Post date: Aug 20, 2011 12:8:42 PM
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ.. ప్రధాని మన్మోహన్ సింగ్.కు లేఖ రాశారు. జగన్ పై సీబీఐ చేస్తున్న దాడులపై ముఖ్యంగా ఆమె లేఖలో ప్రస్తావించారు. సోదాలకు కాంగ్రెస్ అధిష్టానానికి సంబంధం లేదా అని లేఖలో ప్రశ్నించారు. తమ కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తులకు సంబంధించి సిబిఐ సోదాల వెనుక కాంగ్రెస్ పార్టీ అధిష్టానం లేదా? కాంగ్రెస్ పార్టీని వదిలివేస్తే అవినీతిపరులవుతారా? నిజాయితీ లేనివాళ్లవుతారా? అని ఆమె లేఖలో ప్రధానిని ప్రశ్నించారు. జరుగుతున్న పరిణామాలతో భారమైన హృదయంతో.. పార్టీ తరపున.. తాను వ్యక్తిగతంగా ఈ లేఖ రాస్తున్నట్లు ఆమె తెలిపారు. వేలాది కేసులు పెండింగ్.లో ఉన్నప్పటికీ.. జగన్. ఆస్తుల వ్యవహారంలో సీబీఐ వ్యవహరిస్తున్న తీరు అనేక అనుమానాలకు తావిస్తోందని ఆమె పేర్కొన్నారు. ఎఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి విధేయుడుగా ఉన్నప్పుడు నిజాయితీపరుడుగా ఉన్న జగన్.. ఇప్పుడు ఎలా అవినీతి పరుడయ్యాడని ఆమె ప్రశ్నించారు. జగన్.కు వస్తున్న ప్రజాధరణను దెబ్బతీయడానికే ఈ దాడులని స్సష్టమవుతోందని ఆమె పేర్కొన్నారు. అన్నా హజారే లాంటి వ్యక్తిపైనే అవినీతి ఆరోపణలు చేస్తున్నారంటే.. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉంటే ఏమైనా చేస్తారన్న భావన ప్రజలలో వ్యక్తమవుతోందన్నారు. దాదాపు అయిదు పేజీల లేఖను రాసిన విజయమ్మ.. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వాన్ని నియంత్రిస్తున్న శక్తుల నుంచి దేశాన్ని కాపాడాలని ఆమె ప్రధానికి విజ్ఞప్తి చేశారు.