Post date: May 05, 2011 1:0:54 PM
దివంగత మహానేత వైఎస్ఆర్ సంక్షేమ పథకాలను, విధి విధానాలను కొనసాగించేందుకు బయటకు వెళ్లిన తన తల్లి, దివంగత నేత వైఎస్ సతీమణి విజయమ్మను ఆశీర్వదించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, కడప పార్లమెంటు అభ్యర్థి వై.ఎస్. జగన్ మోహన్‌రెడ్డి కోరారు. నలుగురికీ అన్నంపెట్టిన చేయి ఆ తల్లిది.. ఆ తల్లిని కాదని చెప్పి.. కుడిచేయి వేరేవైపు పోదని ఆయన భరోసా వ్యక్తం చేశారు. బుధవారం జగన్ పులివెందుల నియోజకవర్గం వేంపల్లె మండలంలోని పలు గ్రామాల్లో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్వేగపూరితమైన ప్రసంగాలు చేశారు. కొన్ని ప్రాంతాలలో జగన్ మాట్లాడుతున్నప్పుడు ఆయన కళ్లు చెమర్చాయి. గొంతు జీరబోయింది. భర్తను పోగొట్టుకుని పుట్టెడు దుఃఖంలో ఉన్న నా తల్లి ఆప్యాయతను, అనురాగాలు పంచివ్వమని అన్న తమ్ముళ్లను కోరుతోంది. మండుటెండలో వీధివీధి తిరుగుతూ దీవించమని అవ్వ,తాతలను వేడుకుంటోంది. ఆ తల్లిని కాద ని.. చెప్పి కుడిచేయి వేరేవైపు పోగలుగుతుందా.. అన్నారు.
ఇప్పుడున్న నేతలకు అత్తెసరు మార్కులూ రావు
పాములూరు గ్రామంలో 7వ తరగతి విద్యార్థిని తుమ్మలూరు ప్రీతి తాను ప్రసంగిస్తానంటూ మైకు అందుకుంది. మాకు పరీక్షలు పెట్టినట్లుగానే రాజకీయ నాయకులకు కూడా విశ్వసనీయత మీద, ఇచ్చిన మాటలు నెరవేర్చడంలో పరీక్షలు పెట్టాలని కోరింది. ఈ రాష్ట్రానికి, భావితరాలకు కావాల్సింది.. సీల్డ్ కవర్లో వస్తున్న ముఖ్యమంత్రులు కాదు... ప్రజలనుంచి పుట్టిన ప్రజా నాయకుడు కావాలని ఆ చిన్నారి కోరింది. ఆ చిన్నారి మాటలకు ఉద్వేగానికిలోనైన జగన్ మాట్లాడుతూ ఒకవేళ రాజకీయ నాయకులకు కూడా నా చిట్టి తల్లి కోరినట్లుగా విశ్వసనీయత పరీక్షలు పెడితే ఇప్పుడున్న రాజకీయ నేతలలో ఏ ఒక్కరికి కూడా అత్తెసరు మార్కులు కూడా రావని, అందరూ గాలికి కొట్టుకుపోతారన్నారు. మహానేత వైఎస్ పుణ్యాన సోనియాగాంధీ ఢిల్లీలో చక్రం తిప్పుతోంది. మహానేత కుటుంబాన్ని సోనియా నిట్టనిలువునా చీల్చింది. నా తల్లి విజయమ్మపై నా చిన్నాన్ననే పోటీకి దించింది. మంత్రులకు హఠాత్తుగా కులం గుర్తుకొచ్చింది. కులంలోని పేదలు గుర్తుకొచ్చారు. ఎన్నికల వేళ కులాలను వెతుక్కుంటూ కడపలో తిరుగుతున్నారు. మూటలకొద్దీ డబ్బులు తెచ్చి కులాలవారీగా ప్రేమను, ఆప్యాయతలను డబ్బులను పెట్టి కొనాలని చూస్తున్నారు. ఈ ఆటలు ఇక్కడ సాగవని జగన్ హెచ్చరించారు. జగన్ వెంట రోడ్‌షోలో పాల్గొన్న వారిలో మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, తుడా మాజీ చైర్మన్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, వాసిరెడ్డి పద్మ, వైఎస్. అవినాష్ తదితరులు ఉన్నారు