Post date: Jul 09, 2011 5:50:12 AM
ఎల్కేజీ నుంచి పీజీ వరకు చదివిస్తాం
ప్రతి కుటుంబంలో ఒక్కరన్నా పెద్ద చదువులు చదువుకోగలిగితే పేదరికం పోతుందని తెలిసినా ఈ ప్రభుత్వం ఏం చేస్తోంది? ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు ఇప్పటికే 3400 కోట్లు బకాయిలు ఉంటే, పథకాన్ని కొనసాగించడానికి మరో 3400 కోట్లు కావాల్సి ఉంటే మూడు వేల కోట్లే ఇచ్చి చేతులు దులుపుకొంది. పేద కుటుంబాలను కలిసినప్పుడు వారు చదువుకోవాలంటే ఈ 3400 కోట్లు కూడా సరిపోవని నాకు తెలిసింది. వారి పేదరికం పోవాలంటే ఎల్కేజీ నుంచి పీజీ వరకు చదివించాలి. ఆ బాధ్యత వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం స్వీకరిస్తుంది.
‘వైఎస్సార్ అమ్మ ఒడి’
ఆ పేద ఇళ్లకు వెళ్లినప్పుడు అమ్మలతో అక్కలతో మాట్లాడినప్పుడు, చిన్నచిన్న పిల్లలతో మాట్లాడినప్పుడు ఏడో తరగతి కూడా పూర్తికాకుండానే చదువు మానేశానని చెబుతున్నప్పుడు చాలా బాధనిపించేది. కాస్తోకూస్తో పనిచేస్తే తప్ప బతకలేని పరిస్థితి అని చెబితే బాధేసింది. వీరంతా గొప్ప చదువులు ఎప్పుడు చదువుతారన్న ఆలోచన నాలో రేగింది. ఆ ఆలోచనకు ప్రతిరూపమే ‘వైఎస్సార్ అమ్మ ఒడి’. తమ బిడ్డలను బడికి పంపే ప్రతి తల్లి బ్యాంకు ఖాతాలోకి ప్రోత్సాహకంగా డబ్బులు జమ చేస్తాం. ఇద్దరు పిల్లలను చదివించేందుకు వీలుగా జమ చేస్తాం. ఎల్కేజీ నుంచి పదో తరగతి వరకు రూ.500 చొప్పున, ఇంటర్లో అయితే రూ.700 చొప్పున, డిగ్రీ అయితే వెయ్యి రూపాయల చొప్పున జమ చేస్తాం. ఏ తల్లీ తమ బిడ్డలను చదువుకు పంపకుండా కూలికి పంపే పరిస్థితి రాకుండా ఉండేందుకే ఈ ప్రయత్నం. బడికి పంపించినందుకే ఈ ప్రోత్సాహకం. చదువులు మేమే ఉచితంగా చదివిస్తాం. రూ. 3,400 కోట్లయితే ఇప్పటివరకు ఉన్న పథకానికి సరిపోతుంది. ఇప్పటికంటే నాలుగైదింతల బడ్జెట్ పెరిగినా పరవాలేదు. ఇది మా కనీస బాధ్యత. దీన్ని ఒక ఛాలెంజ్‌గా తీసుకుంటాం.
ప్రతి స్కూలునూ ఇంగ్లిష్ మీడియం చేస్తాం
అలాగే ఊళ్లకు పోయినప్పుడు అక్కడ స్కూళ్లను చూశాను. అక్కడ ప్రైమరీ స్కూళ్ల దాకానే ఉన్నాయి. ఆ ప్రైమరీ స్కూళ్లను అప్పర్ ప్రైమరీ దాకా ప్రతి ఊళ్లోనూ అప్ గ్రేడ్ చేయాలి. ఆ ప్రతి స్కూలులో మౌలిక వసతులు కల్పించాలి. ఆ ప్రతి స్కూలును ఇంగ్లీష్ మీడియం చేయాల్సిన అవసరం చాలా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. మా భుజస్కంధాలపై వేసుకొని అది చేపడుతుంది.
అక్కాచెల్లెళ్లకు వడ్డీలేని రుణాలు..
పేదరికంలో మగ్గుతున్న అక్కాచెల్లెళ్లతో మాట్లాడుతున్నప్పుడు నాకు చాలా బాధనిపించింది. వారికోసం అమలుచేస్తున్న పావలా వడ్డీ పథకానికి వెయ్యి కోట్ల బకాయిలు చెల్లించాలి. దాన్ని నడిపించాలంటే మరో వెయ్యి కోట్లు కావాలి. కానీ ఈ ప్రభుత్వం రూ. 400 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకోవడంతో అక్కాచెల్లెళ్ల ముఖాల్లో తేడా కనిపిస్తోంది. ప్రభుత్వం వడ్డీ సొమ్ము ఇచ్చేవరకు బ్యాంకులు ఆ మహిళల వద్ద రూపాయి వడ్డీ వసూలు చేస్తున్నాయి. ఒక గ్రూపులో ఒక సభ్యురాలు మూడేళ్లలో చెల్లించేందుకు రూ. 30 వేలు తీసుకుంటే.. రూపాయి వడ్డీతో కలిపి ఏటా 45 శాతం సొమ్ము తిరిగి చెల్లించాల్సివస్తోంది. కానీ ఆ 45 శాతం వాళ్లు ఎలా కట్టగలుగుతారు. వైఎస్సార్ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రతి అక్కాచెల్లెళ్లకు వడ్డీ లేని రుణం ఇస్తాం. ప్రభుత్వం నిధులు ఇచ్చినప్పుడే బ్యాంకులు వడ్డీ రాయితీ ఇస్తాయని ఎదురుచూడాల్సిన పనిలేదు. ప్రభుత్వమే ఆ సొమ్మును ముందే కట్టేస్తుంది.
మూడు పూటలా భోజనం ఉండాలి..
నేను ఊళ్లకు వెళ్లినప్పుడు ప్రతి అవ్వా, తాతా పనులు విడిచిపెట్టుకుని నా దగ్గరికి పరుగెట్టుకుంటూ వచ్చారు. ఏమ్మా ఈ వయసులో కూడా పనిచేస్తున్నావా? అని అడిగితే.. బతకాలి కదా బిడ్డా.. మీ నాన్న రూ. 200 ఇస్తున్నాడు.. అయితే బతకడానికి ఆ డబ్బులు సరిపోవు కదా నాయనా అని బదులిస్తే బాధనిపించింది. అవ్వలూ, తాతలు, వితంతువులకు ఇప్పుడిస్తున్న పింఛను సరిపోదు. వారికి మూడు పూటలా భోజనం దొరికేలా కనీసం రూ. 700కు తక్కువ కాకుండా ఉండాలి. మూడు పూటలా భోజనం పెట్టే పరిస్థితి లేనప్పుడు ఈ ప్రభుత్వం ఉంటేనేం.. పోతేనేం? మా పార్టీ అధికారంలోకి వస్తే వీరందరికీ రూ.700తో పాటు, వికలాంగులకు ఇస్తున్న పింఛనును రూ.500 నుంచి రూ. 1000కి పెంచుతాం.
ప్రాధాన్య పరంగా జలయజ్ఞం ప్రాజెక్టులు
దివంగత నేత, ప్రియతమ రాజశేఖరరెడ్డి గారు జలయజ్ఞం పేరిట కోటి ఎకరాలకు సాగు నీరు అందించాలని కలలు గన్నారు. ఈ వేళ రెండు కోట్ల రూపాయలు ఖర్చు పెడితే వంశధార స్టేజీ-1 ఫేజ్-1 ప్రాజెక్టు పూర్తవుతుంది. ఐదు కోట్లు ఖర్చు పెడితే పూర్తయ్యే ప్రాజెక్టులున్నాయి. 500 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే 13 ప్రాజెక్టులు పూర్తయ్యే పరిస్థితి. ఇటువంటి చిన్నచిన్న మొత్తాలు ఖర్చు పెట్టినా చాలా ప్రాజెక్టులు పూర్తయ్యే పరిస్థితి రాష్ట్రంలో ఉన్నా.. పూర్తిగా జలయజ్ఞాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం పక్కన పెట్టింది. ప్రతి రైతు సోదరుడి ముఖాన శాశ్వతమైన చిరునవ్వు చూడాలి అంటే.. ఒక ప్రాతిపదికన, ఏ ప్రాజెక్టు చేస్తే వెంటనే రైతు సోదరుడికి ఉపయోగపడుతుందన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకుంటూ.. ప్రాధాన్యత అంశాల పరంగా ప్రతి ప్రాజెక్టును నిర్మించాల్సిన అవసరం కూడా పూర్తిగా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నీళ్లు వచ్చేస్థాయికి ఏఏ ప్రాజెక్టులు వచ్చాయన్న అంశాన్ని మనస్సులో పెట్టుకొని, ఆ మేరకు డబ్బులు కేటాయింపు చేస్తూ.. ప్రతి ప్రాజెక్టును పూర్తి చేసుకుంటూ వస్తుంది. ఇది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కచ్చితంగా చేపడుతుంది.
మద్యపాన నియంత్రణ..
మద్యపానాన్ని నియంత్రిస్తాం. ప్రతి గ్రామంలో మద్యపానం వల్ల చదువుకోలేని పరిస్థితి. చదువుకోలేని పరిస్థితి వల్ల మద్యపానం. ఈ పరిస్థితి చూస్తే బాధనిపిస్తోంది. గ్రామాల్లో తాగుడు లేకుండా బెల్టు షాపులు మూసేయిస్తాం. మద్యం షాపులు తగ్గిస్తాం. తాగాలంటే నిరుత్సాహపరిచేలా మద్యపాన విధానం రూపొందిస్తాం.
ఆరోగ్యం మా అభయం..
పేదవాడు అప్పుల పాలయ్యే పరిస్థితి తెచ్చేది అనారోగ్యం. ఏ గుండె పోటో వస్తే భార్యాపిల్లలు ఐదు రూపాయల వడ్డీకో, పది రూపాయల వడ్డీకో అప్పు తెచ్చి బతికించుకున్నా.. తరువాత దాన్ని తీర్చేందుకు జీవితాంతం ఊడిగం చేయాల్సివచ్చే దుస్థితి. ఇది ఏ పేదవాడికీ రాకూడదు. మా సీఎం ఉన్నాడన్న భరోసా ఉండాలి. నేను ఏ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నానో, ఏ పడక మీద చికిత్స పొందుతున్నానో, అదే ఆస్పత్రిలో, అదే పడకపైన పేదోడు కూడా చికిత్స పొందాలి. వైఎస్సార్లాంటివాడే మా సీఎం అని చెప్పుకొనేలా ఉండాలి. కానీ ప్రస్తుతం ప్రభుత్వం కనీసం 108 వాహనానికి డీజిల్ పోసే పరిస్థితి లేదు. రిపేరు చేయించే స్థితిలో లేదు. ఆస్పత్రికి వెళితే మందులు కూడా దొరకని దుస్థితి. మా ప్రభుత్వం వస్తే ఇప్పుడున్న 800 ఆంబులెన్సులను 1,500కు పెంచుతాం. 104లో పనిచేసే వాళ్లకు నాలుగైదు నెలలుగా జీతాలు దొరకని పరిస్థితి. ప్రతి మండలానికి ఒక 104 వాహనం ఉండేలా 1,100 వాహనాలు ఏర్పాటు చేస్తాం. ఒక్కో దాంట్లో ఇద్దరు వైద్యులు ఉండేలా చూస్తాం. ఈ ప్రభుత్వం ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసేందుకు ఆపరేషన్లన్నీ ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే చేయించాలన్న ఆలోచన చేస్తోంది. అసలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనీస సదుపాయాలున్నాయా అన్న ఆలోచన చేయట్లేదు. మేం ప్రతి జబ్బుకూ కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు వైద్యం అందిస్తూనే, ప్రభుత్వ ఆసుపత్రులను మెరుగుపరుస్తాం.
ఏటా పది లక్షల ఇళ్లు..
1947 నుంచి 2004 వరకు రాష్ట్రంలో 47 లక్షల ఇళ్లు కట్టిస్తే.. వైఎస్సార్ ఐదేళ్లలో 48 లక్షల ఇళ్లు కట్టించారని గర్వంగా చెబుతున్నా. అంతేకాదు. ఆ ఐదేళ్లలో ఆయన ఒక్క మన రాష్ట్రంలోనే 48 లక్షల ఇళ్లు కట్టించారు. దేశం మొత్మమ్మీద మిగతా రాష్ట్రాల్లో కట్టిన ఇళ్లు 48 లక్షలే. అంటే దేశమంతా ఒకెత్తు. వైఎస్సార్ కట్టించిన ఇళ్లు ఒకెత్తు. మేం ప్రతి ఏటా కనీసం 10 లక్షల ఇళ్లు కట్టించే కార్యక్రమం చేస్తాం. ఏ గ్రామానికి వెళ్లి అడిగినా.. ఇల్లు లేదని ఎవరూ చేతులెత్తే పరిస్థితి ఉండకూడదు.
ఇంకా ఆలోచనల్లో చాలా పథకాలు
ఇంకా ప్రతి దళిత సోదరుడి నుంచి బీసీ, మైనారిటీ సోదరుడి వరకు మేలు చేసేందుకు నా ఆలోచనల్లో చాలా పథకాలు ఉన్నాయి. ఇంకా అధ్యయనం చేస్తాం. ప్రతి ఒక్కరి ముఖంలో ఎలా చిరునవ్వు చూడగలమో అధ్యయనం చేస్తాం. ఇదీ మా బడ్జెట్, ఇదీ మా పార్టీ, ఇతనే మా నాయకుడు అంటూ మా మేనిఫెస్టోతో ఎన్నికల్లో సగర్వంగా చెప్పుకొనేలా చేస్తాం.
‘మద్దతు’కు 3 వేల కోట్లు
కార్మికులు రోడ్డెక్కే పరిస్థితి చూశాం. కానీ ఎన్నడూ లేనివిధంగా రైతులు సమ్మెకు దిగారు. వరి పండించలేని పరిస్థితిని సిగ్గులేని ప్రభుత్వం తెలుసుకోవాలని సమ్మె చేస్తున్నామని వారంటున్నారు. మద్దతు ధర దక్కని పరిస్థితి ఇక ఉండదు. మద్దతు ధర కోసం రూ.3 వేల కోట్లు పక్కనపెడతాం. మద్దతు ధర దొరకనప్పుడు ఆ సొమ్ముతో ధాన్యాన్ని పూర్తిగా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. రాష్ట్రంలో 40 లక్షల చదరపు అడుగుల గిడ్డంగులు ఉంటే.. సగం మాత్రమే మన నిల్వలు వాడుకునేందుకు వినియోగిస్తున్నాం. మిగతా సగం ఇతర రాష్ట్రాల కోసం వినియోగిస్తున్నాం. గిడ్డంగులు ఇవ్వరు. మద్దతు ధర ఇవ్వరు. ఎగుమతి చేసుకోనివ్వరు. ప్రాథమిక పాఠశాలను గిడ్డంగులుగా వాడుకునే దుస్థితి చూసి బాధనిపిస్తోంది. మా హయాంలో మరో 40 లక్షల చదరపు అడుగుల గిడ్డంగులు ప్రభుత్వమే కడుతుంది. రైతులు మోటార్లు కొనుగోలు చేసుకునేందుకు, చిన్న చిన్న వస్తువులు కొనుగోలు చేసుకునేందుకు 14 శాతం వరకు వడ్డీ చెల్లిస్తున్నారు. వీటి కోసం 3 లక్షల వరకు పావలా వడ్డీకే రుణం ఇస్తాం.
వడ్డీలేని పంట రుణాలు..
నేను వెళ్లినప్పుడు ప్రతి రైతు ముఖాన కన్నీరు కనిపించింది. కనీస మద్దతు ధరకు అమ్ముకోలేని దుస్థితి. మొన్న అనంతపురం వెళ్లాను. కరువొచ్చి పంట బీమాకోసం ఎదురుచూస్తున్న రైతుకు ఏడాది గడిచినా బీమా డబ్బు రాలేదు. వరదలు వచ్చి పంట నష్టపోయినప్పుడు గుంటూరు, కృష్ణా జిల్లాలకు వెళ్లి పరిస్థితి చూసి లక్షలాది మందితో విజయవాడలో దీక్ష చేస్తే అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వం గాలి మాటలు చెప్పింది. ఇన్పుట్ సబ్సిడీ ఇస్తామని ఉత్తమాటలు చెప్పింది. వైఎస్సార్ ఉన్నప్పుడు పసుపు రైతు 15 వేలకు అమ్ముకుంటే ఇప్పుడు 4 వేలు కూడా గిట్టుబాటు కాని పరిస్థితి. వరి వేసుకునే బదులు ఉరేసుకుంటే మేలని రైతు సోదరులు అన్న మాట విన్నా. ఆ రైతు ముఖాన చిరునవ్వు ఉండాలంటే రైతు పక్షపాతి సీఎంగా ఉండాలి. అందుకే వైఎస్సార్ కాంగ్రెస్ రైతు బడ్జెట్ ప్రవేశపెడుతుందని చెబుతున్నా. రైతన్నకు వడ్డీ లేని రుణాలు అందిస్తుందని చెబుతున్నా.
ఆ శాఖ మనకే తెస్తా..
ఉపాధి హామీ పథకాన్ని రైతులకు, చేనేత కార్మికులకు అనుసంధానం చేయాలి. ఇది ప్రధానమంత్రి చేతుల్లో ఉన్న అంశం. కనీసం 35 ఎంపీ స్థానాలు నాకివ్వండి. అప్పుడు కేంద్రం మన మాట ఎందుకు కాదంటుందో చూద్దాం. ఎవరో వ్యవసాయ మంత్రి కావాల్సిన దుస్థితి మనకేంటి. వాళ్ల దగ్గరికి వెళ్లి చేతులు కట్టుకోవాల్సిన పరిస్థితి మనకెందుకు? 35 స్థానాలు ఇస్తే ఆ శాఖ మనకే తెస్తా. ఈరోజు రైతులు తాము అధికోత్పత్తి సాధించడానికి ఎంత మోతాదులో ఎరువులు వాడాలో తెలియని పరిస్థితి. వారి భూముల్లో సారమెంత? ఉత్పత్తి ఎలా పెంచాలని ప్రభుత్వం ఎందుకు ఆలోచించదు? మేం ఆలోచించాం. 104, 108 మాదిరిగా రైతులకు మొబైల్ అగ్రిక్లినిక్‌లు అందుబాటులో ఉండేలా 103ని తెస్తాం. వాటిలో ఉండే డాక్టర్లు రైతులకు సలహాలిస్తారు. రైతులకు వ్యవసాయం గిట్టుబాటు కావాలంటే అనుబంధ వ్యవసాయం కూడా ఉండాలి. పాడిపశువులు పెంచుకోవాలి. వాటి సంరక్షణకు 102ని తీసుకొస్తాం. దాంట్లో వెటర్నరీ వైద్యులు ఉంటారు. ఇంటికొచ్చి మీ పశువులకు వైద్యం చేస్తారు.