Post date: Jul 09, 2011 5:54:58 AM
‘దేవుడి ఆశీస్సులు, మీ ప్రేమ, ఆదరణ ఉంటాయని నమ్ముతూ.. నా బిడ్డను మీ చేతుల్లో పెడుతున్నా.. ఆశీర్వదించండి..’ అని మహానేత వైఎస్ సతీమణి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ పార్టీ శ్రేణులను కోరారు. వై.ఎస్.జగన్మోహన్రెడ్డి తండ్రి ఆశయాలకు ప్రతిరూపమని.. వైఎస్‌లో ఉన్న చిత్తశుద్ధి, ధైర్యం, దృఢ విశ్వాసం ఆయనలో ఉన్నాయని.. దివంగత నేత ఆశయసాధనలో జగన్‌ను ఆశీర్వదించాలని అన్నారు. ైవె .ఎస్.రాజశేఖరరెడ్డి సమాధి చెంతన శుక్రవారం ఇడుపులపాయలో ప్రారంభమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రస్థానం(ప్లీనరీ) సదస్సులో తొలిరోజు ఆమె ప్రారంభోపన్యాసం చేశారు.
19 నిమిషాల పాటు ఉద్వేగభరితంగా సాగిన ఈ ప్రసంగంలో నాటి సంఘటనలు గుర్తు చేసుకుంటూ.. ఆమె పలుమార్లు కంటతడిపెట్టుకున్నారు. విజయమ్మ మాట్లాడుతున్నప్పుడు పలువురు ప్రతినిధులు కన్నీటిపర్యంతమయ్యారు. ఆమె ప్రసంగం ప్రతినిధులను కదిలించివేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చిందో ఉదాహరణలతో తెలియజేస్తూ.. గత రెండేళ్ల ప్రస్థానాన్ని కళ్లకు కట్టినట్టు విజయమ్మ వివరించారు. వైఎస్సార్ స్వర్ణయుగాన్ని మళ్లీ తేవాలని ఆకాంక్షించారు.
ప్రసంగ సారాంశం ఆమె మాటల్లోనే..
పార్టీ ప్రతినిధులు, ప్రజాప్రతినిధులందరికీ స్వాగతం పలుకుతున్నా. ఈ పార్టీ ఎందుకు ఆవిర్భవించాల్సి వచ్చిందో ప్రజలకు మీరు తెలియజెప్పాల్సిన అవసరం ఉందని నేను నమ్ముతున్నా. ఈ పార్టీ అన్నింటికన్నా భిన్నమైన పార్టీ. మాటలు కాదు చేతలు ముఖ్యమని చూపిన మహానేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి చూపిన బాటలో.. ఆయన ఆశయాలకు వారసత్వంగా పుట్టిన పార్టీ. ఆయనకు ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ, సోనియాగాంధీ అంటే చాలా అభిమానం. అందుకే తన పథకాలన్నింటికీ ఇందిర, రాజీవ్ పేర్లు పెట్టి.. వాళ్ల పేర్లు జనంలో చిరస్థాయిగా గుర్తుండిపోయేలా చేశారు. 1978 నుంచి 2004 వరకు 25 ఏళ్ల పాటు ప్రజల పక్షాన ఆయన ఎన్నో పోరాటాలు చేశారు. ఇంట్లో వాళ్లతో మాట్లాడుతున్నప్పుడూ అనేక సందర్భాల్లో ఆయన తల చూపించి తనకు ఎన్ని దెబ్బలు తగిలాయో చూడమని చెప్పేవారు. రెండ్రోజులు హైదరాబాద్‌లో ఉంటే మిగిలిన ఐదు రోజులు ప్రజల మధ్య ఉండేవారు.
మంచి సీఎం ఎలా ఉండాలో చూపించారు..
2003లో 68 రోజుల పాటు పాదయాత్ర చేశారు. రాజమండ్రిలో 51 డిగ్రీల ఎండలు ఉన్నప్పుడూ పాదయాత్ర చేశారు. వారం రోజులపాటు అస్వస్థతకు గురయ్యారు. అయినా తిరిగి పాదయాత్ర కొనసాగించారు. ప్రజలకు ఎక్కడ ఏం కావాలి? ఎక్కడ పరిశ్రమ రావాలి? ఎక్కడ ప్రాజెక్టులు కావాలి? ఎవరికి ఏ అవసరం ఉంది? ఇలా అన్నీ తెలుసుకున్నారు. ప్రజలందరికీ ఏం చేయాలన్నదానిపై బ్లూప్రింట్ ఆయన మైండ్‌లో ఉండేది. తాను అధికారంలోకి రాగానే విద్యుత్తు బకాయిలు మాఫీ చేశారు. రైతులకు ఉచితంగా విద్యుత్తు అందించారు. రైతుల పక్షపాతిగా జలయజ్ఞం ప్రారంభించారు. ఆరోగ్యశ్రీ, 108, పావలావడ్డీ, ఇందిరమ్మ ఇళ్లు, నిరుపేద విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్.. ఇలా చెప్పుకొంటూ పోతే ఎన్నో కార్యక్రమాలు చేశారు. ఒక మంచి ముఖ్యమంత్రి అంటే ఎలా ఉండాలో చేసి చూపించారు.
2009 ఎన్నికల్లో అన్ని పార్టీలు జట్టు కట్టి పోటీచేస్తే.. ఒక్కడే మళ్లీ అధికారంలోకి తేగలిగాడు. పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని, 33 నుంచి 36 ఎంపీ సీట్లు వస్తాయని.. 180 నుంచి 200 వరకు అసెంబ్లీ సీట్లు వస్తాయని సోనియాగాంధీకి చెబితే ఆమె నమ్మలేదు. అనుకున్నట్టుగానే ఎంపీ సీట్లు వచ్చినా అసెంబ్లీ సీట్లు తగ్గాయి. ప్రజలు మనకు పాస్ మార్కులే ఇచ్చారని, ఇంకా కష్టపడి పనిచేయాల్సి ఉందని అప్పుడే ఆయన కొన్ని కార్యక్రమాల్లో పార్టీ శ్రేణులకు, ప్రభుత్వంలోని సహచరులకు చెప్పారు. ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలని ఉద్బోధించారు.
మధ్యాహ్నానికి వస్తానని చెప్పారు..
2009లో అధికారంలోకి వచ్చాక మూడు నెలల్లో ఒక్క రోజు కూడా వృథా కానివ్వలేదు. కార్యక్రమాల సక్రమ అమలుకు రచ్చబండ నిర్వహించాలని తలంచారు. సత్వరం జలయజ్ఞం పూర్తిచేయాలని భావించారు. ప్రాణ హిత-చేవెళ్ల మినహా మిగిలిన అన్ని ప్రాజెక్టులను మూడేళ్లలో పూర్తిచేస్తామని విశ్వాసం వ్యక్తం చేసేవారు. ధైర్యంగా ఉండేవారు. కానీ దేవుడి ప్రణాళిక ఏమిటో తెలియదు. సెప్టెంబరు 2న కూడా జగన్ ఏదో ప్రాజెక్టుల పూర్తి గురించి మాట్లాడుతుండగా.. ఆయన పూర్తిగా వివరించి చెప్పారు. నిన్నటి వరకు అసెంబ్లీ నడిచింది కదా.. వర్షం కూడా పడుతోంది.. మళ్లీ అప్పుడే వెళ్లడం దేనికంటే.. రచ్చబండకు వెళ్లాల్సిందే అన్నారు. పైలట్ తీసుకుని వెళ్తేనే వెళ్తాను... లేదంటే.. మధ్యాహ్నానికి ఇంటికి వస్తానని చెప్పారు. ఏమైందో ఏమో.. తిరిగి రాలేదు. ఆయనతో కలిసి జీవించే అదృష్టం నాకు లేకపోయింది. ఆయన కోసం 700 మంది ప్రాణాలిచ్చారు. అంతమంది హృదయాల్లో ముద్ర వేసుకున్నారు.
వైఎస్‌పై సోనియా మాటలు బాధ కలిగించాయి..
ఇంటి పెద్దను కోల్పోయిన బాధను అనుభవించిన వాళ్లం. అందుకే జగన్ నల్లమలకు వెళ్లినప్పుడు అక్కడ సభలో వాగ్దానం చేశాడు. చనిపోయిన కార్యకర్తలు, అభిమానుల కుటుంబాలను పరామర్శిస్తానని చెప్పాడు. అప్పటికి ఏ రాజకీయాలు లేవు. అన్నమాట ప్రకారం రెండు జిల్లాల్లో అభిమానుల కుటుంబాలను ఓదార్చాడు. తండ్రిలాగే కొడుకునూ ఆదరించారు. అర్ధరాత్రులు, తెల్లవార్లూ అక్కున చేర్చుకున్నారు. రెండు జిల్లాలు అయ్యాక ఇబ్బందులు మొదలయ్యాయి. అప్పుడే నేను సోనియాగాంధీకి లేఖ రాశాను. ఓదార్పు పూర్తిచేయాలని ఉందని, మీరు అనుమతి ఇస్తే అన్ని విషయాలు మీ దగ్గరికి వచ్చి వివరిస్తామని కోరాను. నెల రోజుల తర్వాత ఆమె అపాయింట్మెంట్ ఇచ్చారు.
నేను, జగన్, షర్మిల కలిసి వెళ్లి ఆమెకు వివరించాం. దానికి బదులుగా ఆమె ఇంతలా ఎందుకు? జిల్లాలో ఒక చోటికి పిలిచి సహాయం చేస్తే సరిపోతుందని, జిల్లాకు ఒక్క విగ్రహం సరిపోతుందని చెప్పారు. ఇంకోమాట కూడా అన్నారు. మేం ముఖ్యమంత్రిని చేయడం వల్లే ఆయన ఈ కార్యక్రమాలు చేయగలిగారని చెప్పారు. మా మనసుకు చాలా బాధ కలిగింది. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచీ ఎందరో సీఎంలు వచ్చారు. కానీ ఆయనలా ప్రజల కోసం ప్రణాళికలు ఎవరూ చేయలేదు. వైఎస్ చనిపోయాక మీరే వచ్చి పరామర్శించారు గానీ మమ్మల్ని పిలిపించుకోలేదు కదా.. అలాగే జగన్ కూడా వారి వద్దకే వెళ్లి పరామర్శిస్తేనే బాగుంటుంది అని కూడా చెప్పాం. కానీ ఆమె వినిపించుకోలేదు. చేసేది లేక కన్నీటితో తిరిగొచ్చాం.
ఇచ్చిన మాట తప్పలేదు...
ఢిల్లీ నుంచి వచ్చాక.. ఏం చేద్దామనుకుంటున్నావని జగన్‌ను అడిగాను. అమ్మా.. నేనైతే మాట ఇచ్చాను. ఏడు వందల కుటుంబాలను పరామర్శిస్తానని చెప్పాను. వైఎస్సార్ కొడుకుగా, నేను మాట నిలబెట్టుకోలేదన్న మాట అనిపించుకోవడానికి సిద్ధంగా లేను. నాయన పేరు నిలబెట్టడానికే నేను నిర్ణయించుకున్నా అని చెప్పాడు. ఆ నిర్ణయం మంచిదే అని పించింది. రెండోసారి యాత్రకు బయలుదేరాలనుకున్నాడు. మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులను కట్టడి చేశారు. ‘సాక్షి’ పైన దాడులు జరిపించారు. మంత్రులతో లేఖలు రాయించి కోర్టుల్లో కేసులు నడిపిస్తున్నారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా పార్టీలోనే కొనసాగాలనుకున్నాం. కానీ మా మరిదిని పిలిపించి మంత్రి పదవి ఇస్తామని ఆశపెట్టారు. ఆయనకు మంత్రి పదవి ఇస్తే బాధలేదు. కానీ జగన్‌ను బలహీనుడిగా చేయాలని తలచారు.
ఇది మాకు బాధ కలిగించింది. అందుకే పార్టీ నుంచి బయటకు వచ్చాం. ఆ రకంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పెట్టాల్సి వచ్చింది. పార్టీ పెట్టి మళ్లీ పోటీ చేయాల్సి వచ్చింది. వైఎస్‌కు 4.20 లక్షల మెజారిటీని కట్టబెడితే.. జగన్‌కు 5.40 లక్షల మెజారిటీ కట్టబెట్టి ఆదరణ చూపారు. వైఎస్ ఎమ్మెల్యేగా సాధించిన మెజారిటీ కంటే అధికంగా నాకు మెజారిటీ కట్టబెట్టి మీ ప్రేమ చూపారు. ఎప్పటికీ రుణపడి ఉంటాం.
తండ్రి ఆశయాలకు ప్రతిరూపం జగన్..
ఈ రోజు ఆయన జయంతి. జగన్ మీ ముందున్నాడు. తండ్రి ఆశయాలకు ప్రతిరూపం. తండ్రిలో ఉన్న కమిట్మెంట్, విల్‌పవర్, ధైర్యం.. ప్రతీది జగన్‌లో ఉన్నాయి. రాజకీయంలో ఉండాలంటే నిబ్బరం, ధైర్యం ఉండాలని వైఎస్ చెప్పేవారు. ఆ ధైర్యం జగన్‌లో ఉంది. ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ఎన్ని కేసులు పెట్టినా ప్రజల కోసం స్పందించే గుణం, పోరాడే తత్వం జగన్‌లో ఉంది. నా బిడ్డను మీరు ఆశీర్వదించండని కోరుతున్నా. దేవుడి దయ, ఆశీస్సులు.. వైఎస్ ఆశీస్సులు, మీ అందరి ప్రేమ, ఆదరణ ఉన్నాయని నమ్ముతున్నా. నా బిడ్డను మీకు అప్పగిస్తున్నా. అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులు జగన్ పూర్తిచేస్తాడని నమ్ముతున్నా. జగన్, వాళ్ల నాన్న స్నేహితుల్లా మాట్లాడుకునేవారు.
ప్రాణహిత, పోలవరం వంటి ప్రాజెక్టుల గురించి విశ్లేషించుకునేవారు. ప్రతిదాంట్లో కొడుకును అలా తీర్చిదిద్దాడు. ఓదార్పు యాత్రలో, ఇప్పటి వరకు చేసిన దీక్షల్లో నా కొడుకు కష్టపడుతున్నప్పుడు.. దేవా.. నా కొడుకును ఎందుకు ఇబ్బంది పెడుతున్నావని బాధపడేదాన్ని. కానీ నాయకుడిగా తీర్చిదిద్దేందుకే ఇలా కష్టపెడుతున్నాడేమోనని నాకు నేను సమర్థించుకునేదాన్ని. నా బిడ్డను మీరంతా ఆశీర్వదించాలి. ఇక్కడికి వచ్చిన వారంతా వైఎస్‌లా స్పందించాలి. వైఎస్‌లా పోరాడాలి. ప్రజల వెంట నడవాలి. పార్టీని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లాలి. వైఎస్ సువర్ణయుగం మళ్లీ తెచ్చేందుకు మనమంతా కృషిచేద్దామని కోరుతున్నా.