Post date: Aug 23, 2011 6:19:49 AM
*జన హృదయాల నుంచి మహానేతను తుడిచేసేందుకు కంకణం కట్టుకుంది
*ఆయన పథకాలను కాంగ్రెస్ నిస్సిగ్గుగా తుడిచేయజూస్తోంది
*నీతిబాహ్యమైన పార్టీలో ఇంకెంతమాత్రమూ కొనసాగలేం
*మా రాజీనామాలను ఆమోదించకుంటే కాంగ్రెస్కు అంతకంటే దౌర్భాగ్యం లేదు
రాజీనామాలు చేసిన అనంతరం ఎమ్మెల్యేల ప్రకటన పూర్తి పాఠమిదీ...
‘‘రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నిస్తేజంగా, నిస్సత్తువగా, నిర్వీర్యంగా, నిర్జీవంగా ఉన్న రోజుల్లో ఆ పార్టీకి ఊపిరులూది తన అనన్య, అనితరసాధ్య నాయకత్వంతో పోరాటాలు చేసి, చావును కూడా లెక్క చేయకుండా మండుటెండల్లో 67 రోజులు 1,470 కిలోమీటర్ల పాదయాత్ర చేసి కార్యకర్తల్లో ఆత్మీయతను రంగరించి, విశ్వాసం రగిలించి, ధైర్యాన్ని నూరిపోసి పార్టీని అధికారంలోకి తెచ్చి, కేంద్రంలో కూడా అధికారాన్ని తీసుకు రావటానికి కారణభూతుడైన మహా నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి. తన పాలనలో భారతదేశంలోనే ఏ ముఖ్యమంత్రి ఎప్పుడూ చేయలేనన్ని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేసి, అత్యంత ప్రజారంజకంగా పాలించి, తనకెవరూ సాటి లేరని, సాటి రారని ప్రజలందరి చేత వేనోళ్ల కీర్తింపబడి మళ్లీ రెండోసారి కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ కాంగ్రెస్ను అధికారంలోకి తేవడానికి ఒంటి చేత్తో కృషి చేసిన అజేయుడు మన రాజశేఖరరెడ్డి. అలాంటి మహా నాయకుని మరణం మీద కోట్లాది మంది ఆయన అభిమానుల్లో అంతులేని అనుమానముంది.
ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇంతటి ప్రజాదరణా, ఇంతటి కీర్తి ప్రతిష్టలా అని భరించలేని దుష్ట శక్తులే ఆయన్ను హత్య చేశాయనీ, ఆయనది ప్రమాదంలో జరిగిన మరణం ఎంతమాత్రమూ కాదనేది అందరికీ ఉన్న నిశ్చితాభిప్రాయం. ఇప్పుడున్న ప్రభుత్వం వైఎస్ పథకాలను, ఆకాంక్షలను, ఆశయాలను, ప్రజల పట్ల ఆయనకున్న నిబద్ధతను, చిత్తశుద్ధిని, ఆయన తీసుకొచ్చిన సంక్షేమ కార్యక్రమాల్ని ఒక్కొక్కటీ నిస్సిగ్గుగా తుడిచేసి ప్రజా వ్యతిరేక ప్రభుత్వంగా పాలిస్తోంది. జన హృదయాల నుంచి రాజశేఖరరెడ్డి గారిని తుడిచేయాలని కాంగ్రెస్ కంకణం కట్టుకుని విశ్వప్రయత్నం చేస్తోంది. చివరకు ఆ మహా నేతను దోషిగా, నేరస్తునిగా, అవినీతిపరునిగా ప్రజల ముందు నిలబెట్టడానికి చట్టాలనన్నింటిని అత్యంత లోపాయికారిగా ఉపయోగించటానికి కిరాతకమైన కుట్రలు పన్నుతోంది.
సీబీఐ విచారణ నెపంతో ఆయనను నేరస్తునిగా చేయటానికి వెనుకాడక, తానొక గోముఖ వ్యాఘ్రాన్నని చాటుకుంటోంది. ప్రజల చేత ఛీత్కరించుకునే స్థితికి చేరుకున్న కాంగ్రెస్ పార్టీ అత్యంత మలినమై, కుళ్లు కంపు కొడుతోంది. మహా నాయకుడు రాజశేఖరరెడ్డి మరణాన్ని తట్టుకోలేక ప్రాణాలు కోల్పోయిన 670 మంది వీరుల దేహాలపై వాలిన రాబందుల ఆవాసం కాంగ్రెస్ పార్టీ కార్యాలయం. ఈ నీతిబాహ్యమైన కాంగ్రెస్ పార్టీలో మేమింక కొనసాగలేం. మేమింక ఎంతమాత్రమూ కాంగ్రెస్ పార్టీ సభ్యులం కాము. మా రాజీనామాలు ఆమోదించకపోతే కాంగ్రెస్ పార్టీకి అంతకంటే దౌర్భాగ్యం మరొకటి లేదు’’