Post date: Apr 23, 2011 12:22:0 PM
‘రాష్ట్ర క్యాబినెట్ మంత్రుల్లో సగం మంది జిల్లాకు చేరారు. వారి కార్లలో డబ్బులను హైదరాబాద్ నుంచి తెచ్చి పంచుతున్నారు. నాకు, నా తల్లి విజయమ్మకు, నాన్నను ప్రేమించే గుండెలే తోడూ,నీడ. ఆశీర్వదించమని మిమ్మల్ని సవినయంగా కోరుకుంటున్నాను’ అని వైఎస్ఆర్ కాంగ్రెస్‌పార్టీ అధినేత, కడప పార్లమెంట్ అభ్యర్థి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. బద్వేలు నియోజకవర్గం పోరుమామిళ్ల మండలం తూర్పుకొండల్లోని మారుమూలపల్లెలను పలకరిస్తూ, జోరువర్షాన్ని కూడా లెక్కచేయకుండా శుక్రవారం యువనేత రోడ్‌షో సాగింది.
ఈ ఉపఎన్నికలు సెమీఫైనల్స్ మాత్రమేనని, కడప ప్రజలు ఇచ్చే తీర్పుతో త్వరలోనే ఫైనల్స్ జరుగుతాయని స్పష్టం చేశారు. ఎన్నిసార్లు చెప్పినా కాంగ్రెస్, తెలుగుదేశం నేతలు అసత్య ప్రచారాలను మానడం లేదని చెప్పారు. ముస్లిం సోదరుల్లో అభద్రతా భావం తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఎలాంటి పరిస్థితుల్లో బీజేపీతో పొత్తుపెట్టుకోనని ఇప్పటికే ఎన్నో సార్లు చెప్పానని, మళ్లీ అదే మాట చెబుతున్నానని అన్నారు. ఎన్నాళ్లు బతికామన్నది ముఖ్యం కాదని, బతికినంత కాలం ఎలా బతికామనేది ముఖ్యమని దివంగత నేత వైఎస్ చెప్పిన మాటలను గుర్తుచేశారు.
మంచి నాయకుడంటే ఇలా ఉండాలని ప్రజలు గర్వంగా చెప్పుకునేలా ఉంటానని భరోసా ఇచ్చారు. వృద్ధుల పెన్షన్ డబ్బులు పెరగాలన్నా, సంక్షేమ పథకాలు తిరిగి అమలు కావాలన్నా మన పార్టీని మనమే అధికారంలోకి తెచ్చుకుందామని ఆయన పిలుపునిచ్చారు. ప్రజలను మోసం చేసేందుకు, మభ్యపెట్టేందుకు పదిమంది జగన్మోహన్రెడ్డి అనే పేర్లతో, అలాగే పులివెందుల నియోజకవర్గానికి నా తల్లి విజయమ్మ పేరుమీద ఆరుగురితో నామినేషన్ వేయించారని, ఇంత నీచమైన స్థాయికి కాంగ్రెస్, టీడీ పీలు దిగజారాయన్నారు. ఎవరెన్ని నామినేషన్లు వేసినా ఫ్యాను గుర్తుపైనే మన ఓటు వేసుకుందామని అన్నారు.
తూర్పుకొండల్లో ‘ఫ్యాను’గాలి: జగన్‌కు, ఆయన తల్లి విజయమ్మకు ఎన్నికల్లో ఫ్యాను గుర్తు కేటాయించారన్న సమాచారం రాకెట్ వేగంతో పల్లెలకు విస్తరింది. అత్యంత మారుమూల ఉన్న చిన్నాయిపల్లె గ్రామానికి జగన్ చేరుకోకముందే గ్రామంలో ఇళ్లకు ఫ్యాను గుర్తుతో కూడిన డోర్పోస్టర్లు, సుద్దముక్కలతో గీసిన ఫ్యానుగుర్తు రేఖాచిత్రాలు చూసి జగన్ ఆశ్చర్యపోయారు. ప్రజలు ఇంతతొందరగా గుర్తును స్వీకరిం చారాఅంటూ సంతోషం వ్యక్తం చేశారు.
ఆయన ప్రసంగించిన పలుచోట్ల ‘అవ్వా మన ఎన్నికల గుర్తు ఏదో తెలుసా? తెలిస్తే ఒక్కసారి చేతులు ఎత్తండ’ని వృద్ధులను, మహిళలను అడగ్గా, ఫ్యాను గుర్తు అంటూ అరుస్తూ చేతులు ఎత్తడం కనిపిం చింది. గొళ్లపల్లెలో 90 సంవత్సరాల వద్ధురాలిని మనది ఏ గుర్తు అవ్వా అని జగన్ అడగ్గా ఆమె తడుముకోకుండా ఫ్యాన్గుర్తుఅని చెప్పగా, యువనేత మీ చిరునవ్వులు ఇలాగే ఉండాలంటే మనగుర్తుకు మనమే ఓటు వేసుకుందామని చెప్పారు.