Post date: Mar 07, 2012 6:34:1 AM
బురిడీ మాటల్ని ప్రజలు నమ్మరు: జూపూడి
యూపీలో మూడేళ్లు తిష్టవేస్తే ముష్టి ముప్పై సీట్లా?
వారివల్లే గెలిచామన్న రాష్ట్ర నేతలు ఇప్పుడేం చెప్తారు?
దుర్మార్గ ఆలోచనలు, అహంభావంతోనే జగన్‌ను బయటకు గెంటేశారు
ఇప్పుడు ఆయన్ను అణచేయాలని చూస్తున్నారు
కుట్రలకు స్వస్తి పలకకుంటే రాష్ట్రంలోనేకాదు.. దేశంలోనే కాంగ్రెస్ కనుమరుగవుతుంది
మేకప్ వేసుకొని బురిడీ కొట్టించి, గారడీ చేసే నేతల మాటలను ప్రజలు ఎప్పటికీ నమ్మబోరని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకరరావు వ్యాఖ్యానించారు. ఈ విషయం ఐదు రాష్ట్రాల ఎన్నికల ద్వా రా రుజువైందన్నారు. అనునిత్యం ప్రజల మధ్య ఉండి వారి సాధకబాధకాలు అర్థం చేసుకునేవారికే ప్రజలు పట్టం కడతారన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో దళిత విభాగం కన్వీనర్ నల్లా సూర్యప్రకాష్‌రావుతో కలిసి ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడారు. యూపీ ఎన్నికలను రాహుల్ , ప్రియాంక, సోనియాగాంధీలు ప్రతిష్టాత్మకంగా తీసుకొని మూడేళ్లు తిష్టవేస్తే ముష్టి ముప్పై సీట్లు వచ్చాయని ఎద్దేవా చేశారు. ప్రజాబలం లేని కొందరు కోటరీ నేతలు చెప్పే చాడీలను న మ్మడంవల్లే కాంగ్రెస్‌కు ఈ పరిస్థితి దాపురించిందన్నారు. యూపీ ఎన్నికలు రాష్ట్రంపై తప్పక ప్రభావం చూపిస్తాయన్నారు. ఇప్పటికైనా చాడీలు చెప్పేవారి మాటలను నమ్మడం పక్కనపెడితే పార్టీ బతికి బట్టకట్టగలుగుతుందన్నారు.
వారి చరిష్మా ఎక్కడుంది?
కుటుంబం మొత్తంతో సోనియా ప్రచారం చేసినప్పటికీ.. యూపీలో కాంగ్రెస్ 30 సీట్లకు మించి ఎందుకు గెలవలేకపోయిందని, వారి చరిష్మా ఎక్కడుందని జూపూడి ప్రశ్నించారు. రాష్ట్రంలో తామంతా సోనియా, రాహుల్‌గాంధీల వల్లే గెలిచామని జబ్బలు చరుచుకునే నేతలు ఇప్పుడేం సమాధానమిస్తారని నిలదీశారు. రాష్ట్రంలో వైఎస్ వల్ల కాంగ్రెస్ అధికారంలోకి రాలేదని నోరుపారేసుకున్న నేతలు యూపీలో ఎందుకు గెలవలేకపోయారని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధినాయకత్వం దుర్మార్గమైన ఆలోచనలు, అహంభావంతో రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తెచ్చిన కుటుంబాన్ని వేధింపులకు గురిచేసి బయటకు గెంటేసిందని దుయ్యబట్టారు. వైఎస్ రెక్కల కష్టంతో వచ్చిన పదవులను అనుభవిస్తూ విశ్వాసం లేకుండా అదే కుటుంబాన్ని కేసులద్వారా వేధింపులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. అధికారం తెచ్చిపెట్టిన నేతను అప్రతిష్టపాలు చేస్తూ, ఆయన కుమారుడు జగన్‌ను జైలుకు పంపాలని కుట్ర చేస్తున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్-టీడీపీ కేసుల ద్వారా జగన్‌ను అణచివేయాలని చూస్తే ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. ఇకనైనా కుట్రలు, కుతంత్రాలకు కాంగ్రెస్ స్వస్తి చెప్పకపోతే రాబోయేకాలంలో రాష్ట్రంలోనేగాక దేశం నుంచి ఆ పార్టీ కనుమరుగవడం ఖాయమన్నారు.
రామోజీకి ప్రజలంటే అంత చులకనా?
‘‘జననేత జగన్‌ను అరెస్టు చేస్తారని వదంతులు రావడంతో వేలాదిమంది కార్యకర్తలు ఆయన నివాసం వద్దకు చేరుకున్నారు. అందులో నేను కూడా ఉన్నాను. కళ్లు నెత్తికెక్కిన రామోజీ తన పత్రికలో కుక్కలు, పందులతో పోల్చి కార్టూన్లు వేస్తారా? ప్రజలు, ప్రజాస్వామ్యమంటే రామోజీకి అంత చులకనా? ఇలాంటి తలతిక్క వేషాలేస్తే ఖబడ్దార్ ’’ అని జూపూడి హెచ్చరించారు. కుట్రలు, కుతంత్రాలతో జగన్‌ను అరెస్టు చేయాలని చూస్తే... ప్రజలు చూస్తూ ఊరుకోరని, తగినవిధంగా బుద్ధి చెబుతారన్నారు.