Post date: Apr 02, 2012 5:54:58 AM
చార్జిషీట్ నిండా అనుమానాలు, ప్రశ్నలే... ఎక్కడా సమాధానాలు చెప్పని సీబీఐ
జగన్ ఆస్తుల కేసులో అత్యంత హడావుడిగా దర్యాప్తు ప్రారంభించి, ఆర్భాటం సృష్టించి, విజయసాయిరెడ్డిని అరెస్టు చేసిన సీబీఐ.. ఆయన బెయిల్‌పై విడుదల కాకుండా చూసేందుకు ఆదరాబాదరాగా చార్జిషీట్ దాఖలు చేసిన సీబీఐ.. అందులో ఎన్నో సమాధానాలు లేని ప్రశ్నలను మిగిల్చింది. న్యాయ వ్యవహారాల్లో పరిజ్ఞానం లేని సామాన్యుడికి సైతం కలుగుతున్న అనుమానాలకు, ప్రశ్నలకు సీబీఐ సమాధానాలు చెప్పలేకపోయింది. సమాధానాలు చెప్పలేకపోయిందనేకంటే.. ఆ ప్రశ్నలకు సమాధానాలు చెబితే ఎక్కడ వాస్తవాలు బయటకు వచ్చి తమ ‘లక్ష్యం’నెరవేరకుండా పోతుందోనన్న ఆందోళనే సీబీఐ చార్జ్జిషీట్లో స్పష్టంగా కనిపించింది. చార్జిషీట్‌ను పరిశీలిస్తే ఎవరి మదిలోనైనా ఈ అనుమానాలు, ప్రశ్నలు ఇట్టే తలెత్తుతాయి. అవేమిటంటే...
1. అరబిందో, హెటిరో ఫార్మా కంపెనీలకు భూ కేటాయింపుల వల్ల ఏపీఐఐసీకి రూ. 16 కోట్ల మేర నష్టం కలిగిందని, భూములు కేటాయించినందుకు ప్రతిఫలంగా ఆ రెండు కంపెనీలూ జగన్ కంపెనీల్లో దాదాపు రూ. 30 కోట్ల మేర పెట్టుబడులు పెట్టాయని సీబీఐ తన చార్జిషీట్లో పేర్కొంది. చేకూరిన లబ్ధికంటే రెట్టింపు మొత్తాన్ని ఎవరైనా లంచంగా (సీబీఐ చెబుతోంది) పెట్టుబడి పెడతారా?
2. జగతి పబ్లికేషన్స్ చైర్మన్‌గా జగన్మోహన్రెడ్డి కంపెనీ లాభదాయకత, టర్నోవర్‌కు సంబంధించిన విషయాలను దాచిపెట్టి, భూములు కేటాయించినందుకు ప్రతిఫలంగా అధిక ప్రీమియంతో పెట్టుబడులను ఆ కంపెనీల నుంచి లంచాలుగా, క్విడ్ ప్రో క్వోగా పొందారని సీబీఐ చార్జిషీట్లో ఆరోపించింది. దివంగత వై.ఎస్.రాజశేఖరరెడ్డి, జగన్‌లపై బురదజల్లే ప్రయత్నాల్లో హడావుడిగా ఉన్న సీబీఐ కొన్ని మౌలిక విషయాలను మర్చిపోయింది. ఎవరైనా లంచం తీసుకునేటప్పుడు ఆ మొత్తాలకు లాభాలను ఆశగా చూపుతారా? లాభాలను ఆశగా చూపినప్పుడు లంచం తీసుకోవాల్సిన అవసరం ఉందా? అసలు సీబీఐ చెప్పదలచుకున్నదేమిటి?
3. అరబిందో, హెటిరో కంపెనీలకు ధరల నిర్ణాయక కమిటీ నిర్ణయించిన ఎకరా రూ. 15 లక్షల కన్నా తక్కువగా అంటే రూ. 7 లక్షలకే భూమి కేటాయించారన్నది సీబీఐ అభియోగం. ఇదే సమయంలో లీ ఫార్మా కంపెనీకి రూ. 10 లక్షలకు భూమి ఇచ్చేందుకు ఏపీఐఐసీ సిద్ధమైంది. లీ ఫార్మాకు కేటాయించేందుకు సిద్ధమైన భూమిని ఏపీఐఐసీ అప్పటికే అన్ని రకాలుగా అభివృద్ధి చేసింది. ఈ విషయాన్ని ‘సాక్షి’ గతంలోనే వెలుగులోకి తెచ్చింది. కానీ అరబిందో, హెటిరో కంపెనీలకు కేటాయించిన భూమి వద్ద కనీస సౌకర్యాలు కూడా లేవు. రోడ్డు దగ్గర నుంచి ప్రతీ పనిని ఈ రెండు కంపెనీలే చేసుకోవాల్సింది. అభివృద్ధి ఖర్చులు అధికం కాబట్టి ఆ రెండు కంపెనీలకు ఎకరా రూ. 7 లక్షలకే కేటాయించడం జరిగింది. అయితే లీ ఫార్మాకు రూ.10 లక్షలకు కేటాయించేందుకు ఏపీఐఐసీ సిద్ధమైన విషయాన్ని, అభివృద్ధి పనులన్నీ ఈ రెండు కంపెనీలే చేసుకోవాలన్న విషయాలను సీబీఐ తన చార్జిషీట్లో ఎందుకు ప్రస్తావించలేదు? లీ ఫార్మా కంపెనీకి అనుకూలంగా ఉన్న విషయాలను మాత్రమే ప్రస్తావించిన సీబీఐ, ఎకరా రూ. 10 లక్షలకు కేటాయించే విషయాన్ని ప్రస్తావించకపోవటం దురుద్దేశం కాక మరేమిటి?
4. జగన్ కంపెనీల్లో పెట్టుబడులకు సంబంధించి జూలై 12న హైకోర్టు సీబీఐ ప్రాథమిక విచారణకు ఆదేశించింది. ప్రాథమిక విచారణ సమయంలోనే ఏదో దర్యాప్తు చేస్తున్న రీతిలో ‘సాక్షి’ కార్యాలయాల్లో సోదాలు నిర్వహించి పెద్ద సంఖ్యలో డాక్యుమెంట్లను వెంట తీసుకెళ్లటం, పలువురు వ్యక్తులను కార్యాలయానికి పిలిపించి గంటల పాటు విచారించటం చేసింది. తరువాత సీబీఐ సమర్పించిన ఈ ప్రాథమిక విచారణ నివేదికను పరిశీలించిన హైకోర్టు మొత్తం వ్యవహారంపై దర్యాప్తుకు ఆదేశించింది. సీబీఐ దర్యాప్తులో కీలక పాత్ర పోషించినవి డాక్యుమెంట్లే. ఈ డాక్యుమెంట్లను సంపాదించే విషయంలో సీబీఐ కష్టపడింది కూడా ఏమీ లేదు. ఎందుకంటే రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (ఆర్ఓసీ) నుంచి లభించే కంపెనీల వివరాల తాలూకు డాక్యుమెంట్లు, ప్రభుత్వం వద్ద లభించే జీవోలే కాబట్టి వాటిని సాధించటం సీబీఐకి మరీ సులభం. వీటి ఆధారంగానే సీబీఐ దర్యాప్తు మొత్తం సాగింది. అయితే చార్జిషీట్ దాఖలు చేసిన తరువాత కూడా సీబీఐ దర్యాప్తు కొనసాగిస్తామని చెప్తోంది. చార్జిషీట్ దాఖలు చేయటమంటే దర్యాప్తు దాదాపుగా పూర్తయినట్లే. మరి దర్యాప్తు ఇంకా కొనసాగించాల్సిన అవసరం ఏముంది? ఇప్పటి వరకు దర్యాప్తు జగన్ తదితరులకు వ్యతిరేకంగా ఏమీ లేదు కాబట్టి, మరింత దర్యాప్తు చేస్తే ఆయనను ఈ కేసులో ఇరికించవచ్చునన్నది సీబీఐ ఉద్దేశమా?
5. అరబిందో అనుబంధ సంస్థ ట్రైడెంట్ లైఫ్ సెన్సైన్స్కు భూమి కేటాయించే విషయంలో ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ స్థాయిలో తప్పిదం జరిగిందని సీబీఐయే చెప్తోంది. ఇదే సమయంలో జోనల్ మేనేజర్‌తో నాటి ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి కుమ్మక్కయ్యారనీ చెప్తోంది. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి ఓ జోనల్ మేనేజర్‌తో కుమ్మక్కు కావాల్సిన అవసరం ఉందా? అది కూడా నాలుగు కోట్ల భూమి కోసం సీఎం స్థాయి వ్యక్తి అలా చేస్తారా? అన్న విషయాలను సీబీఐ అసలు పట్టించుకోలేదు. రాజశేఖరరెడ్డి, జగన్ ప్రతిష్టలను దెబ్బతీయటమే లక్ష్యంగా దర్యాప్తు సాగిస్తున్న సీబీఐ, అందుకు అనుగుణంగానే అవసరం లేకున్నా మహానేత పేరును చార్జిషీట్లో ఏకంగా 15 సార్లు ప్రస్తావించింది. దీనిని బట్టి సీబీఐ దర్యాప్తు పారదర్శకంగా ఉందని అనుకోవాలా?
6. అరబిందో, హెటిరో కంపెనీలకు భూములు కేటాయించే విషయంలో ముఖ్యమంత్రి హోదాలో రాజశేఖరరెడ్డి హడావుడిగా నిర్ణయం తీసుకున్నారనే అర్థం వచ్చేలా సీబీఐ చార్జిషీట్లో సొంత భాష్యం చెప్పింది. నోట్ ఫైల్స్‌పై ముఖ్యమంత్రి సంతకాలు ఉన్నాయని కూడా చెప్పింది. పెద్ద కంపెనీలకు భారీ స్థాయిలో భూములు కేటాయిస్తున్నప్పుడు, అందుకు సంబంధించిన ఒప్పందాలను ముఖ్యమంత్రి సమక్షంలో పరస్పరం మార్చుకోవటం పరిపాటి. ఇక నోట్ ఫైల్ ముఖ్యమంత్రి వద్దకు రావటం అనేది సర్వసాధారణం. భారీ స్థాయిలో భూములు కేటాయిస్తున్నప్పుడు అధికారులు ఆ విషయాన్ని కచ్చితంగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువస్తారు. అది కేవలం రాజశేఖరరెడ్డి అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే జరిగింది కాదు.. గత ప్రభుత్వాల హయాంలోనూ, గతంలో ముఖ్యమంత్రులు ఉన్నప్పుడూ జరిగిందే. కానీ సీబీఐ ఈ విషయాన్ని విస్మరించి, నోట్ ఫైల్స్‌పై ముఖ్యమంత్రి సంతకాలు ఉన్నాయని ప్రత్యేకంగా చెప్పటంలో ఉద్దేశమేమిటి?
7. అసలు జడ్చర్లలో పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు కంపెనీల కోసం భూములు సేకరించింది చంద్రబాబు హయాంలోనే. భూముల సేకరణ జరిగినా మూడు నాలుగు సంవత్సరాల వరకు ఈ భూముల వైపు ఒక్క కంపెనీ కూడా కన్నెత్తి చూడలేదు. రాజశేఖరరెడ్డి ప్రభుత్వం వచ్చిన తరువాత, పారిశ్రామిక అభివృద్ధి లక్ష్యంలో భాగంగా కంపెనీలకు అవసరమైన మౌలిక సౌకర్యాలు కల్పించి, వాటికి భూములను కేటాయించారు. మరి ఆ భూముల కేటాయింపు పారిశ్రామిక అభివృద్ధిలో జరిగిందని సీబీఐ ఎందుకు ఆలోచించలేదు?
8. అసలు కంపెనీలకు భూములను కేటాయించటం ప్రారంభించింది రాజశేఖరరెడ్డి ప్రభుత్వమా? గతంలో ప్రభుత్వాలు ఎలా భూములు కేటాయించాయి? అందుకు అనుసరించిన విధానం ఏమిటి? తదితర విషయాలను సీబీఐ ఎందుకు విస్మరించింది? సహజంగా గత ప్రభుత్వాల విధానాలతో పోల్చిచూసినప్పుడే ప్రస్తుత ప్రభుత్వం ఏ స్థాయిలో తప్పు చేసిందనే విషయం అర్థమవుతుంది. మరి సీబీఐ ఎక్కడా గత ప్రభుత్వ విధానాలను పరిశీలించినట్లు గానీ, ఆ విధానాలతో పోల్చినట్లు గానీ లేదు. ఎందుకంటే గత ప్రభుత్వ విధానాల గురించి ఎక్కడా కూడా సీబీఐ ప్రస్తావించలేదు. ఇన్ని విషయాలను విస్మరించటం మహానేతపై కుట్ర, కుమ్మక్కు కాక మరెందుకు..? ఈ విషయంలో సీబీఐకి దురుద్దేశాలు లేవని భావించాలా..?
ఈ ప్రశ్నలకు సీబీఐ ఎక్కడా సమాధానం చెప్పలేదు.. ఇకపై చెప్పే ప్రయత్నం కూడా చేయదు. ఎందుకంటే సీబీఐ ఇప్పటి వరకు సాగించిన దర్యాప్తు నాణేనికి ఒకవైపు మాత్రమే. ఈ ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ పోతే.. సీబీఐ ఇప్పటి వరకు సాగించిన దర్యాప్తులో నాణేనికి మరోవైపు ప్రజలకు తెలిసిపోతుంది. ఈ మొత్తం వ్యవహారంలో సీబీఐ ఎక్కడా కూడా లోతులకు వెళ్లలేదు. రాజశేఖరరెడ్డి, జగన్ ప్రతిష్టలను మంటగలిపేందుకు ఏ విషయం పనికి వస్తుందో సీబీఐ తన దర్యాప్తును అక్కడికే పరిమితం చేసింది. ఆ విషయాల ఆధారంగానే దర్యాప్తు చేసి చార్జిషీట్ దాఖలు చేసింది. లోతులకు వెళితే వాస్తవాలు బయటకు వచ్చి, తమకు ఆదేశాలు జారీ చేస్తున్న ఢిల్లీ పెద్దలు తమకు నిర్దేశించిన లక్ష్యాన్ని ఎక్కడ చేరుకోలేకపోతామోనన్నది సీబీఐ ఆందోళన.