నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఘన విజయం ద్వారా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి నూతనోత్సాహం లభించిందని చెప్పారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో సహచర నేతలు బి.గురునాథరెడ్డి, ఎ.అమరనాథరెడ్డి, మూలింటి మారెప్ప, బాజిరెడ్డి గోవర్ధన్, రవీంద్ర నాయక్, జ్యోతుల నెహ్రూ, నల్లా సూర్యప్రకాశ్రావులతో కలిసి బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఉప ఎన్నికల ఫలితాల సరళితో రాష్ట్రంలో కాంగ్రెస్-టీడీపీల మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని, భవిష్యత్తు వైఎస్సార్ కాంగ్రెస్‌దేనని శ్రీకాంత్‌రెడ్డి చెప్పారు. ఉనికి చాటుకోవడానికి అధికార, ప్రతిపక్షాలు కుమ్మక్కై చేస్తున్న నీచ రాజకీయాలను చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారని మండిపడ్డారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలు చర్చకు రాకుండా ఆ రెండు పార్టీలు మ్యాచ్‌ఫిక్సింగ్ చేసుకున్నాయని దుయ్యబట్టారు. రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నా, గ్రామాల్లో తాగునీరులేక ప్రజలు అల్లాడుతున్నా ఈ పార్టీ నేతలకు పట్టడం లేదని విమర్శించారు. కోవూరులో మంత్రులు మకాం వేసి విచ్చలవిడిగా డబ్బు వెదజల్లి, మద్యాన్ని ఏరులై పారించారని చెప్పారు. మరోపక్క వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తూ.. జైల్లో వేస్తామని బెదిరింపులకు గురిచేసినా ప్రజలు తగిన గుణపాఠ ం చెప్పారన్నారు. రానున్న ఉప ఎన్నికల్లో అన్ని స్థానాల్లో భారీ మెజారిటీతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.
వాటికి కూడా ఎన్నికలు జరిపితే సర్కారు పడిపోయేది..: అమరనాథరెడ్డి
రాష్ట్రంలో మూడో రాజకీయపార్టీ ఉండకూడదన్న దురుద్దేశంతో కుట్రలు, కుతంత్రాలు చేసిన కాంగ్రెస్, టీడీపీలకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని వైఎస్సార్ కాంగ్రెస్ కార్యనిర్వాహక మండలి సభ్యుడు అమరనాథరెడ్డి దుయ్యబట్టారు. కోవూరులో ఆ రెండు పార్టీలు కోట్ల రూపాయలు వెదజల్లినా... ప్రజలు తగిన బుద్ధి చెప్పారన్నారు. ప్రస్తుత ఎన్నికలతోపాటే తమ 17 స్థానాల్లో కూడా ఎన్నికలు నిర్వహించి ఉంటే ప్రభుత్వం పడిపోయేదన్నారు.
జగన్ చరిష్మా వల్లే..: గురునాథరెడ్డి
కోవూరులో వైఎస్సార్ కాంగ్రెస్ ఘన విజయం అధినేత జగన్ చరిష్మా వల్లే సాధ్యమైందని పార్టీ కేంద్ర కార్యనిర్వాహక మండలి సభ్యుడు బి.గురునాథరెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఏ సమస్య వచ్చినా మొదటగా స్పందించి ప్రజలకు నేనున్నానంటూ భరోసా ఇస్తున్నందువల్లే జగన్‌కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు.
ఎల్లో మీడియా బుద్ధి తెచ్చుకోవాలి: బాజిరెడ్డి
కోవూరులో వైఎస్సార్ కాంగ్రెస్ సాధించిన ఫలితాన్ని దృష్టిలోపెట్టుకొనైనా ఎల్లో మీడియా సాగిస్తున్న విషప్రచారాన్ని మానుకుంటే వారికే మంచిదని కేంద్ర పాలక మండలి సభ్యుడు బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయతకు ప్రజలు పట్టం కట్టారన్నారు