Post date: Apr 15, 2011 6:46:25 AM
తల్లిలాంటి వదినమీద మరిదిని పోటీకి నిలబెట్టారు
సోనియా ఆదేశాల మేరకే శంకర్రావు
హైకోర్టులో రిట్ వేశానంటున్నారు
రోడ్‌షోలో వైఎస్ జగన్
1600 కిలోమీటర్ల పాదయాత్ర చేసి కాంగ్రెస్‌పార్టీని నిలబెట్టిన మహానేత కుటుంబాన్నే సోనియా నిట్టనిలువునా చీల్చారని, తల్లిలా గౌరవించాల్సిన వదినపైనే చిన్నాన్నను పోటీకి నిలబెట్టారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, కడప పార్లమెంటు అభ్యర్థి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన గురువారం పులివెందుల నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో రోడ్ షో నిర్వహించారు. వైఎస్ఆర్ మా సొత్తు అని, మేమే మహానేత ఫొటో పెట్టుకుం టామని కాంగ్రెస్ నేతలు ప్రకటించడంపై అభ్యంతరం తెలిపారు. సోనియా ఆదేశాల మేరకే తాను హైకోర్టులో వైఎస్ఆర్పై రిట్ వేశానని మంత్రి శంకర్రావు స్వయంగా చెబుతున్నారు, 40 మంది క్యాబినెట్ మంత్రుల సమక్షంలో తీసుకున్న సమష్టి నిర్ణయాలపై రిట్వేయించి అసెంబ్లీలో డ్రామాలతో హౌస్ కమిటీ వేయించి, ఇప్పుడు ఏవిధంగా వైఎస్ బొమ్మ పెట్టుకొని ప్రజల్లోకి వస్తున్నారని ప్రశ్నించారు. మహానేత బొమ్మ లేకుండా గ్రామాల్లో తిరిగితే జనం తిరగబడతారనే భయంతోనే కాంగ్రెస్ పెద్దలు దిగజారిన రాజకీయాలతో సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు.
ఓట్లు, చప్పట్ల కోసం వైఎస్ బొమ్మకు దండవేసి అభిషేకం చేస్తున్న మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి అసలు స్వరూపం ప్రజలకు తెలుసన్నారు. నాన్నగారు చనిపోయారన్న బాధ గుండెనిండా ఉందని, దీనికి తోడు కాంగ్రెస్‌పార్టీ దిగజారుడు రాజకీయాలను చూస్తుంటే గుండె ఇంకా పిండేస్తోందని ఆవేదన చెందారు. ఇలాంటి కాంగ్రెస్ పార్టీ కోసమా వైఎస్ఆర్ ఇంతకాలం శ్రమపడ్డారు, ఇలాంటి నాయకత్వం కోసమా ఆయన తమ ప్రాణాలనే పణంగా పెట్టారని మనసుకు బాధ వేస్తోందన్నారు. కడప జిల్లా ప్రజలు ఇచ్చే తీర్పు రేపటిరోజు రాష్టర్రాజకీయాలను మార్చి వేస్తాయని స్పష్టం చేశారు. పులివెందుల నియోజకవర్గంలోని గ్రామాల్లో తిరుగుతుంటే తన సొంతూరులో తిరిగినట్లు ఉందని ఆనందం వ్యక్తం చేశారు. వైఎస్ మరణంతో గుండెపగిలి చనిపోయిన ఆత్మ బంధువుల కుటుంబాలకు ఇచ్చిన మాట ప్రకారమే నడుచుకున్నాను కాబట్టి ఈఎన్నికలు వచ్చాయని ఆయన వివరించారు. సంక్షేమ పథకాల అమలు తీరును చూస్తుంటే బాధ కలుగుతోం దన్నారు. ప్రభుత్వ జీవోలను, తమ విధానాలను చూస్తుంటే పేద విద్యార్థులకు ఇక ఉన్నతవిద్య దుర్లభమేనని అనిపిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు.