Post date: May 04, 2011 7:5:15 AM
నిత్యం దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి జపం చేస్తూ ఓట్లు దండుకోవడానికి యత్నిస్తున్న కాంగ్రెస్ నాయకులకు మహానేత సమాధిని దర్శించడానికి మాత్రం మనసొప్పడం లేదని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం రాత్రి మైదుకూరు నాలుగు రోడ్ల సర్కిల్ వద్ద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జగన్మోహన్రెడ్డితో కలసి ఎన్నికలసభలో ఆమె ప్రసంగించారు. ఓట్ల కోసం వైఎస్ పేరును వాడుకునే ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి ఆ మహానేతకు నివాళులు అర్పించే సమయమే దొరకలేదా అని ప్రశ్నించారు. తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నాయనేందుకు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయని చెప్పారు. కాంగ్రెస్ అభ్యర్థి డీఎల్ రవీంద్రారెడ్డి చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. అందులో భాగంగానే జగన్ సభకు అంతరాయం కలిగించడానికి విద్యుత్‌ను తొలగించారని ఆమె ఆరోపించారు.