Post date: Dec 16, 2011 6:14:1 AM
కిరణ్ సర్కారు అవిశ్వాసం పై వ్యతిరేకంగా ఒటు వేసి, జగన్ వర్గ ఎమ్మేల్యేగా ముద్ర పడ్డ క్రిష్ణదాసు తన సొంత నియోజకవర్గం నర్సన్నపేటలో ఆసక్తి గల రాజకీయాలకు తెరతీస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ విప్ కు వ్యతిరేకంగా వ్యవహరించడంతో ఆయనపై అనర్హత వేటు పడే అవకాశం ఉండటంతో, ప్రస్తుతం ఎన్నికలు అనివార్యం. స్దానిక ఎమ్మేల్యే కృష్ణదాసు వరుసగా రెండు సార్లు కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈయన రాష్ట్ర రోడ్డు రవాణాశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు సోదరుడు. తన సోదరుడు మంత్రిగా ఉన్నా ఆయనను కాదని కృష్ణదాసు జగన్ పంచన చేరాడు. అవిశ్వాసం సమయంలో జగన్‌కు మద్దతుగా నిలిచాడు. ధర్మాన కృష్ణదాసుకు ఈ ప్రాంతంలో బలమైన నాయకత్వం ఉండటంతో, ఆయనపై పోటీ పెట్టి గెలవడం కాంగ్రెస్ పార్టీకి తలకు మించిన భారంగా మారనుంది. వివాదరహితుడిగా పేరున్న కృష్ణదాసు కాంగ్రెస్‌లో బలమైన నాయకుడిగాఎదిగారు. ఇప్పటికే జిల్లాలో వైఎస్ఆర్ పార్టీకి పగ్గాలు ఆయన సతీమణి పద్మప్రియ చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా వైఎస్ఆర్ పార్టిని బలోపేతం చేసే పనిలో నిమగ్నమై ఉన్నారు. మరో వైపు ఈ నియోజకవర్గంలో బలమైన కాంగ్రెస్ కేడర్ అంతా కృష్ణదాసు వెంటే నడుస్తుండటంతో అవిశ్వాస తీర్మానానికి ముందే ఉప ఎన్నికలపై ఆయన ధీమాగా ఉన్నారు.
రూటు మారనున్నకాంగ్రెస్ ఓటు బ్యాంకు…
ఒక సారి నర్సన్నపేట నియోజక వర్గ రాజకీయ పరిస్ధితులు పరిశీలిస్తే… ఈ నియోజకవర్గం ప్రజలు ఏడు ధపాలు కాంగ్రెస్ కు పదవిని కట్టబెట్టారు. ఇప్పటివరకు ఒకే ఒక్కసారి తెలుగు దేశం ఎమ్మెల్యే గెలిచారు. ఇందులో రెండు సార్లు ధర్మాన ప్రసాదరావు ఎమ్మెల్యేగా ఎన్నికల్లో గెలుపొంది ఒక సారి ఒటమి చవిచూసారు. అయితే ధర్మాన ప్రసాద్ రావు తన సొంత నియోజక వర్గం శ్రీకాకుళం స్దానం నుంచి పోటీ చేసేందుకు సిద్దపడటంతో నాటి నుండి ఆయన అన్న
ధర్మాన కృష్ణదాసు ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. 2004, 2009 ఎన్నికల్లో అత్యధిక మెజార్టితో గెలుపొందటంతో పాటు స్ధానికంగా తన సొంత కేడర్‌ను తయారు చేసుకోగలిగారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో ఉప ఎన్నికలు వస్తే ధర్మాన కృష్ణదాసును తట్టుకోవడం కష్టమే. ఆయనపై పోటీ పడగల నాయకుడి గురించి పెద్ద ఎత్తున ఊహాగానాలు సాగుతున్నాయి.
కొంతకాలం క్రితం కృష్ణదాసు జగన్ కు జై కొట్టనున్నారు అనే ప్రచారం జోరుగా సాడగంతో నాటి నుండి కృష్ణదాసు పార్టి నుంచి బైటకు వెళ్ళకుండా ఉండేందుకు ధర్మాన ప్రసాద రావు తీవ్రంగా ప్రయత్నాలు సాగించారు. స్వయంగా ఆయన వత్తిడి చేయడంతో పాటు కుటుంబసభ్యుల నుండి నచ్చ చెప్పే ప్రయత్నాలు కూడా జరిగాయి. జిల్లాలో ఓదార్పు యాత్ర సమయంలో కృష్ణదాసు కుటుంబ సభ్యులు ఆయన అండగా నిలిచారు. తనకు రెండు సార్లు అవకాశమిచ్చి తన ఉన్నతికి కారణమైన వైఎస్ కు వీరాభిమానిగా కృష్ణదాసు జగన్ పంచనే చేరారు.
మంత్రి ధర్మాన వ్యూహం…
నర్సన్నపేట నియోజక వర్గంలో ఎన్నికలు అనివార్యం కానున్న నేపద్యంలో ఈ స్ధానంలో తమ్ముడిని ఓడించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిచిపించడానికి మంత్రి ధర్మాన ప్రసాద్ రావు పావులు కదుపుతున్నారు. కృష్ణదాసు వెంట వెళ్లిన కేడర్ తిరిగి కాంగ్రెస్ లోకి తీసుకువచ్చేందుకు ఆయనే స్వయంగా రంగంలో దిగారు. గత రెండు నెలలుగా ఆయన నర్సన్నపేట నియోజక వర్గంలో తిరుగుతూ పలు అభివృద్ది కార్యక్రమాలు చేపడుతున్నారు. భవిషత్తు అంతా కాంగ్రెస్ పార్టీదే అని, జగన్ పార్టీ ముణ్ణాళ్ల ముచ్చటగా ఉంటుందంటూ ప్రచారం అందుకున్నారు. అంతే కాకుండా కృష్ణదాసు ప్రాబల్యం తగ్గించేందకు మంత్రి ధర్మాన మరో సోధరుడు ధర్మాన రామదాసును రంగంలో దింపాడు. నియోజక వర్గం కాంగ్రెస్ పగ్గాలు ఆయనకు అప్పగించి బైటకు వెళ్ళిన కాంగ్రెస్ కేడర్‌ను వెనక్కు తీసుకు వచ్చే పనులు చేపట్టారు. మరోవైపు తన అన్న పన్నాగాలు విఫలం చేసి, తిరిగి ఎలాగైనా ఈ స్థానాన్ని దక్కించుకోవడానికి కృష్ణదాసు ఎత్తుకుపై ఎత్తులు వేస్తున్నారు.
ధర్మాన ప్రసాదరావు రాజకీయ గురువు, మాజీ ఎమ్మెల్యే డోల సీతారామ్ తనయుడు డోల జగన్ గత ఎన్నికల్లో పి.ఆర్.పి. ఎమ్మెల్యేగా పోటీచేశారు. ఈసారి ఆయనను కాంగ్రెసు తరఫున కృష్ణదాసుకు పై పోటీకి నిలబెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. ఇతనితో కాంగ్రెస్ పార్టీ మరో అభ్యర్థిని కూడా సిద్ధం చేస్తోంది. అతనెవరో కాదు, గతంలో తెలుగు దేశం పార్టీ తరఫున ఈ నియోజకవర్గంలో గెలుపొందిన బొగ్గు లక్ష్మణరావు. తనకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే పార్టీ మారేందుకు సిద్దంగా ఉండటంతో లక్ష్మణరావుపై కూడా కాంగ్రెస్ కన్నేసింది. దీంతో అసలు చివరకు కృష్ణదాసుపై ఎవరు పోటీకి దిగుతారు అన్నది ఆసక్తిగా మారింది. ప్రస్తుతం బొగ్గు లక్ష్మణరావు, డోల జగన్, రామదాసులు బరిలో ఉన్నారు. నిజాయితీకి, నమ్మకానికి మారుపేరుగా చెప్పుకునే సిక్కోలు పార్టీకి నమ్మకంగా నిలుస్తుందా? తమ అభ్యర్థిని, వైఎస్ పై నమ్మకం నిలుపుకుంటుందా అన్నది వేచి చూడాల్సి ఉంది