Post date: Apr 22, 2011 5:14:34 AM
* వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సీలింగ్ ఫ్యాన్ గుర్తు రావడం దేవుడి వరమని హర్షం
* ‘దేవుని కడప’లో వర్షం కురుస్తుండగా జగన్‌కు అందిన సమాచారం
* సీలింగ్ ఫ్యాన్‌కు ఓటెయ్యాలంటూ ప్రజలకు యువనేత వినతి
* జగన్, విజయలక్ష్మికి కామన్ గుర్తు కేటాయించిన ఎన్నికల అధికారులు
* ఎన్నికల గుర్తుపై అధికార పార్టీ కుట్రలు పటాపంచలు
* సీలింగ్ ఫ్యాన్ గుర్తుకోసం పోటీపడిన డమ్మీ అభ్యర్థులు
* ఎన్నికల కమిషన్ నిబంధనలపై పట్టుబట్టి గుర్తు దక్కించుకున్న ‘వైఎస్ఆర్
* కాంగ్రెస్ పార్టీ’ ప్రతినిధులు... సీలింగ్ ఫ్యాన్ గుర్తుతో ప్రచారం ముమ్మరం
* వేంపల్లె దళితవాడలో విజయలక్ష్మి ప్రచారంలో ఉండగా.. ఇళ్లలో నుంచి సీలింగ్ ఫ్యాన్లు తెచ్చి ప్రదర్శించిన అభిమానులు
‘ఈ ఎన్నికల గుర్తు దేవుని తొలి గడపలో మన పార్టీకి దేవుడిచ్చిన వరం’.. ఇదీ తమకు సీలింగ్ ఫ్యాన్ గుర్తు లభించిందని తెలియగానే వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన వ్యాఖ్య. గురువారం సాయంత్రం తిరుమల దేవుని తొలిగడప ‘దేవుని కడప’లో శ్రీ లక్ష్మీవెంకటేశ్వర స్మామి వారి ప్రాంగణం వద్ద జగన్ ఎన్నికల ప్రచారంలో ఉండగా.. తనకు, తన తల్లి విజయలక్ష్మికి ఒకటే గుర్తుగా ‘సీలింగ్ ఫ్యాన్’ కేటాయించిన విషయం తెలిసింది. దీనికి కొద్ది క్షణాల ముందు.. తీవ్రంగా ఉన్న ఎండ అప్పుడే మాయమై.. వర్షం చినుకుల రాక మొదలవడం గమనార్హం.
‘తెలుగు దేశం నేతలకు, కాంగ్రెస్ పెద్దలకు లేనిది, నాకు, నాతల్లి విజయమ్మకు మాత్రమే ఉన్నది ఆ దేవుని దయ, నాన్నగారి ఆశీస్సులు’ అంటూ జగన్ ప్రసంగం సాగుతుండగా ఆయనకు గుర్తు సమాచారం అందింది. దీంతో ‘మనకు సీలింగ్ ఫ్యాన్ గుర్తు వచ్చింది.. ఇది దేవుడిచ్చిన వరం’ అంటూ ప్రసంగాన్ని ముగించిన యువనేత పక్కనే ఉన్న శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని.. ప్రచారం కొనసాగించారు. మరోవైపు జగన్, విజయమ్మలకు ‘సీలింగ్ ఫ్యాన్’ గుర్తును కేటాయించినట్లు అధికారిక ప్రకటన వెలువడగానే.. పార్టీ నాయకులు, కార్యకర్తలు సీలింగ్ ఫ్యాన్లు చేతబట్టి ప్రచారాన్ని ముమ్మరం చేశారు.
మరో కుట్ర పటాపంచలు
కడప లోక్‌సభ, పులివెందుల అసెంబ్లీకి జరుగుతున్న ఉప ఎన్నికలు రాష్ట్ర ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి జీవన్మరణ సమస్యగా పరిణమించాయి. దీంతో కాంగ్రెస్ అధినేత్రి సోనియా ఆదేశాల మేరకు సీఎం కిరణ్ కుమార్‌రెడ్డి.. పలు కుట్రలకు, కుతంత్రాలకు తెరతీశారు. జగన్, విజయమ్మలకు వేర్వేరు గుర్తులు వచ్చేలా చేసేందుకు అనేక డ్రామాలు నడిపారు. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం రంగంలో మిగిలిన డమ్మీ అభ్యర్థులు అనేక మంది తమకు సీలింగ్ ఫ్యాన్ గుర్తు కేటాయించాలని రిటర్నింగ్ అధికారులను కోరారు. ఈ మేరకు వారి మీద ఒత్తిడి కూడా చేయించారని సమాచారం.
ఈసీ నిబంధనలపై వైఎస్ఆర్ పార్టీ పట్టు
రాజీనామా చేసి స్వతంత్రులుగా బరిలోకి దిగే సిట్టింగ్ ప్రజాప్రతినిధులకు గుర్తు కేటాయింపులో ప్రాధాన్యత ఇవ్వాలన్నది నిబంధన. దాన్ని తుంగలోతొక్కి సీలింగ్ ఫ్యాను గుర్తు దక్కకుండా, తాము దక్కించుకోవాలని స్వతంత్ర అభ్యర్థులు రిటర్నింగ్ అధికారుల మీద ఒత్తిడి తెచ్చారు. గుర్తుల కేటాయింపు కార్యక్రమానికి హాజరైన వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రతినిధులు ఎన్నికల కమిషన్ నిబంధనలను అధికారులకు వివరించి తమకు ప్రాధాన్యమివ్వాలని కోరారు. ఆ మేరకు.. విజయమ్మ, జగన్‌లకే అధికారులు తొలి ప్రాధాన్యమిచ్చి ఇద్దరికీ సీలింగ్ ఫ్యాన్ కేటాయించారు. విజయమ్మ వేంపల్లె దళితవాడలో ప్రచారంలో ఉండగా.. గుర్తు ఖరారు సమాచారం అందింది. దీంతో ఆమె అక్కడి నుంచే సీలింగ్ ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని ప్రజలను అభ్యర్థిస్తూ ప్రచారాన్ని ముమ్మరం చేశారు.