Post date: Aug 23, 2011 1:43:52 PM
ఎమ్మార్ ప్రాపర్టీస్ వ్యవహారంలో పలువురు మంత్రులు, అధికారులు ఉన్నారని వైయస్సార్సీ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మంగళవారం మీడియా సమావేశంలో అన్నారు. సిబిఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో గుర్తు తెలియని మంత్రులు, అధికారులు అని పేర్కొనడం వెనుక వ్యూహం ఏమిటన్నారు. కాంగ్రెసుకు అనుకూలంగా ఉండే వారిని కేసుల నుండి తప్పించి వ్యతిరేకులను మాత్రమే పేర్కొంటున్నారన్నారు. విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ సోదరుడు శ్రీధర్తో పాటు పలువురు కాంగ్రెసు అనుకూలుర పేర్లను ముద్దాయిలుగా చూపించలేదని విమర్శించారు. హైకోర్టు ఆదేశాల మేరకు ప్రారంభమైన సిబిఐ విచారణ చివరకు కాంగ్రెసు పార్టీ అధిష్టానం ఆదేశానుసారంగా విచారిస్తుందన్నారు.
సిబిఐ, ఎసిబి వంటి వాటి పట్ల ప్రజలకున్న నమ్మకాన్ని వమ్ము చేయకూడదన్నారు. జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా ఎదుర్కొనలేక ఆయనను నిర్వీర్యం చేయడానికి కాంగ్రెసు పార్టీ సిబిఐని దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. జగన్ను ఇబ్బంది పెట్టేందుకే సిబిఐ దాడులని విమర్శించారు. అధికారం వారి దగ్గరే ఉన్నప్పుడు జగన్ తన దగ్గర ఏముందని ఎమ్మెల్యేలకు ఆశ చూపిస్తాడన్నారు. సిబిఐ విచారణ సక్రమంగా జరుగుతుందనుకుంటే సచివాలయంలోనూ సోదాలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. లగడపాటి అర్థం లేని మాటలు మాట్లాడుతున్నారన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడును చూసి నవ్వాలో ఏడ్వాలో అర్థం కావడం లేదన్నారు.