Post date: Mar 06, 2012 6:14:54 AM
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి మార్చి 12వ తే దీతో ఏడాది పూర్తి కానుండడంతో భవిష్యత్తు కార్యాచరణపై చర్చించుకునేందుకు అన్ని జిల్లాల కన్వీనర్లు, కో-ఆర్డినేటర్లు, ఇతర ముఖ్యనేతలు సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశమయ్యారు. పార్టీకి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై ప్రధానంగా చర్చించారు. ముఖ్యంగా ప్రతి మండల, గ్రామాల్లో మార్చి 12న పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని తప్పనిసరిగా నిర్వహించేలా ప్రణాళిక రూపొందించుకోవాలని నేతలు అభిప్రాయపడ్డారు. అలాగే పార్టీ పటిష్టత, కమిటీలు, సభ్యత్వ నమోదుపై సుదీర్ఘంగా చర్చించారు.
పార్టీని మరింత బలోపేతం చేసేందుకు గడప గడపకు వైఎస్సార్ కాంగ్రెస్ కార్యక్రమాన్ని యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని నిర్ణయించారు. పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేయనుందో ప్రజలకు కూలంకషంగా వివరించాలని శ్రేణులకు సూచించారు. అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి పార్టీ తొలి ప్లీనరీ(ప్రజా ప్రస్థానం) సమావేశాల్లో ప్రకటించిన సంక్షేమ పథకాలను ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేయాలని నేతలు నిర్ణయించారు. అదే మాదిరిగా ఏడాది కాలంలో ప్రజా సమస్యలపై పార్టీ పోరాడిన కార్యక్రమాలు, ప్రజల పక్షాన నిలిచిన ఘటనలను ఈ సందర్భంగా చర్చించి, మునుముందు కూడా ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని నిర్ణయించారు.
జగన్‌తోనే సాధ్యమని ప్రజలు విశ్వసిస్తున్నారు: బోస్
నేతల సమావేశానంతరం మాజీ ఎమ్మెల్యే పిల్లి సుభాష్ చంద్రబోస్ విలేకరులతో మాట్లాడుతూ.. త్వరలో ఉప ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు రానున్నందున పార్టీని మరింత బలోపేతం చేయాలని నిర్ణయించామన్నారు. దివంగత వైఎస్ హయాంలో అమలైన సంక్షేమ పథకాలకు ప్రస్తుత ప్రభుత్వం తూట్లు పొడుస్తున్న విధానాన్ని ప్రజలకు వివరిస్తామన్నారు. రాష్ట్రంలో మళ్లీ వైఎస్ సంక్షేమ పథకాలు పునరుద్ధరించాలన్నా, పెంచాలన్నా జగన్ వల్లే సాధ్యమవుతుందని ప్రజలు విశ్వసిస్తున్నట్లు చెప్పారు