Post date: May 22, 2011 12:45:37 PM
సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా
పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ
చక్రాయపేట మండలంలో మామిడిరైతులకు పరామర్శ
కోమన్నూతలలో అరటితోటల పరిశీలన
రైతులకు అన్నివేళలా అండగా ఉంటానని, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పులివెందుల ఎమ్మెల్యే వై.ఎస్.విజయమ్మ పేర్కొన్నారు. ఎన్నికలలో విజయం సాధించిన అనంతరం తొలిసారి చక్రాయ పేట, లింగాల మండలాల్లో పర్యటించారు. శుక్రవారం రాత్రి వీచిన పెనుగాలులకు విపరీతంగా మామిడికాయలు రాలడంతో పాటు, అరటి తోటలు దెబ్బతిన్నాయి. తొలుత చక్రాయపేట మండలం ఊటుకూరువాండ్లపల్లె గ్రామానికి వెళ్లిన విజయమ్మ రాలిపోయిన మామిడి కాయలను రోడ్డుపైనే కుప్పగా పోసుకుని ఉన్న రైతులను ఓదార్చారు. సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకెళతామన్నారు. భవిష్యత్‌లో నష్టపోకుండా కోల్డ్ స్టోరేజ్‌తో పాటు, జ్యూస్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసే మార్గాలను చూస్తామని ఆమె రైతులకు భరోసా ఇచ్చారు. అలాగే పెనుగాలులకు దెబ్బతిన్న లింగాల మండలం కోమన్నూతల గ్రామంలోని అరటి తోటలను పరిశీలించారు. నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్‌తో మాట్లాడి నష్టపరిహారం అందేలా చూస్తామన్నారు. అలాగే ఎన్నికల ప్రచారం సందర్భంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతో ఘర్షణ పడిన మహిళలను పరామర్శిం చారు. సంఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. పులివెందుల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి వై.ఎస్.భాస్కర్‌రెడ్డి కుమారుడు వై.ఎస్.అవినాష్‌రెడ్డి, జార్జిరెడ్డి సతీమణి వైఎస్ భారతమ్మ తదితరులు ఆమె వెంట ఉన్నారు.