Post date: May 04, 2011 7:1:47 AM
ముస్లింలకు 4 శాతంరాజకీయ రిజర్వేషన్లు, ముస్లింలకు ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఇచ్చింది వైఎస్ఆరే..
కాంగ్రెస్‌కు సంబంధంలేదు: జగన్
కాంగ్రెస్‌కు ముస్లింలపై ప్రేమ ఉంటే దేశ మంతా అమలెందుకు చేయదు?
ఎల్లో మీడియా, బాబు శనిగ్రహాలు.. తప్పుడు రాతలు రాస్తున్నారు
ముస్లింలకు బీజేపీ 10 శాతం రిజర్వేషన్లు కల్పించగలదా అని నేను మాట్లాడినదంతా కత్తిరించి.. అబద్ధాలు ప్రసారం చేస్తున్నారు
బీజేపీతో పొత్తుపెట్టుకునేదే లేదు
ముస్లిం సోదరులకు దివంగత మహానేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి కల్పించిన నాలుగు శాతం ఉద్యోగ రిజర్వేషన్లతో పాటు.. కొత్తగా నాలుగు శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పిస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, కడప లోక్‌సభ అభ్యర్థి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. వైఎస్ఆర్ పార్టీ నుంచి ముస్లిం మైనారిటీలను దూరం చేసేందుకు.. ఈనాడు రామోజీ, ఆంధ్రజ్యోతి, టీవీ 9, చంద్రబాబు కుట్రపన్ని దుష్ర్పచారం చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా జగన్ మంగళవారం మైదుకూరు నియోజకవర్గంలోని మైదుకూరు, చాపాడు, ఖాజీపేట మండలాల్లో రోడ్ షో నిర్వహించారు.
లోక్‌సభ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి, ఆరోగ్యశాఖ మంత్రి డి.ఎల్.రవీంద్రారెడ్డి సొంత నియోజకవర్గమైన మైదుకూరులో జగన్‌కు జనం అపూర్వ స్వాగతం పలికారు. అక్కున చేర్చుకొని ఆదరించారు. మైదుకూరు నియోజకవర్గ కేంద్రంలో హాజీ దస్తగిరి నివాసంలో ముస్లిం మైనారిటీలు ఏర్పాటు చేసుకున్నసమావేశానికి జగన్ హాజరయ్యారు. మైదుకూరు, ఖాదర్‌పల్లె రోడ్ షోకు భారీగా తరలి వచ్చిన ప్రజలను ఉద్దేశించి యువనేత ప్రసంగించారు. జగన్ చేరుకునే సమయంలో మైదుకూరు పట్టణంలో విద్యుత్తు సరఫరా నిలిపివేశారు. ప్రొద్దుటూరు రోడ్ షోలో ‘ముస్లింలకు బీజేపీ 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తే.. పొత్తు అంశం’ అనే మాటను ఏ సందర్భంగా మాట్లాడానో ఆయన వివరించారు. జగన్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే...
‘‘దివంగత మహానేత వైఎస్ఆర్ ముస్లిం సోదరులను ఆత్మబంధువులుగానే చూశారు. అందుకే వారికి నాలుగు శాతం ఉద్యోగ రిజర్వేషన్లు కల్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లింల ఓట్లను బ్లాంక్ చెక్కులుగానే చూస్తోంది. అవసరానికి ఓట్లు వేయించుకుని వదిలేస్తోంది. ముస్లింలకు వైఎస్ఆర్ వ్యక్తిగతంగా సొంత నిర్ణయాలతో తెచ్చిన రిజర్వేషన్ల్లు ఇవి. ఈ రిజర్వేషన్లతో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు. నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి ముస్లింలపై ప్రేమ ఉంటే.. వారికి దేశ వ్యాప్తంగా నాలుగు శాతం రిజర్వేషన్లు ఎందుకు అమలు చేయటం లేదు? రాష్ట్రంలో ముస్లింలకు దివంగత నేత ఇచ్చిన ఉద్యోగ రిజర్వేషన్లతో పాటు నాలుగు శాతం రాజకీయ రిజర్వేషన్లు కూడా కల్పిస్తాం. ఈనాడు రామోజీ, ఆంధ్రజ్యోతి, టీవీ 9, చంద్రబాబు శనిగ్రహాలు.. ఈ నాలుగు గ్రహాలకు సోనియాగాంధీ అనే పెద్ద గ్రహం తోడైంది. ఆ వేళ ప్రొద్దుటూరులో దాదాపు పది నిమిషాలు మాట్లాడినాను. మాటలు ఘాటుగా సూటిగా చెప్పటానికి.. ముస్లింలకు దేశ వ్యాప్తంగా 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తే బీజేపీకి మద్దతు ఇచ్చే విషయాన్ని ఆలోచిస్తానని చెప్పాను. సాధ్యం కాని పనుల గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు.. చంద్రుడు నేలకు దిగివస్తే, సూర్యుడు ఆకాశం నుంచి భూమి మీదకు వస్తే ఫలానా పని చేసిపెడతానని సర్వసాధారణంగా చెప్తుంటారు. నాలుగు శాతం రిజర్వేషన్లనే అంగీకరించని బీజేపీ.. 10 శాతాన్ని ఎలా ఒప్పుకుంటుందని, అలాంటి పార్టీతో నేను ఎలా పొత్తు పెట్టుకుంటానని గట్టిగా చెప్పటం కోసమో అలా అన్నాను.
వైఎస్ఆర్ సాక్షిగా మతతత్వ బీజేపీ పార్టీతో ఎట్టి పరిస్థితుల్లో పొత్తు పెట్టుకోనని స్పష్టంగా చెప్పటానికే.. పది శాతం రిజర్వేషన్లు కల్పిస్తే అనే మాటను ఉపయోగించాను. నేను మాట్లాడిన దానిలో ఏం తప్పుంది? ఎల్లో మీడియా నా మాటలను వక్రీకరించింది. నేను మాట్లాడిన పది నిమిషాల ప్రసంగంలో తొమ్మిది నిమిషాల మాటలను కత్తిరించి.. కేవలం చివరి మాటలను మాత్రమే ప్రసారం చేసి, నేను బీజీపీకి మద్దతిస్తున్నాననే అబద్ధాన్ని నిజం అని నమ్మించేందుకు చెప్పిందే చెప్పి, చెప్పిందే చెప్పి ప్రజలను నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఇలాంటి తప్పుడు సమాచారం ప్రజలకు చేరవేస్తూ.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ముస్లిం సోదరులను దూరం చేసేందుకు కుట్ర చేస్తున్నారు. పైగా.. బళ్లారి జనార్దన్‌రెడ్డి నాకు చెప్తున్నాడు, చెప్తున్నాడు అంటున్నారు. ఏం వైఎస్ఆర్ సీఎంగా ఉన్నప్పుడు బళ్లారి జనార్దన్‌రెడ్డితో రిలేషన్స్ లేవా అని అడుగుతున్నా. ప్రజలు తమ పార్టీల గురించి, రాజకీయ నేతల గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు ఫలానా పార్టీ మా పార్టీ అని, ఫలానా నాయకుడు మా నాయకుడు అని సగర్వంగా తలెత్తుకొని చెప్పే విధంగా ఉండాలి. మాట ఇచ్చి తప్పిన నేతలు కనుమరుగై పోతారు. విశ్వసనీయత కోసం, రాజకీయ విలువలు కాపాడటం కోసం నేను, నా తల్లి విజయమ్మ రాజీనామా చేసి మళ్లీ మీ ముందుకు వచ్చాం. నా విశ్వసనీయతతో సోనియా విశ్వసనీయతను పోల్చిచూసి.. నా విశ్వసనీయత, రాజకీయ విలువలపై విశ్వాసం ఉంచిన ప్రజలకు, ముస్లిం సోదరులకు కృతజ్ఞతలు. అవ్వలు.. తాతల మొఖంలో ఇప్పుడున్న నవ్వులు ఇంకా చిక్కగా ఉండాలంటే ఫ్యాన్ గుర్తుకు ఓటేయండి’’ అని జగన్ కోరారు.
రాజకీయాలంటే తొడగొట్టటం కాదు..
‘‘అయ్యా... చిరంజీవీ! మా వాళ్లకు కూడా పౌరుషం ఉంది. కానీ వాళ్లకు నీలాగ సినిమా స్టైల్లో తొడగొట్టటం రాదు. మీసం దువ్వటం రాదు. ప్రేమను పంచటమే తెలుసు. నువ్వు తొడగొడుతున్నావు. నీకు మాత్రం నా ముద్దులు పెడుతున్నాను. ఇదిగో ముద్దులు (అంటూ గాలిలోకి మూడు ముద్దులు విసిరారు). రాజకీయాలు అంటే తొడలు చరచటం, మీసం దువ్వటం కాదు. ప్రజల కష్టాలను తెలుసుకోవటం, ప్రజల సమస్యల గురించి ఆలోచించటం, వారికి చేతనైనంతలో సహాయం చేయటం అని కాంగ్రెస్ నేతలు తెలుసుకోవాలి. మరొకాయనకు దివంగత నేత కలలో చెప్పాడట. ఇలాంటి నీచ రాజకీయాలు మానుకొని ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నించండి’’ అని జగన్ హితవుపలికారు.
డీఎల్ ముస్లింలపై బెదిరింపులు మానుకో....
డి.ఎల్.రవీంద్రారెడ్డి ఒక మంత్రిగా కాకుండా కంత్రీలా వ్యవహరిస్తున్నారని.. మైదుకూరు, ఖాజీపేటల్లో ముస్లిం మైనారిటీ నేతలపై బెదిరింపులకు, దౌర్జన్యానికి పాల్పడుతున్నారని మైనారిటీ నాయకులు గౌస్‌లాజం, హాజీ ద స్తగిరిలు ధ్వజమెత్తారు. డీఎల్ తన పద్ధతి మానుకోకపోతే ముస్లింలను కూడగట్టి రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. జగన్ వెంట మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి, మాజీమంత్రి మారెప్ప, మాజీ ఎమ్మెల్యేలు రఘురామిరెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్‌రెడ్డి తదితరులు ఉన్నారు.