Post date: Aug 18, 2011 5:41:45 AM
బెంగళూర్‌లోని వైయస్ జగన్మోహన్ రెడ్డి నివాసంపై కూడా సిబిఐ అధికారులు దాడులు చేస్తున్నారు. ఇంట్లో అణువణువూ శోధిస్తున్నారు.బెంగళూర్‌లోని మరి కొన్ని చోట్ల కూడా సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ముంబైలోని జగన్ కార్యాలయాల్లో కూడా సోదాలు జరుగుతున్నాయి. హైదరాబాదులోని కూకట్‌పల్లిలో గల హిందూ ప్రాజెక్టు కార్యాలయంపై కూడా దాడులు జరుగుతున్నాయి. జగన్ సంస్థలకు చెందిన మానవ వనరుల విభాగం (హెచ్ఆర్ డిపార్ట్మెంట్) అధికారులను, అకౌంట్స్ అధికారులను సిబిఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు. జగన్‌తో సంబంధాలున్నాయని భావిస్తున్న కంపెనీల అధికారులను కూడా వారు ప్రశ్నిస్తున్నారు.
జగన్ కంపెనీల ఆస్తుల విలువ ఎంత, వాటి ప్రీమియం విలువ ఎంత అనే విషయాలపై సిబిఐ అధికారులు ఆరా తీస్తున్నారు. ప్రీమియం ఎలా లెక్కిస్తున్నారు, కంపెనీలు అతం ప్రీమియం చెల్లించి భారీగా వాటాలు కొనాల్సిన అవసరం ఏమిటి అనే విషయాలపై కూడా సమాధానాలు రాబట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ కంపెనీలతో జగన్‌కు ఉన్న సంబంధాలు ఏమిటనే విషయంపై కూడా ప్రశ్నిస్తున్నారు. కంపెనీ ప్రీమియం విలువ ఎంత అని కూడా అడుగుతున్నారు. వివిధ కంపెనీలతో జగన్‌కు గల సంబంధాలపై, జగన్ కంపెనీల్లో ఆ కంపెనీలు పెట్టుబడులు పెట్టడం వెనక గల ప్రయోజనాలు ఏమిటనే ప్రశ్నలకు సమాధానాలు రాబట్టే ప్రయత్నాలు చేస్తున్నారు.