ఓ పట్టాన పట్టుకోను.. పట్టుకుంటే వదలను.. ఇది వైఎస్.జగన్మోహన్ రెడ్డి ప్రాథమిక సూత్రం. తన తండ్రి జీవించి ఉన్న సమయంలోనే ఆయన తన నైజానికి విరుద్ధంగా ఏనాడూ నడుచుకోలేదు. అందువల్లే అనతికాలంలోనే రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు.
ముఖ్యమంత్రి వైఎస్ తనయుడిగా రాజకీయ రంగ ప్రవేశం చేసిన జగన్మోహన్ రెడ్డి.. తండ్రి జీవించి ఉన్నతం వరకు తండ్రిచాటు బిడ్డగానే జీవించారు. హంగు ఆర్భాటాలు లేకుండా జీవితాన్ని సాగదీశారు. కోట్లకు పడగలెత్తినా... ఉత్తమ యువ పారిశ్రామికవేత్త అవార్డును అందుకున్నా... జగన్ ఎక్కడా తమ దర్పాన్ని ప్రదర్శించలేదు. ఇదే యువ నేతల్లో జగన్కు ప్రత్యేక స్థానం కల్పించింది.అందుకే.. ఆయన చుట్టూ యువ కోటరీ చేరింది. ఈ కోటరీ ద్వారా తాను అనుకున్న లక్ష్యాన్ని చేరుకునేందుకు నిరంతర కృషి చేస్తున్నారు. తాను అనుకున్నది సాధించే వరకు నిద్రపోరని సన్నిహితులు అంటుంటారు. లక్ష్యం కోసం పలు విషయాల్లో తండ్రి మాటను సైతం ధిక్కరించిన సందర్భాలు ఉన్నాయని వారు చెపుతారు.తాజాగా ఓదార్పు యాత్ర విషయంలోనూ ఇలాగే వ్యవహరిస్తున్నారు. సొంత పార్టీ నేతల మాటలను వినడం లేదు. అవసరమైతే.. అధిష్టానాన్ని సైతం ధిక్కరించేందుకు సిద్ధంగా ఉన్నట్టు వినికిడి. ఆరు నూరైనా తాను ప్రకటించినట్టుగా.. వరంగల్ జిల్లాలో ఓదార్పు యాత్రను పూర్తి చేయాలనే తపనతో ఉన్నారు. సొంత పార్టీ నేతల నుంచే తీవ్రమైన వ్యతిరేకత వస్తున్నా.. ఆయన పెడచెవిన పెట్టారు. ఆయన సొంత పత్రిక సాక్షిలో వస్తున్న కథనాలే ఈ విషయాన్ని రుజువు చేస్తున్నాయి.
ఇందుకోసం అవసరమైన పనులను తన యువ కోటరీ చక్కబెడుతోంది. పార్టీలో కాటికి కాళ్లు చాపిన వృద్ధనేతలకు ధీటుగా ఈ కోటరీ పని చేస్తోంది. ఈ జూనియర్ నేతలంతా యువనేత అండదండలతో సీనియర్లతో తలపడేందుకు సై అంటే సై అంటున్నారు. ఇలాంటి వారిలో మాజీ మంత్రి కొండా సురేఖ దంపతులు అగ్రస్థానంలో ఉన్నారు. వీరి అండదండలతోనే జగన్ వరంగల్ యాత్రను చేపట్టి తీరాలనే నిర్ణయానికి వచ్చారు.