Post date: May 05, 2011 8:18:48 AM
కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు అంబటి రాంబాబు తీవ్రంగా ధ్వజమెత్తారు. తెలుగు సంప్రదాయాలు, భారత సంప్రదాయాలు తెలియని సోనియా గాంధీ నాయకత్వంలో ఇంత కాలం పనిచేసినందుకు సిగ్గుపడుతున్నానని ఆయన గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. కడప ఉప ఎన్నికలు ఇటలీ సంప్రదాయానికి, తెలుగు సంప్రదాయానికి మధ్య పోరాటమని ఆయన అన్నారు. ఈ ఎన్నికలు ఢిల్లీ అహంకారానికి, కడప పౌరుషానికి మధ్య పోరు కూడా అని ఆయన అన్నారు.
కడప ఉప ఎన్నికల్లో ఓడిపోతే నష్టం లేకపోతే, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఎందుకు ప్రచారానికి వస్తారు, 16 మంది మంత్రులు ఎందుకు వస్తారు, డబ్బులు ఎందుకు వెదజల్లుతున్నారని ఆయన అడిగారు. ఉప ఎన్నికలపై కాంగ్రెసు నాయకులు గాభరా పడుతున్నారని ఆయన అన్నారు. ఉప ఎన్నికల ఫలితాలు భవిష్యత్తు రాజకీయ మార్పులకు నాంది పలుకుతాయని ఆయన అన్నారు.
వైయస్ రాజశేఖర రెడ్డి పథకాలను కాంగ్రెసు ప్రభుత్వం నీరు గారుస్తోందని ఆయన విమర్శించారు. వైయస్ రాజశేఖర రెడ్డి పథకాలను అమలు చేయడమే తమ ఎజెండా అని ఆయన అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి ఎజెండా లేదని కాంగ్రెసు నాయకులు చేసిన విమర్శలను ఆయన ఖండించారు. తమ పార్టీ జెండానే తమ ఎజెండా అని, జెండాను పరిశీలిస్తే తమ ఎజెండా అర్థమవుతుందని ఆయన అన్నారు.