Post date: Apr 10, 2011 6:57:28 AM
*రాజన్న పాదయాత్ర.. జనం మదిలో ఎప్పటికీ చెరగని ముద్ర
*1,470 కిలోమీటర్లు నడిచి, జనం గొంతుకైన మహానేత
*సంక్షేమ పథకాలకు అదే పునాది
హైదరాబాద్, న్యూస్‌లైన్: సరిగ్గా ఎనిమిదేళ్ల క్రితం... పేదోళ్లను ఖాళీ కంచం వెక్కిరిస్తుంటే, పెద్దోళ్లు సైబర్ మేడలు చూసుకుని మురిసిపోతున్న రోజులవి. అభాగ్యులను కరువు కాటేస్తుంటే, స్వర్ణాంధ్రప్రదేశ్‌ను కాగితాలపై చూపిన రోజులవి. అన్నదాతల ఆకలి చావులు, నిరుద్యోగుల నిరసన గళాలు, నేతన్నల ఆక్రందనలు, నిలువ నీడలేక నిర్భాగ్యుల నైరాశ్యం... ఇలాంటి పరిస్థితుల్లో వెలువడిందో సాహసోపేత, చరిత్రాత్మక నిర్ణయం. జనం గొంతుకయ్యేందుకు, వారి వెతలు వినేందుకు, ఆశా గీతికగా ముందుకు నడిచింది. అదే... డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రజా ప్రస్థానం. ప్రతిపక్ష నేతగానే కాక, పేదోళ్ల పెద్ద కొడుకుగా కూడా మారి, పంచె ఎగ్గట్టి, సామాన్యుల గుండె చప్పుడు వినేందుకు 1,470 కిలోమీటర్ల రాష్టవ్య్రాప్త పాదయాత్రకు ఎనిమిదేళ్ల క్రితం అంటే 2003 ఏప్రిల్ 9న వైఎస్ శ్రీకారం చుట్టారు.
రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో మొదలైన ప్రజాప్రస్థానం, మండుటెండలను కూడా లెక్క చేయకుండా 68 రోజుల పాటు ఏకధాటిగా, అప్రతిహతంగా సాగింది. 1,470 కిలోమీటర్ల పయనం తర్వాత 2003 జూన్ 15న శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో భారీ జన సమూహం మధ్య దిగ్విజయంగా ముగిసింది. అన్నదాతకు ఉచిత కరెంటు, బిల్లు బకాయిల మాఫీ, ఇందిరమ్మ ఇళ్లు, పేదలకు ఆరోగ్య ధీమా కల్పించిన ఆరోగ్యశ్రీ, రెండు రూపాయలకు కిలో బియ్యం, పావలా వడ్డీ, పేద విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్... ఇలా ముఖ్యమంత్రిగా వైఎస్ తెరతీసిన సామాన్యుని సంక్షేమ పథకాలన్నీ ప్రజా ప్రస్థానంలోనే పురుడు పోసుకున్నాయి!
తండ్రి స్ఫూర్తితో తనయుడు
పాదయాత్ర ముగిశాక శ్రీకాకుళం జిల్లా కాంగ్రెస్ కమిటీ ఇచ్ఛాపురంలో స్తూపం నిర్మించి, ప్రజాప్రస్థాన జ్ఞాపిక పేరుతో శిలాఫలకం నిర్మించింది. దేశమంటే మట్టి కాదన్న మహాకవి సందేశ సారమే స్ఫూర్తిగా మహా నేత సాగించిన మహా ప్రస్థాన శుభ ఘడియలను అశేష ప్రజాహృదయాల్లో నిక్షిప్తం చేయాలన్న సదాశయానికి ఆ జ్ఞాపిక ప్రతిరూపమని పేర్కొంది. నేడు వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని కూడా ఆ సదాశయమే ముందుకు నడిపింది.
మహా నేత కోసం ప్రాణాలొదిలిన వారి కుటుంబాలను ఆదుకునే సత్సంకల్పంతో మొదలు పెట్టిన ఓదార్పు యాత్రకు కుటిల రాజకీయాలు, ఎన్నో అడ్డంకులు, ఇంకెన్నో ఆటంకాలు మధ్యలో అడ్డుగోడగా నిలిచినా... మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగేందుకు ప్రేరణగా నిలిచింది. ఫలితం... జూలై 8న మహానేత జయంతి నాడే, ఇచ్ఛాపురంలోనే, అదే ప్రజాప్రస్థాన జ్ఞాపిక స్ఫూర్తిగా... యువనేత ఓదార్పు యాత్ర మళ్లీ మొదలైంది.