Post date: Apr 27, 2011 11:50:25 AM
విలువలకు కట్టుబడినందుకే నాపై మూకుమ్మడి దాడి
వైఎస్సార్ జిల్లాకు-ఢిల్లీకి మధ్య జరుగుతున్న ఎన్నికలివి
ఆత్మ గౌరవానికి - అహంకారానికి, నీతికి-అవినీతికి, ధర్మానికి - అధర్మానికి, విశ్వసనీయతకు-వంచనకు మధ్య జరుగుతున్న ఎన్నికలివి అని వైఎస్ఆర్ కాంగ్రెస్‌పార్టీ ఎంపీ అభ్యర్థి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. రోడ్‌షోలో భాగంగా ఆయన బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు అనేక చోట్ల మాట్లాడారు. ఈ ఎన్నికలు ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగేవి కావని, వైఎస్‌కు-సోనియా గాంధీకి, వైఎస్సార్ జిల్లాకు - ఢిల్లీకి మధ్య జరుగుతున్న పోరా టంగా అభివర్ణించారు. దివంగత మహానేత రాజశేఖరరెడ్డి రెండోసారి ముఖ్యమంత్రి అయ్యాక పేద ప్రజలకు సంక్షేమ పథకాలన్నింటినీ వర్తింప చేయాలనే లక్ష్యంతో ప్రమాణ స్వీకారం చేసిన వంద రోజుల్లోనే రచ్చబండ కార్యక్రమానికి వెళ్లి హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందారన్నారు.
ఆ సందర్భంగా నల్లకాలువలో వైఎస్ చనిపోయిన ప్రదేశాన్ని చూసి, విని ఎందరో మృతిచెందారని తెలిపారు. వారి ఇళ్లకు వెళ్లి పరామర్శిం చేందుకు ఓదార్పు యాత్ర చేపట్టానన్నారు. తాను విలువలకు కట్టుబడకుండా ఉండి ఉంటే ఈ ఎన్నికలు వచ్చి ఉండేవి కావ న్నారు. అధికార పార్టీ నాయకులు వైఎస్ మరణం తర్వాత తలా తోక లేకుండా మాట్లాడుతున్నారన్నారు. కేవలం తాను సిద్ధాంత పరంగా విభేదించి పార్టీని వీడినట్లు తెలిపారు. జిల్లాలో దాదాపు పది వేల మందిపై బైండోవర్ కేసులు పెట్టారని, అర్ధరాత్రి, అపరాత్రి పోలీసులు కార్యకర్తల ఇళ్లపై దాడి చేసి కొట్టారన్నారు. చరిత్రలో ఎక్కడా ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి చూడలేదన్నారు. తన తల్లిని, తనను ఒంటరి చేసేందుకు 15 మంది మంత్రులను ప్రభుత్వం ఇక్కడకు పంపిందన్నారు. అధికార ప్రతిపక్ష పార్టీలు తమపై కుట్ర పన్నుతున్నాయని జగన్ తెలిపారు.
అడుగడుగునా ఘనస్వాగతం
ఉప ఎన్నికల్లో భాగంగా జగన్ నిర్వహించిన రోడ్ షోకు ప్రజల నుంచి విశేష స్పందన కనిపించింది. అడుగడుగునా ఆయనకు ప్రజలు నీరాజనాలు పట్టారు. ఉదయం 9.30 గంటలకు స్థానిక కన్యకాపరమేశ్వరి ఆలయానికి చేరుకున్న ఆయన అనంతరం గాదంశెట్టి కల్యాణ మండపంలో ఆర్యవైశ్యులతో సమావేశమయ్యారు. అనంతరం మోడంపల్లె ఆంజనేయస్వామి ఆలయం, కొత్తపల్లి జంక్షన్లలో రోడ్‌షో తరువాత ముస్లిం మైనారిటీల సమావేశంలో పాల్గొన్నారు. తర్వాత లింగాపురం, బొజ్జవారిపల్లె గ్రామాల్లో రోడ్‌షో నిర్వహించారు. ఆ గ్రామాల్లో జగన్‌కు, ఆయనతో పాటు పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే ఎం.వి.రమణారెడ్డికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన మహబూబ్‌బాషా యువనేతను తన ఇంటికి తీసుకు వెళ్లేందుకు దారి పొడవునా పూలుపరిచి నడిపించారు. సర్పంచ్ గురుస్వామి ఇంట్లో విందు ఏర్పాటు చేశారు. కొత్తపల్లె క్రాస్‌రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ మంత్రి కొండా సురేఖ మాట్లాడారు. అక్కడి నుంచి అగస్త్యేశ్వర ఆలయ కమిటీ మాజీ చైర్మన్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి ఘన స్వాగతం పలికి జగన్‌ను గ్రామానికి తీసుకెళ్లారు. స్వర్ణకార్మికుడు పి.కమాల్‌బాషా తాను తయారు చేసిన బంగారు ఫ్యాన్‌ను జగన్‌కు చూపించారు. అనంతరం గ్రామంలో నుంచి మడూరు క్రాస్ రోడ్డు మీదుగా ప్రొద్దుటూరులోని వివిధ ప్రాంతాల్లో రోడ్‌షో నిర్వహించారు.