Post date: May 14, 2011 6:17:19 AM
కడప లోక్‌సభలో 5,45,672 ఓట్ల మెజార్టీతో జగన్ విజయభేరి
పులివెందుల అసెంబ్లీలో విజయమ్మకు 81,373 ఓట్ల భారీ మెజార్టీ
పార్లమెంట్ పరిధిలో డిపాజిట్లు కోల్పోయిన డీఎల్, మైసూరా
మంత్రి డీఎల్‌కు దక్కింది లక్షా 46 వేల ఓట్లు మాత్రమే
మూడోస్థానంలో మైసూరాకు దక్కింది లక్షా 29వేల ఓట్లే
{పతి అసెంబ్లీ నియోజకవర్గంలోనూ జగన్‌కు భారీ మెజార్టీ
పులివెందులలో డిపాజిట్‌తో బయటపడ్డ వైఎస్ వివేకా...
డిపాజిట్ పోగొట్టుకున్న టీడీపీ అభ్యర్థి బీటెక్ రవి
ఆత్మగౌరవానికి అందలం. దేశ చరిత్రలోనే అద్భుతంగా అభివర్ణించదగ్గ విజయం. హస్తిన అహంకారాన్ని తెలుగు ఆత్మగౌరవం అణగదొక్కిన చరిత్రాత్మక సంఘటన!! వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి కడప ప్రజలు దేశంలోనే మూడో అతి పెద్ద మెజారిటీ కట్టబెట్టారు. 2004లో పశ్చిమబెంగాల్లో సీపీఎం నేత అనిల్ బసు సాధించిన 5.92 లక్షల మెజారిటీ ఇప్పటిదాకా దేశంలోకెల్లా అత్యధికం. మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు 1991లో నంద్యాల లోక్‌సభ స్థానంలో లభించిన 5.8 లక్షల మెజారిటీ రెండో స్థానంలో ఉంది. కానీ ఇవి రెండూ నల్లేరుపై నడక మాదిరిగా వచ్చిన అనాయాస విజయాలే. 2004లో బెంగాల్లో సీపీఎం ఉచ్ఛ దశలో ఉండగా, కాంగ్రెస్ కనీసం సోదిలో కూడా లేదు. బసు ఏకైక ప్రత్యర్థల్లా బలహీన బీజేపీ మాత్రమే. పీవీ విషయమూ అంతే. పైగా, ప్రధాని అనే ఉద్దేశంతో ఆయనపై టీడీపీ పోటీ కూడా పెట్టలేదు. బీజేపీయే నామమాత్రంగా బరిలో దిగింది. అదీగాక అప్పుడు కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వాలే ఉన్నాయి. కానీ కడప ఉప ఎన్నిక మాత్రం అక్షరాలా కురుక్షేత్రాన్ని తలపించింది.
అధికార కాంగ్రెస్, విపక్ష టీడీపీ యువనేతతో హోరాహోరీ తలపడ్డాయి. విజయమే లక్ష్యంగా వందలాది కోట్లను మంచినీళ్లప్రాయంగా గుమ్మరించాయి. ఉప ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్, ఏకంగా 20 మంది మంత్రులు, 70కి పైగా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలను మోహరించింది. కనీవినీ ఎరుగని స్థాయిలో అధికార దుర్వినియోగానికి పాల్పడింది. చివరికి టీడీపీతో కూడా అంటకాగింది! పసుపు పార్టీ తరఫున కూడా 50 మంది దాకా ఎమ్మెల్యేలు కడప ప్రచార బరిలో దిగారు. ఇక, నైచ్యానికే నయా అర్థం చెబుతూ, పాలక-విపక్ష కూటమికి దన్నుగా ఎల్లో మీడియా ఎగజిమ్మిన విషం అంతా ఇంతా కాదు! మరోవైపు సీఎం, మాజీ సీఎం, విపక్ష నేత, ‘మెగా’స్టార్ వంటి అతిరథులు ప్రచారం పేరుతో తొడగొట్టారు. మీసం మెలేశారు. ఏకంగా మంత్రివర్యులే ఓటర్లను బెదిరింపులకు, భయాందోళనలకు గురిచేశారు. వీటన్నింటినీ మించి... ఉద్యమ నెలబాలుని వంటి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని అణగదొక్కేందుకు జరిగిన కుయత్నాలు అన్నీ ఇన్నీ కావు! పార్టీ నేతలపై కనీవినీ ఎరగనన్ని బైండోవర్ కేసులు మోపారు. ఇన్నింటిని ఒంటరిగానే ఎదుర్కొని... పార్టీ గుర్తును కేవలం 17 రోజుల వ్యవధిలో ప్రజల్లోకి తీసుకెళ్లి... అధికార, విపక్షాలను నేరుగా ఢీకొట్టి... మూకుమ్మడిగా మట్టి కరిపించి... మేరు పర్వతానికి సరితూగే స్థాయిలో జగన్మోహన్రెడ్డి సాధించిన మెజారిటీ... అద్భుతం, అనితరసాధ్యం!
కడప, న్యూస్‌లైన్:ఢిల్లీ దిమ్మ తిరిగింది.. కడప గడప తన సత్తా చాటింది.. రాష్ట్రంలో రాజకీయ మార్పునకు నాంది పలికింది.. అహంకారానికీ, ఆత్మగౌరవానికీ.. ఢిల్లీకి, కడపకు.. సోనియాకు, వైఎస్‌కు జరిగిన ఈ ‘ఉప’ సమరంలో.. 125 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ, 28 ఏళ్ల తెలుగుదేశం పార్టీ డిపాజిట్ కోల్పోయాయి. నెలల వయసున్న ‘వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ’.. చరిత్రాత్మక మెజార్టీతో విజయ దుందుభీ మోగించింది. కడప లోక్‌సభ, పులివెందుల శాసనసభ స్థానాలకు ఈ నెల 8న జరిగిన ఉప ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్రెడ్డి, వైఎస్ విజయమ్మలకు కడప ప్రజలు ఘన విజయాన్ని చేకూర్చారు. శుక్రవారం వెలువడిన ఫలితాల్లో కడపలో జగన్ 5,45,672 ఓట్ల భారీ మెజారిటీతో చరిత్ర సృష్టించారు. పులివెందుల చరిత్రలో ముందెన్నడూ లేని 81,373 ఓట్ల అఖండ మెజారిటీతో వైఎస్ విజయలక్ష్మి రికార్డు సృష్టించారు. ఈ ఎన్నికల్లో చావు తప్పి కన్ను లొట్టపోయిన చందంగా.. వైఎస్ వివేకానందరెడ్డి పులివెందుల శాసనసభ బరిలో డిపాజిట్ దక్కించుకున్నారు. పార్లమెంటు స్థానానికి జగన్‌తో పోటీ పడిన కాంగ్రెస్ అభ్యర్థి, మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి, తెలుగుదేశం అభ్యర్థి ఎం.వి. మైసూరారెడ్డి డిపాజిట్లు సైతం కోల్పోయారు.
ఎన్ని ఆటంకాలు సృష్టించినా బెదరని కడప ప్రజలు
ఉప ఎన్నికల షెడ్యూలు విడుదలైన నాటి నుంచీ అధికార కాంగ్రెస్ పార్టీ పాల్పడని అక్రమాలు లేవు. చేయని అధికార దుర్వినియోగం లేదు. వైఎస్ జగన్‌కు స్వాగతం పలికినా, జై కొట్టినా వారి అంతుచూశారు. పోలీసులను ఉసిగొల్పి వైఎస్ అభిమానులను స్టేషన్లకు ఈడ్చుకెళ్లి చావబాదారు. ఎన్నడూ పోలీస్‌స్టేషన్ మొహం చూడని వారిపై కూడా బైండోవర్ కేసులు నమోదు చేశారు. దేశ చరిత్రలోనే ఎక్కడా లేనంతగా 10 వేల పైచిలుకు బైండోవర్ కేసులు నమోదు చేసి.. పోలింగ్ తేదీ దగ్గర పడే కొద్దీ ప్రజల్లో భయాందోళనలు కలుగజేశారు. పోలింగ్ రోజున మరింత బీభత్సం జరుగుతుందనే వాతావరణం సృష్టించారు. మంత్రులు యావత్తూ జిల్లాలో తిష్ట వేసి మంత్రాంగం నడిపారు. జగన్, విజయలక్ష్మి పేర్లున్న వ్యక్తులతో నామినేషన్‌వేయించారు. పోలింగ్‌కు నాలుగు రోజుల ముందు నుండే డబ్బులు మంచినీళ్లలా ప్రవహింపజేశారు. ఓటర్లను కొనే ప్రయత్నం చేశారు. అయినా కడప ప్రజలు దేనికీ బెదరలేదు. డబ్బుకు ప్రలోభపడలేదు. ఎవరెన్ని చేసినా, ఎవరేమి చెప్పినా వినలేదు. ఉప్పెనలా పొంగి జగన్‌ను తమ ‘అభిమాన ఓటు’తో ముంచెత్తారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలను చావుదెబ్బ కొట్టారు.
వైఎస్‌ను అధిగమించిన జగన్, విజయమ్మ
42 మంది అభ్యర్థులు పోటీచేసిన కడపలో జగన్‌కు 5,45,672 ఓట్ల భారీ ఆధిక్యత లభించింది. 1991 ఎన్నికల్లో, ఆయన తండ్రి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డికి లభించిన 4,22,790 ఓట్ల ఆధిక్యతను జగన్ అధిగమించారు. పులివెందుల శాసనసభ బరిలోనూ వైఎస్ విజయమ్మ 81,373 ఓట్ల ఆధిక్యతతో, దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి మెజార్టీని అధిగమించారు. కాగా కాంగ్రెస్ రంగంలోకి దించిన నకిలీ జగన్‌మోహన్‌రెడ్డిలందరికీ కలిపి సుమారు 15 వేల ఓట్లు వచ్చాయి. జగన్‌కు పడాల్సిన ఓట్లు పొరపాటున వారికి పడి ఉంటాయని, లేదంటే అంత మొత్తంలో వారికి ఓట్లు రావని విశ్లేషకులు చెబుతున్నారు. కడప లోక్‌సభకు మొత్తం 10,30,973 ఓట్లు పోలవగా.. జగన్‌కు 6,92,251 ఓట్లు వచ్చాయి. డీఎల్‌కు 1,46,579 ఓట్లు దక్కాయి. మైసూరారెడ్డికి 1,29,565 ఓట్లు వచ్చాయి. డిపాజిట్ దక్కాలంటే.. పోలైన ఓట్లలో కనీసం ఆరోవంతు (1,71,829) ఓట్లు రావాలి.
ప్రతి నియోజకవర్గంలోనూ భారీ ఆధిక్యత
కడప పార్లమెంటు పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో జగన్‌కు రికార్డు స్థాయి భారీ ఆధిక్యత లభించింది. 82.64 శాతం పోలింగ్ జరిగిన పులివెందుల అసెంబ్లీ సెగ్మెంట్లో ఆయనకు రికార్డు స్థాయిలో 1,08,177 ఓట్ల మెజార్టీ వచ్చింది. 76.49 శాతం పోలైన ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ప్రజలు 74,771 ఓట్ల ఆధిక్యతనిచ్చారు. కాంగ్రెస్ అభ్యర్థి డీఎల్ రవీంద్రారెడ్డి సొంత నియోజకవర్గం మైదుకూరులో సైతం జగన్‌కు 70,147 ఓట్ల మెజార్టీ లభించింది. జమ్మలమడుగు నియోజకవర్గంలో 83.18 శాతం పోలింగ్ జరగగా, అక్కడ వైఎస్ జగన్‌కు తెలుగుదేశం పార్టీపై 67,483 ఓట్ల ఆధిక్యత లభించింది. 84.58 శాతం పోలింగ్ జరిగిన కమలాపురం నియోజకవర్గంలో 65,882 ఓట్ల ఆధిక్యత లభించింది. 75.25 శాతం పోలింగ్ జరిగిన బద్వేలు నియోజకవర్గంలో 61,463 ఓట్ల మెజార్టీ లభించింది. ముస్లిం మైనార్టీలు నిర్ణాయక శక్తిగా ఉన్న కడప అసెంబ్లీ సెగ్మెంట్లో అతి తక్కువగా 61.57 శాతం పోలింగ్ జరిగినప్పటికీ.. జగన్‌కు 67, 785 ఓట్ల ఆధిక్యత రావడం విశేషం. ఓటింగ్‌లో అధికంగా పాల్గొన్న ముస్లిం మైనార్టీలంతా వైఎస్ఆర్ తనయుడివైపే నిలిచారనేందుకు ఇదో నిదర్శనం.
విజయమ్మకు భారీ ఆధిక్యత
విజయమ్మకు పులివెందుల ప్రజలు అఖండ మెజార్టీని అందించారు. ఇక్కడ 25 మంది అభ్యర్థులు పోటీ చయగా.. ఆమెకు 81,373 ఓట్ల ఆధిక్యత లభించింది. ఇక్కడ పోలైన 1,57,092 ఓట్లలో విజయమ్మకు 1,10,098 ఓట్లు లభించగా.. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వైఎస్ వివేకానందరెడ్డికి 28,725 ఓట్లు లభించాయి. తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసిన రవీంద్రనాథ్‌రెడ్డి (బీటెక్ రవి) 11,239 ఓట్లు మాత్రమే సాధించి డిపాజిట్ కోల్పోయారు.