Post date: Apr 21, 2011 5:53:21 AM
కొండా మురళికి భద్రత కుదింపుపై మాజీ మంత్రి, ఆయన సతీమణి కొండా సురేఖ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన భర్తకు ఎలాంటి ప్రాణహాని జరిగినా దానికి రాష్ట్ర ప్రభుత్వం, సోనియగాంధీనే బాధ్యత వహించాలన్నారు. బుధవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆమె విలేకర్లతో మాట్లాడుతూ తమను ఎన్ని ఇబ్బందులు పెట్టినా వైఎస్ కుటుంబాన్ని వీడేది లేదని స్పష్టం చేశారు.
తమపై వేటు వేయటానికి కాంగ్రెస్ పార్టీకి అర్హత లేదని సురేఖ అన్నారు. చిరంజీవిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నప్పుడే కాంగ్రెస్ తనకు తానే వేటు వేసుకోవాలన్నారు. 177 జీవో ఉపసంహరించుకునే వరకూ తెలంగాణ మంత్రులు కేబినెట్ సమావేశాలకు హాజరు కావద్దని కోరారు.
ఉప ఎన్నికల తర్వాత తెలంగాణపై వైఎస్ జగన్ తన వైఖరిని వెల్లడిస్తారని సురేఖ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఏదో ఒకరోజు పడిపోక తప్పదని ఆమె జోస్యం చెప్పారు. వైఎస్ ఆశయాలను తూట్లు పొడిస్తే ప్రజలే ఈ ప్రభుత్వాన్ని కూల్చుతారని సురేఖ అన్నారు. బీజేపీకి, జగన్కు మధ్య సంబంధం ముడి పెట్టడం బాధాకరమన్నారు.