Post date: Apr 22, 2011 5:6:49 AM
తమ వర్గానికి చెందిన నలుగురు శాసనసభ్యులకు ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) ఇచ్చిన షోకాజ్ నోటీసులకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు వైయస్ జగన్ వర్గానికి చెందిన 25 మంది శాసనసభ్యులు ప్రతి వ్యూహాన్ని ఎంచుకున్నారు. తమ వ్యూహాన్ని అమలు చేసేందుకు సిద్ధపడ్డారు. నలుగురికి మాత్రమే ఎందుకు షోకాజ్ నోటీసులు ఇచ్చారని, అందరికీ ఇవ్వాల్సిందని జగన్ వర్గం శాసనసభ్యులు అంటున్నారు. నలుగురిపై చర్యలు తీసుకున్నారు కాబట్టి మిగతా వాళ్లం సురక్షితంగా ఉన్నామని తాము అనుకోవడం లేదని శాసనసభ్యుడు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి అన్నారు.
కాంగ్రెసు చర్యకు నిరసనగా మూకుమ్మడిగా రాజీనామా చేసేందుకు జగన్ వర్గం శాసనసభ్యులు సిద్ధఫడుతున్నారు. కడప లోకసభ స్థానానికి, పులివెందుల శాసనసభా స్థానానికి ఉప ఎన్నికలు ముగిసిన తర్వాత వారు మూకుమ్మడిగా రాజీనామా చేస్తారని అంటున్నారు. జిల్లాకు ఒకరిద్దరి చొప్పున అన్ని జిల్లాలకు చెందిన శాసనసభ్యులు రాజీనామాలు చేయాలని అనుకుంటున్నారు. రాష్ట్రమంతా ప్రతి జిల్లాలో ఒకటి రెండు సీట్లకు ఉప ఎన్నికలు జరపాల్సిన పరిస్థితి వస్తుంది. అలా రాష్ట్రవ్యాప్తంగా తాము బలంగా ఉన్నామని చెప్పుకోవడానికి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీపై శాసనసభలోకి రావడం ద్వారా ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లోకి నెట్టడానికి వీలవుతుందని భావిస్తున్నారు.
మరో పది మంది కాంగ్రెసు శాసనసభ్యులకు గాలం వేయాలని జగన్ వర్గం ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. తాము మూకుమ్మడిగా రాజీనామా చేసే విషయంపై వైయస్ జగన్ నిర్ణయం తీసుకుంటారని వరంగల్ జిల్లా శాయంపేట శాసనసభ్యురాలు కొండా సురేఖ అన్నారు. తమకు షోకాజ్ నోటీసులు ఇవ్వడం, తమపై అనర్హత వేటు వేయాలని డిప్యూటీ స్పీకర్‌కు ఫిర్యాదు చేయడం వంటి చర్యల వల్ల జగన్ మరింత బపలపడుతారని ఆమె అన్నారు.