Post date: Aug 18, 2011 12:31:15 PM
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆస్తులపై గురువారం సీబీఐ సోదాలు చేపట్టడంతో జగన్ వర్గంలో అలజడి మొదలయింది. పైకి గట్టిగా మాట్లాడినా వారిలో ఆందోళన స్పష్టంగా కనిపించింది. దీంతో జగన్, ఆయన అనుచరులు సీబీఐ సోదాలను తమపై సానుభూతి కురిపించేలా మలచుకునేందుకు ప్రయత్నించారు. జగన్ తో పాటు ఆయన అనుచరులు సీబీఐ సోదాలపై ఏం మాట్లాడారంటే…
నాన్న పుణ్యమే సోనిఃయాకు అధికారం..
దేశంలో సోనియాగాంధీ నేడు రాజ్యమేలుతున్నారంటే వైఎస్ రాజశేఖరరెడ్డి రెక్కల కష్టం ఫలితమేనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఆయన కృష్ణాజిల్లా ఓదార్పుయాత్రలో మాట్లాడుతు వైఎస్‌ను అప్రతిష్టపాలు చేసేందుకు కాంగ్రెస్ విలువలు మరిచి టీడీపీతో కుమ్మక్కై కుట్ర చేస్తోందని విమర్శించారు.
జగన్ వి చట్టబద్ద వ్యాపారాలు…
వైఎస్ జగన్మోహన్రెడ్డి చేస్తున్న వ్యాపారాలన్ని చట్టబద్ధం, న్యాయబద్ధమైనవేనని వైఎస్ఆర్ కాంగ్రస్ పార్టీ నేత కేకే మహేందర్‌రెడ్డి అన్నారు. జగన్‌ను వేధించేవారిని దేవుడే శిక్షిస్తారని, క్షక సాధింపులకు పాల్పడుతున్న కాంగ్రెస్ మూల్యం చెల్లించుకోక తప్పదని అన్నారు.
దమ్ముంటే ఎన్నికలకు రావాలి..
దమ్ముంటే ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు రావాలని, ఎవరి పాపం ఏంటో తేలుతుందని మాజీ మంత్రి కొండా సురేఖ సవాల్ విసిరారు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో పనిచేసిన మంత్రులంతా స్వచ్చందంగా సీబీఐ విచారణకు ముందుకు రావాలని డిమాండ్ చేశారు.
సీబీఐది అత్యుత్సాహం..
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో సీబీఐ విచారణ నిష్పక్షపాతంగా జరగాలని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. దర్యాప్తు విషయంలో ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు ఉండకూడదని అన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా సీబీఐ ఇంతటి అత్యుత్సాహం ప్రదర్శించటం దేశంలోనే తొలిసారి అని అన్నారు. చంద్రబాబు, వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోని మంత్రులపైనా విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. వైఎస్ జగన్ తో తాను ఫోన్ లో మాట్లాడానని, సీబీఐ విచారణకు సహకరించాలని అందరికీ విజ్ఞప్తి చేశారని బాలినేని తెలిపారు.
జగన్ కడిగిన ముత్యం..
కాంగ్రెస్ ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా సీబీఐ విచారణ అనంతరం వైఎస్ జగన్మోహన్రెడ్డి కడిగిన ముత్యంలా బయటకు వస్తారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత పీఎన్వీ ప్రసాద్ అన్నారు. జగన్‌ను ఎదుర్కొనే సత్తా లేనందునే కాంగ్రెస్ క్షక సాధింపు చర్యలకు పాల్పడుతుందన్నారు. ఇటువంటి తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ మూల్యం చెల్లిస్తుంది..
వైఎస్ జగన్మోహన్రెడ్డిపై చేస్తున్న కుట్రలకు కాంగ్రెస్ పార్టీ త్వరలోనే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి అన్నారు. వైఎస్ జగన్‌కు జనంలో వస్తున్న అనూహ్య స్పందనను చూసి కాంగ్రెస్ నేతలు ఓర్వలేకపోతున్నారన్నారు. జగన్‌ను ఇబ్బందిపెడుతున్నామని కాంగ్రెస్ సంతోషపడుతుందని, వైఎస్ కుటుంబంపై కక్ష సాధింపు చర్యలతో ప్రజలు మనోవేదనకు గురి అవుతున్నారని ఆమె అన్నారు.
వైఎస్ జగన్‌పై కాంగ్రెస్ పార్టీ దాదాగిరి, దౌర్జన్యం చేస్తోందని తుడా మాజీ ఛైర్మన్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అన్నారు. అందుకు సీబీఐని పావుగా వాడుకుంటోందని విమర్శించారు. కక్ష సాధింపు చర్యలలో భాగంగానే వైఎస్ జగన్‌పై సీబీఐతో దాడులు చేయిస్తోందని, అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందన్నారు.
కాంగ్రెస్ ను వీడినందుకే….
వైఎస్ జగన్మోహన్రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడటం వల్లే సీబీఐ దాడులు జరుగుతున్నాయని ఎమ్మెల్సీ పుల్లా పద్మావతి అన్నారు. ఆమె గురువారం ఇక్కడ విలేకర్లతో మాట్లాడుతు కాంగ్రెస్ పార్టీలో ఉన్నవారిపై ఆరోపణలు వస్తే ఏసీబీ వంటి సంస్థలు వారికి క్లీన్చిట్ ఇస్తాయని వ్యాఖ్యానించారు.